BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు, నటుడు, ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ (75) కన్నుమూశారు. జూన్‌ 30 (సోమవారం)న రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. జయ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలు కాగా, తనయుడు అమెరికాలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు.

BV Pattabhiram

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భావరాజు సత్యనారాయణ సంతానంలోని 15 మందిలో బీవీ పట్టాభిరామ్‌ ఒకరు. కాకినాడలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన చిన్నతనంలో వచ్చిన కాలి అవిటితనాన్ని కూడా జయించి మెజీషియన్‌గా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1984లో హైదరాబాద్‌లో రవీంద్ర భారతి నుంచి చార్మినార్‌కు, అక్కడి నుంచి తిరిగి రవీంద్ర భారతికి కళ్లకు గంతలు కట్టుకుని ట్రాఫిక్‌లో స్కూటర్‌ నడిపి పాపులర్‌ అయ్యారు.

ఆ తర్వాత నందమూరి తారకరామారావు ప్రోత్సాహంతో ప్రభుత్వం పథకాలకు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలకు ప్రచారం చేశారు. ఆకాశావాణి, దూరదర్శన్‌లో విద్యను ఓ విజ్ఞాన శాస్త్రంగా ప్రచారం కల్పించారు. ఆ తర్వాత దూరదర్శన్‌లో కొన్ని సీరియల్స్‌లో నటించారు. ఆ వెంటనే సినిమాల్లో కూడా కనిపించారు. జంధ్యాల సినిమాలు, యండమూరి వీరేంద్రనాథ్‌ కథలతో తెరకెక్కించిన సినిమాల్లో మెజీషియన్‌గా కనిపించి మెప్పించారు.

ఈ క్రమంలో ఆయనకు టాలీవుడ్‌ ప్రముఖ నటులు చాలామంది ఫ్యాన్స్‌ అయిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులు హైదరాబద్‌లో అక్షరజ్యోతి అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. పెద్ద మీడియా సంస్థల్లో ప్రముఖ పాత్రికేయులతో కలసి పని చేశారు. దేశ విదేశాల్లో మ్యాజిక్‌లు, హిప్నటిజం ప్రద్శనలు చేశారు. ఆ తర్వాత ఎక్కువగా కౌన్సిలింగ్‌లు ఇచ్చేవారు. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు నిలిచాయి అని చెబుతారు.

పట్టాభిరామ్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండుసార్లు కళారత్న పురస్కారం వచ్చింది. ఆ తర్వాత జాతీయ స్థాయి పురస్కారాలు కూడా పొందారు. ఇక ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ ప్రచురితం అవుతూనే ఉన్నాయి. పాఠకులు చదువుతూనే ఉన్నారు.

ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus