టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా కోసం ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2025 జనవరి 10, సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ తర్వాతి చిత్రం కావడంతో ఇది ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారింది. మేకర్స్ విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ, ట్రైలర్ ఆలస్యం అభిమానుల్లో ఆందోళనను కలిగించింది.
ఇప్పటికే సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో, ట్రైలర్ రాకపై అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక చరణ్ ఫ్యాన్, మేకర్స్‌ను ఉద్దేశించి సూసైడ్ బెదిరింపు లేఖ రాయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. “డిసెంబర్ చివరి కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా,” అంటూ ఆ ఫ్యాన్ తన భావాలను వ్యక్తపరిచాడు.
ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు తమ హీరోల కోసం తమ భావోద్వేగాలను వ్యక్తపరిచే సందర్భాలు చూస్తున్నాం, కానీ ఈ రకమైన చర్యలు సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టాలీవుడ్ పరిశ్రమలో ట్రైలర్, ప్రోమోషన్ల విషయంలో మేకర్స్ సమయాన్ని తీసుకోవడం సర్వసాధారణం. గేమ్ ఛేంజర్ వంటి భారీ బడ్జెట్ చిత్రానికి ప్రొమోషన్స్ కు భారీగానే ప్లాన్ చేస్తారు.
అందువల్ల ఇలాంటి అనవసరమైన ప్రెజర్ సృష్టించడం అవసరం లేదని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక రామ్ చరణ్ టీమ్ ఈ లేఖపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, ట్రైలర్ విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. థియేట్రికల్ రిలీజ్‌కు ఐదు రోజుల ముందు, ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం.