టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ గత సినిమాలైన నారప్ప, దృశ్యం2 సినిమాలను ఓటీటీలో విడుదల చేశారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో ఈ సినిమాలను రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. చాలాకాలం తర్వాత వెంకీ నటించిన ఎఫ్3 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. మరోవైపు వరుణ్ తేజ్ నటించిన గని థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.
50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా రాలేదు. వరుణ్ తేజ్ కు సైతం ఎఫ్3 సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. అయితే వెంకీ, వరుణ్ తేజ్ అభిమానులను ఎఫ్3 సెంటిమెంట్ తెగ టెన్షన్ పెడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టు ముందుగానే ప్రకటించిన సినిమాలు హిట్టవుతున్నా సీక్వెల్ గా తెరకెక్కిన సినిమాలు మాత్రం సక్సెస్ కాలేదు.
దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్3 సినిమా తెరకెక్కడం గమనార్హం. మనీ సినిమాకు సీక్వెల్ గా మనీమనీ, మనీమనీ మోర్ మనీ తెరకెక్కగా ఈ సినిమాలు సక్సెస్ సాధించలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సీక్వెల్ గా తెరకెక్కిన శంకర్ దాదా జిందాబాద్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి, వినాయకుడు సీక్వెల్ విలేజ్ లో వినాయకుడు ప్రేక్షకులను మెప్పించలేదు.
ఆర్య, కిక్, గబ్బర్ సింగ్ సినిమాల సీక్వెల్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఎఫ్3 ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఎఫ్3 సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్ల కోసమే 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.