దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలని తెలియజేయడానికి తాజాగా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. అందరూ అనుకుంటున్నట్టే ఇది స్వాతంత్య్రం రావాడానికి ముందు జరిగిన ఓ కథ… దీనిని స్వయంగా రాజమౌళినే చెప్పారు. స్వాతంత్య్ర సమర యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని రాజమౌళి తెలిపారు.
ఇక ఈ చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ… ”1897 లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. చదువుకోవడంతో పాటు ఆయన అన్ని విషయాల్లో చురుకుగా ఉండేవారు. యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు, మూడు సంవత్సరాలు ఆయన లేరు. తిరిగొచ్చిన తరువాత స్వాతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తరువాత బ్రిటీష్ చేతుల్లో చనిపోయారు. అలానే 1901 లో తెలంగాణాలో కొమరం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఇంటి నుండి వెళ్లిపోయారు. అలా వెళ్లిన తరువాత ఆయన ఏం చేశారనేది ఎవరికీ తెలియదు. తరువాత తిరిగొచ్చి గిరిజనుల స్వాతంత్ర్యం కోసం పోరాడారు.
ఆయన కూడా బ్రిటీషర్ల చేతులో చనిపోయారు. ఇద్దరూ ఒకే టైం లో పుట్టడం, ఇంటి నుండి వెళ్లిపోవడం, తిరిగొచ్చి ఒకేవిధంగా పోరాడడం అమరులు కావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథ ఈ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండబోతుంది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ ఇద్దరు వీరులకి కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అయితే ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే.. వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. నా సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ గా ఉంటుంది. భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 1920 లో జరిగే కథ కాబట్టి చాలా రీసెర్చ్ చేశామని” చెప్పారు.
ఈ చిత్రంలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండగా… యంగ్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా… తమిళ నటుడు సముద్ర ఖని కూడా సహాయనటుడుగా నటిస్తున్నాడు. ఇక చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇక తారక్ కి జోడిగా డేజీ అడ్గారియన్స్.. నటిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని 2020 జులై 30 న విడుదల చేస్తున్నట్టు కూడా తెలిపారు.