ఈ అభిమానుల సమాజంలో హీరోయిన్లకే హీరోలకు కూడా రక్షణ లేదు.. ఏంటీ హార్స్ స్టేట్‌మెంట్ అనుకుంటున్నారా? ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డ ఘటనలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి కాబట్టి. హీరోయిన్ల విషయంలో నిధి అగర్వాల్‌తో మొదలైన ఈ ఇబ్బందుల పరంపర.. సమంతకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ పరిస్థితి కనిపించలేదు. ఇక హీరోలు / నటుల విషయంలో అల్లు అర్జున్‌తో మొదలై, హర్షవర్ధన్ రాణెతో కొనసాగి.. విజయ్ దళపతికి చేరి.. ఇప్పుడు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ వరకు వెళ్లింది.
ఇటీవల సూరత్ ఎయిర్ పోర్టులో అమితాబ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా తరలివచ్చారు. దీంతో ఆయన కారు వద్దకు వెళ్లడమే కష్టమైంది. పోలీసులు, భద్రతా సిబ్బంది అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ ద్వారం వద్ద ఉన్న అద్దం కూడా పగిలిపోయింది. అయితే ఆ అద్దానికి అమితాబ్ దూరంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత భద్రతా సిబ్బది అతి కష్టం మీద బిగ్‌బీని కారు ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ ఈవెంట్ కోసం బయటకు వచ్చిన అల్లు అర్జున్, తన సినిమా ప్రచారం కోసం ప్రజల మధ్యకు వచ్చిన హర్షవర్ధన్ రాణె ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ‘జన నాయగన్’ సినిమా ఆడియో ఫంక్షన్ తర్వాత చెన్నై వచ్చిన విజయ్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇదంతా చూస్తుంటే అభిమానం ఓకే కానీ ఇలా అత్యుత్సాహం చూపిస్తే కష్టం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలానే పరిస్థితి కొనసాగితే.. సెలబ్రిటీలు బయటకు రావడానికి కూడా ఇబ్బందిపడతారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అలాగే బయటకు వచ్చేటప్పుడు తగినంత ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి అని నటులకు పలువురు సూచిస్తున్నారు. ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవారు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హీరోయిన్లపై మూకగా పడిపోవడం విషయంలో శివాజీ లాంటి వారు కొన్ని సూచనలు చేశారు. మరి నటుల విషయంలోనూ ఏమైనా చెబుతారేమో చూడాలి.