క్రిష్ కి సినిమా అభిమాని ప్రేమ లేఖ..!

  • January 11, 2019 / 11:54 AM IST

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలయిన సంగతి తెలిసిందే. మహానటుడు, గొప్ప నేత అయిన ‘ఎన్టీఆర్’ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షో నుండే మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వర్ణిస్తూ… దర్శకుడు క్రిష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఓ అభిమాని లేఖ రాసాడు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతలా ఆ లేఖలో.. ఏముంది.. అనేదాగా మీ డౌట్..! ఇదిగో ఈ లేఖను చదవండి.. మీకే.. అర్ధమవుతుంది.

ద‌ర్శ‌కుడు ‘క్రిష్’ కు ప్రేమ‌తో..
……………………………….

ఫేస్‌బుక్, వాట్స‌ప్ ఇన్‌స్టంట్ జీవితానికి ..అల‌వాటు ప‌డిన మొహాలు మావి! కోప‌మొచ్చినా, ఆనంద‌మొచ్చినా.. క్ష‌ణాల్లోనే… ప్ర‌ద‌ర్శించాలి! మేమంతా విమ‌ర్శ‌కులం.. మ‌న‌కి న‌చ్చినోడే మ‌నిషి… న‌చ్చ‌నోడు రాక్ష‌సుడు. ‘దేశమంటే మ‌ట్టికాదోయ్‌.. మ‌నుషులోయ్‌’ అంటాడో క‌వి. దేశ‌మంటే.. రాజ‌కీయ‌పార్టీ(కార్య‌క‌ర్త‌)లోయ్ అంటాన్నేను. ఎందుకంటే మ‌నుషులంతా.. రాజ‌కీయ‌పార్టీల‌తో ఖండిచ‌బ‌డ్డారు.. మ‌తంతో, కులంతో.. పార్టీల‌తో..
ఎవ‌రికి వారు విభ‌జించుకుంటున్న నాగ‌రిక‌యుగం మాది! మ‌న అపోజిషన్ పార్టీని తిడ‌తాం. మ‌న పార్టీ అయితే పొగుడుదాం!

ఎవ‌రైనా.. ‘మీ జీవితంలోని మ‌లుపుల్ని .. వేగంగా చెప్ప‌మంటే.. మ‌నం కాస్త‌యినా త‌డుముకుంటాం. నాయిన, అబ్బ గురించి చెప్ప‌మంటే..అట్టాంటోడు.. గొప్పోడు.. అని ఏదేదో చెబుదాం. ‘ఆరోజుల్లో నాన్న‌గారు..’ అని ఫంక్ష‌న్ల‌లో ప్ర‌తిసారి చెప్పే బాల‌య్య.. ఈరోజు త‌న నాన్న క‌థ‌ని.. త‌న‌యుడు చెబుతూ, న‌టించ‌టం అదృష్ట‌మే. వంద‌రూపాయ‌లు టికెట్టు కొన్నందుకు..సినిమాల్లో క‌థానాయ‌కుడు మ‌న‌కి ఇష్టం వచ్చిన‌ట్లు..న‌డుచుకోవాలంటే.. మ‌న‌మే రీలు తిప్పితే పోలా? మ‌నంద‌రికీ తెలిసిన క‌థే.. ఎన్టీయార్ గురించి ప‌త్రిక‌లు, పుస్త‌కాలు, మ‌నుషులు, గాసిప్పులు.. ప‌దిబండ్ల‌ జొల్ల‌లంత మ‌నం వినే ఉంటాం.ఎన్టీయార్ గురించి అంతా తెలుసున‌నే గ‌ర్వం ప్రేక్ష‌కుడిది. ఇలాంటి స్థితిలో సాహ‌సం, న‌మ్మ‌కంతో.. న‌ట‌సార్వ‌భౌముడి క‌థ నెత్తినెత్తుకున్నాడు క్రిష్‌.
ఎన్టీయార్ జీవిత‌మేంటో తెలుసుకోవాల‌ని.. క్రిష్ కళ్ళల్లో ఎన్టీయార్ ఎలా ఉన్నాడోన‌ని.. సినిమాకి టికెట్ బుక్ చేశా! ‘సావిత్రికంటే బాలేదు’, ‘సినిమా మొద‌టిభాగంలో కిక్కులేదు’ ‘ఇట్స్ తార‌క‌మ్స్ మూవీ’ ‘బాల‌య్య‌నే సినిమాని చెడ‌.. ‘ లాంటి వ్యాఖ్య‌లు విన్నా. అయినా ఎన్టీయార్‌ను చూడాల‌నే ఆస‌క్తి త‌గ్గ‌లేదు.. క్రిష్ ప్ర‌తిభ‌మీద ఇసుమంతైనా సందేహం రాలేదు. హాల్లోకి వెళ్ళాక.. ఊరికే న‌వ్వేవాళ్ళు కొంద‌రు..జైబాల‌య్య అని అరిచేవాళ్లు మ‌రి కొంద‌రు..క‌థ‌ను కాకుండా పాత్ర‌ధారిని చూసి కామెడీలు చేసే వాళ్ళను చూసి కాస్త జాలేసింది.

‘రామారావుగారి న‌ట‌న‌లో ఓ కొంటెద‌నం ఉంటుందండీ..’ అంటూ కెవిరెడ్డి పాత్ర‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ చెబుతాడు. వాస్త‌వానికి ఈరోజుల్లో మ‌న ప‌రిశ్ర‌మ‌కు ఉన్న‌..
అలాంటి కొంటెద‌నం ద‌ర్శ‌కుడు క్రిష్‌. త‌న ‘గ‌మ్యం’ ‘వేదం’ ‘కృష్ణం వందే జ‌గ‌ద్గురుం’ వంటి చిత్రాలతో మ‌న చుట్టూ ఉండే అజ్ఞాన‌పు ‘కంచె’ల‌ను తెంచాడు.
తెలుగు సినిమాని ఏకంచేసే.. గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణిలా దూసుకొచ్చాడు. ఏదేమైనా సినిమా ప‌డ్డాక గేలిచేసిన వాళ్ళు.. క్రిష్ చెప్పే క‌థ‌కు న‌వ్వ‌ట‌మాపి..
ఏడ్చారు.. దివిసీమ సాక్షిగా! ఎద్దులబండి న‌గ‌ల్లో కూర్చోని.. చేను నుంచి క‌లానికి.. చెన‌క్కాయ‌క‌ట్టెను తోల‌టం ఎంతోక‌ష్టం. అలాంటి క‌ష్ట‌మైన ప‌నిని క్రిష్ చేశాడు.
ఎన్టీయార్ క‌థ‌ను.. అందంగా, తెలివిగా, చాక‌చ‌క్యంగా.. అచ్చు మ‌న అమ్మ‌మ్మ‌ చెప్పే జాబిలి క‌థ‌లాగే.. బ‌స‌వ‌తార‌కంతో చెప్పించాడు.
రిజిస్ట‌ర్ ఆఫీసులో ఉద్యోగం వ‌దిలేసి.. ఎల్వీ ప్ర‌సాద్ రాసిన కార్డుముక్క‌ను ప‌ట్టుకుని .. చెన్న‌ప‌ట్నంకెళ్ళి .. అక్క‌డ వాతావర‌ణం పొస‌గ‌ద‌ని.. మ‌ళ్ళీ తిరుగుట‌పా క‌డితే.. క‌డుపులోని ఓ బిడ్డ ఆప‌టం ఎంత ఉద్వేగభ‌రితం స‌న్నివేశం. క‌ళ‌కి క‌ళాకారున్ని వెతుక్కునే ద‌మ్ముంద‌నిపిస్తుంది. ఓ సామాన్య రైతుకుటుంబంలో పుట్టిన ఎన్టీయార్‌.. సినిమాల్లో ఎలా పేరు తెచ్చుకున్నాడు.. తోట‌రాముడిగా అవ‌కాశం ఎలా వ‌చ్చింది.. బిడ్డ‌పోయిన బాధ‌లో ఏం చేశాడు.. జ‌నాల‌కోసం జోల‌ప‌ట్టిన‌పుడు ఎలాంటి అభిమానుల‌ను చూశాడు.. ప‌నిలో ఏం నేర్చుకున్నాడు.. ప్ర‌తినాయ‌క పాత్ర‌లన్ని ఒప్పుకోవ‌టానికి ఉండే ధైర్యం.. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. సినిమాల్లోనే బ‌తికాడు. ప్ర‌పంచ‌మే సినిమా అనుకున్నాడు. సినిమాలోనే ప్ర‌పంచం చూశాడాయ‌న‌. ఓ మొండిప‌ట్టుద‌ల‌.. సినిమాకోసం ఎమర్జెన్సీని సైతం ఎదిరించిన అస‌లుసిస‌లైన నాయ‌కుడిగా.. బాధ‌లు, క‌న్నీళ్లు, సంఘ‌ట‌న‌ల‌తో.. చుర‌క‌త్తిలా ఎలా అయ్యాడ‌నేది చూస్తే ఆశ్చ‌ర్య‌ పరుస్తుంది.

రాముడంటే అత‌నే.. క్రిష్ణ‌, క‌ర్ణ‌, అర్జున‌, భీమ.. ఇలా పురాణ‌ పురుషుడిగా అత‌నే. రావ‌ణుడూ అత‌నే.. చెడుపాత్ర‌ల్లో మంచిని చూపించి.. అంద‌రినీ ముక్కుమీద వేలువేయించిన కొటేరు ముక్కు న‌టుడ‌త‌ను. అందుకే.. ఎన్టీయార్ అంటే ఓ వ్య‌క్తి కాదు.. రీల్ల‌లోంచి బయటకొచ్చిన ఓ ఘ‌న‌కీర్తి..జ‌నాలకి తిక్క‌లేసేట్లు..
తిమ్మ‌రేగేట్లు చేసిన ఓ మహ శ‌క్తి. ఎన్టీవోడంటే మ‌న ఊళ్లోని మ‌నిషి.. ఔన‌న్నా కాద‌న్నా ఎన్టీయార్.. మ‌న ఇంటి ఇల‌వేలుపు. ఓ మామూలు మ‌నిషి..
మొండిఘ‌టం, త‌న‌మీద త‌న‌కి న‌మ్మ‌కం ఉండే..ఓ ఆవేశ‌ప‌రుడు.. యుగ‌పురుషుడ‌య్యాడంటే నిజంగా మ‌నం జేకొట్టాల్సిందే. ఓ ప‌ల్లెటూరి మోటుమ‌నిషి..
జ‌నం మెచ్చిన హీరో అయ్యాడంటే..ఊరికే అవ్వ‌డు క‌దా. దాని వెన‌క క‌ష్టం ఉండి తీరాలి. అందుకే తార‌క‌రామారావు అంటే.. మ‌నం ఎంత తిట్టినా..
మ‌న పార్టీవాడు కాద‌ని వెలేసినా.. మ‌న ఇంట్లో ప‌ట‌మైతాడు. అక్క‌డా చోటివ్వ‌కుంటే మన హృద‌య‌ప‌టంలో.. క‌నీసం రాముడు, క్రిష్ణుడిగానైనా కనిపిచ్చాడు.

ఎన్టీఆర్ టీడీపీ స్థాప‌కుడు అని.. ‘దాన‌వీర‌శూర‌క‌ర్ణ’ సినిమా టైటిల్ ప‌డుతూనే ..ఇంట్లో టీవీ రిమోట్ ఆఫ్ చేయ‌లేం క‌దా! ఎందుకంటే.. ఎన్టీయార్ సినిమా హీరో.
ఎన్నోపాత్ర‌ల్ని మ‌న‌కి ప‌రిచ‌యం చేసి..త‌న ప్ర‌యోగాల‌తో.. తెలుగు సినిమా ఖ్యాతిని ముమ్మాటికి పెంచిన న‌ట‌శిఖ‌రం. అందుకే నాయ‌కుడిగా ఎన్టీయార్‌ పై
ఎవరి మెద‌డులో అయినా కోప‌ముంటే..గుండెమాత్రం ఆయ‌న క‌థానాయ‌కుడి పాత్ర‌ల్ని ..విల‌నిజం పాత్ర‌ల్ని కూడా హ‌త్తుకుంటుంది.ద‌ట్స్ ఫ్యాక్ట్‌!

ఓ క్రిష్‌.. కోటి వెట‌కారాల మ‌ధ్య‌.. ల‌క్ష‌ల పోలిక‌ల మ‌ధ్య‌.. అబద్ధాలు, నిజాలు నిప్పుల‌.. మ‌ధ్య‌.. ఓ మ‌నిషి క‌థ‌ను చెప్పాల‌నుకున్న నీ సంక‌ల్పం.. వేయి ఏనుగులంత శ‌క్తివంత‌మైన‌ది. సోష‌ల్‌మీడియా తిట్ల‌దండ‌కాలు.. ‘ఎన్టీయార్’ ప్రాజెక్టులో ప్ర‌క‌టించాక‌.. సినిమా షూటింగ్‌లోనూ.. నీకెన్నో అడ్డు పుల్ల‌లు త‌గిలుంటాయి. అతి త‌క్కువ కాలంలో.. అద్భుత‌మైన ప‌రిశోధ‌న చేసి.. ఫీల్‌గుడ్‌ సినిమాగా తీయ‌టానికి.. నీకెన్నిసార్లు త‌ల‌పోటొచ్చిందో.. ఆ త‌ల‌పోటులోంచే ..
నీకు గొప్ప ఐడియాలు పుడ‌తాయేమో. లేకుంటే అంత అందంగా ఎలా తీస్తావు. మ‌న గుమ్మ‌డిగారండీ… అంటూ పాత్ర‌ల్నిఎంత అందంగా మాకు ప‌రిచ‌యం చేశావో!

రిజిస్టార్ ఆఫీసు సీన్‌.. బావా.. నీకో ఇష్టం నాకో ఇష్ట‌మా.. అక్కినేనితో స‌న్నివేశాలు.. నాగిరెడ్డితో మాట‌లు.. కెవిరెడ్డి ఆలోచ‌న‌లు.. ముస‌ల‌మ్మ ఇంట్లో స్వామి బువ్వ‌.. ఉప్పెన లాంటి దివిసీమ బాధ‌లు.. రాజ‌కీయాల్లోకి రావాలా… వ‌ద్దా..? అని ఎన్టీయార్ ప‌డే స్ర్ట‌గుల్‌.. ఇలా చెబుతూ పోతే క‌ళ్ళు చెమ‌ర్చిన స‌న్నివేశాలెన్నో! ఇంత‌టి క‌థ‌ను ఏళ్ళకు ఏళ్ళు కాకుండా.. నెల‌ల్లోనే సినిమా తీసి.. గ‌బ‌క్క‌ని సినిమా రిలీజ్ చేసి.. నీ ప్ర‌తి సినిమాలోలాగే ..క‌థానాయ‌కుడితో గొప్ప సందేశం ఇచ్చావు అజ్ఞానుల్ని మేల్కొలిపే ప్ర‌య‌త్నం చేస్తావు. క‌ష్టాలని కావ‌లించుకుని.. అన్నీ తెలిసి.. నీకోసం.. నీ గుండెలోని ఎన్టీయార్ కోసం..
ఎన్టీయార్ జీవితం చూడాల‌నుకునే కోట్ల గుండెల‌కోసం..కెవిరెడ్డి అంత ప‌ట్టుద‌ల‌తోనే..నువ్వు సినిమా చేశావు చూడు..అదీ గ్రేట్‌నెస్‌.

నీకు..నీవెన‌కాల ఉండే ‘బుర్రా’కి నేను ప్ర‌తిసారీ ఫిదానే..! సినిమాయే జీవితం..ప‌ట్టుద‌ల‌తో ఏదైనా సాధించొచ్చ‌ని.. ‘ఎన్టీయార్ క‌థానాయ‌కుడు’ తో చెప్పావు. నువ్వూ అంతే..నువ్వేమీ మార‌లేదు..’గ‌మ్యం’ నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా.నువ్వు నిర్మాత‌ల‌కోసం మార‌లేదు..సినిమా సామాజిక బాధ్య‌త అనే విష‌యాన్ని.. ఏడుచేప‌ల క‌థంతా అందంగా చెబుతావు నువ్వు. ‘ఎన్టీయార్ మ‌హానాయ‌కుడు’ .. మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌నే న‌మ్మ‌కంతో..వేయిక‌న్నుల‌తో వేచిచూస్తూ..

ఇట్లు
నీ అభిమాని
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus