సెప్టెంబర్ లో సినిమాల సందడి..!

సెప్టెంబర్ లో యువ హీరోలు సందడి చేయనున్నారు. వారునటించిన అనేక చిత్రాలు వచ్చే నెలలో రిలీజ్ కి సిద్ధమయ్యాయి. వీటిపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాల వల్ల సెప్టెంబర్ లోకలక్షన్ల వర్షం కురుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

2 న జనతా గ్యారేజ్
హిట్ దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను మొదట ఆగస్టు 12 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ 2కి పోస్ట్ పోన్ అయింది. ఈ ఏడాది అందరూ ఎదురు చూస్తున్న మూవీ కి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు అదుర్స్ అనిపించుకున్నాయి. జనతా గ్యారేజ్ తో తారక్ హ్యాట్రిక్ అందుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

9 న నాలుగు సినిమాలు
ఒకే రోజు (సెప్టెంబర్ 9న) నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఏమాయ చేసావె’ చిత్రం తర్వాత డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ తో యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ లోనే రిలీజ్ కావాలి. అనేక సార్లు వాయిదా పడి సెప్టెంబర్ 9న విడుదలకు సిద్దమయింది. అయితే చైతు సినిమా ప్రేమమ్ కూడా అదే రోజు రిలీజ్ కానున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మలయాళ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ రెండు చిత్రాలను ఒకే రోజు రిలీజ్ చేస్తారా? ప్రేమమ్ ను వాయిదా వేస్తారా ? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

వీడు గోల్డ్ ఎహె
గతనెల జక్కన్నతో పలకరించిన సునీల్ వచ్చే నెల 9 న “వీడు గోల్డ్ ఎహె” చిత్రం తో ముందుకు వస్తున్నాడు. బిందాస్, రగడ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని సునీల్ భావిస్తున్నారు.

ఇంకొక్కడు
అపజయాలు పలకరిస్తున్నా విలక్షణ నటుడు విక్రమ్ ప్రయోగాలను మాత్రం ఆపటం లేదు. ప్రస్తుతం ఇరుముగన్ పేరుతో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామాలో హీరోగా, విలన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని తెలుగులో “ఇంకొక్కడు” గా సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు.

17న మజ్ను
నేచురల్ స్టార్ నాని భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మాన్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న తర్వాత చేస్తున్న సినిమా మజ్ను. డైరక్టర్ విరంచి వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారు.

30 న హైపర్, ఇజం
ఈ ఏడాది ప్రారంభంలో నేను శైలజ తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ తో కలిసి హైపర్ మూవీ చేస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా “ఇజం” కూడా సెప్టెంబర్‌ 30న విడుదల కానుందని సమాచారం.

ఈ సినిమాల ప్రవాహం చూస్తుంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు సెప్టెంబర్ మొత్తం పండుగ లాగే గడవనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus