వెంకటేష్-వరుణ్ ల కాంబినేషన్ లో వచ్చిన “ఎఫ్ 2” ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ తరహాలో విడుదలైన తాజా చిత్రం “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ఈజీ మనీ కోసం నిరంతరం కలలు కనే వ్యక్తులు వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్). రకరకాల బిజినెస్ ఐడియాలతో ఉన్న డబ్బు పోగొట్టుకుని, డబ్బు ఎలా సంపాదించాలా అని నానా కష్టాలు పడుతుంటారు. ఆ క్రమంలో ఓ డబ్బు బిజినెస్ మ్యాన్ (మురళీ శర్మ) తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతున్నాడు అని తెలిసి.. అతని కొడుకులా ఇంటికి వెళతారు.
చివరికి ఏం జరిగింది? అసలు మురళీశర్మ కొడుకు ఎలా తప్పిపోయాడు? మురళీ శర్మను మచ్చిక చేసుకోవడానికి వెంకీ-వరుణ్ లు పడిన ఇబ్బందులు ఏమిటి? అనేది “ఎఫ్ 3” కథాంశం.
నటీనటుల పనితీరు: వెంకీ మరోమారు తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన గెటప్స్ & మ్యానరిజమ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకోవడం ఖాయం. వెంకీతో సమానంగా వరుణ్ కూడా పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.
తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ లు గ్లామర్ షోతో ఆకట్టుకోగా.. చాన్నాళ్ల తర్వాత సునీల్, అలీ, రఘుబాబులు తమ కామెడీతో అలరించారు. మురళీశర్మ క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ.. సినిమాకి కీలకాంశంగా మారింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ విషయంలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టిని గట్టిగా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. “లాజిక్కా.. తొక్కా” అనే తరహాలో లాజిక్ కు ఎక్కడా అవకాశం అనేది లేకుండా సినిమా మొత్తం కామెడీ సీన్లతో నింపేశాడు. స్క్రీన్ ప్లే కూడా గాలికొదిలేశాడు. అయితే.. కామెడీ మాత్రం కోరి కోరి వడ్డించాడు. అందువల్ల ఫ్యామిలీ & జనరల్ ఆడియన్స్ కు సినిమా విపరీతంగా నచ్చేస్తుంది. ముఖ్యంగా.. అందరు స్టార్ హీరోల రిఫరెన్సులు సినిమాలో నింపేసి, అందరి ఫ్యాన్స్ ను ఖుష్ చేశాడు.
అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడా వల్గారిటీ లేకుండా సినిమాను నడిపించిన విధానం ప్రశంసనీయం. కానీ.. తమన్నాను అబ్బాయిగా చూపించి, ఆమెకు సోనాల్ చౌహాన్ లైన్ వేసే ఎపిసోడ్ మాత్రం చూడ్డానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎనర్జీ యాడ్ చేస్తే.. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ సోసోగా ఉన్నప్పటికీ.. కామెడీ పుణ్యమా అని అవన్నీ ప్రేక్షకులు పట్టించుకోకుండా చేశాయి.
విశ్లేషణ: స్క్రీన్ ప్లే & లాజిక్ అనేది ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా కామెడీ సీన్లు, వెంకీ-వరుణ్ ల కామెడీ టైమింగ్, హీరోయిన్ల అందాలు, పూజా హెగ్డే స్పెషల్ అపీరియన్స్ లు కలగలిసి “ఎఫ్ 3” ని సూపర్ హిట్ గా నిలిపాయి అనే చెప్పాలి.
రేటింగ్: 2.5/5