అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి అందరం ‘అఖండ 2: తాండవం’ సినిమా సందడిలో బిజీగా ఉండేవాళ్లం. సినిమాకు ఉన్న హైప్, కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. డిసెంబరు 4న స్పెషల్ ప్రీమియర్స్‌తో సినిమా హంగామా స్టార్ట్ అవ్వాల్సింది. అయితే బాలీవుడ్ నిర్మాణ, పంపిణీ సంస్థ ఎరోస్‌తో వచ్చిన డబ్బులు పంచాయితీతో సినిమా రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యలో బాలయ్య అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. మా హీరోకు ఇలాంటి పరిస్థితా అని ఆవేదన చెందుతున్నారు.
అంతేకాదు, మాకే ఎందుకిలా జరుగుతోంది అని అంటున్నారు. ఓవైపు బాలయ్య సినిమాకు ఇలాంటి పరిస్థితి రాగా, మరోవైపు ఈ సినిమా ఆయన చిన్న కూతురు తేజస్విని సమర్పణలో వస్తున్న మొదటి సినిమా కావడమే దీనికి కారణం. లెజెండ్ పిక్చర్స్ పేరుతో ఆమె కొన్నాళ్ల క్రితం ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. అందులో తొలి సినిమాగా తన సోదరుడు మోక్షజ్ఞ హీరోగా అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా వివిధ కారణాల వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ లోపు సమర్పకురాలిగా ‘అఖండ 2: తాండవం’ అనౌన్స్ చేశారు.
పోనీ సోదరుడితో కాకపోయినా, తండ్రితో తొలి సినిమా చేస్తున్నారు.. అందులో ‘అఖండ’ సినిమా లాంటి బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్ అని అభిమానులు ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బుధవారం నాటికి ఈ సమస్యలు తొలగిపోతాయి అని అంటున్నారు. అయినా తొలి సినిమాకే తేజస్వినికి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఇబ్బందికరమే. అభిమానులకు అయితే మరీనూ.
ఇక మోక్షజ్ఞ విషయంలోనూ ఇలాంటి వాయిదాలే జరుగుతున్నాయి. ఏడాది క్రితం ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ మొదలుకాలేదు. ఓ మంచి ప్రేమ కథ కోసం చూస్తున్నారు అని ఆ మధ్య నారా రోహిత్ చెప్పాడు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్‌కి ఇబ్బంది అవుతుంది. చూద్దాం నందమూరి వారసులకు ఈ ఇబ్బందులు ఎప్పటికి తీరుతాయో.