అదా శర్మ నటిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమా చిక్కుల్లో పడింది. ఏకంగా ఈ సినిమా బృందంపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రాన్ని ఉగ్రవాదుల సురక్షిత ప్రాంతంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ‘ది కేరళ స్టోరీ’ చిత్ర బృందంపై కేసు నమోదు చేయాలని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్‌ను కేరళ డీజీపీ అనిల్ కాంత్ ఆదేశించారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా టీజర్‌లో కేరళకు చెందిన 32,000 మందికి పైగా మహిళల మతాలను బలవంతంగా మార్చి సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని ప్రాంతాలకు తీసుకెళ్లారని చూపించారు.
సుదీప్తో సేన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమనాఉ వీఏ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ వచ్చిన తర్వాత సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి దృష్టికి ఈ సినిమా గురించి తమిళనాడుకు చెందిన జర్నలిస్ట్ బీఆర్ అరవిందాక్షన్ ఫిర్యాదు చేశారు. సినిమాలో చూపిస్తున్న అంశాలను బలపరిచేలా తగిన సాక్ష్యాలను ఇవ్వకపోతే.. ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ ఆ జర్నలిస్ట్ లేఖ రాశారు. దీంతో సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు అయ్యింది.
ఫిర్యాదు కాపీని కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్ర డీజీపీకి కూడా ఆ జర్నలిస్ట్ పంపించారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి.. ఈ సినిమా రాష్ట్ర ప్రతిష్టను పాడుచేయడానికి, వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచే ఉద్దేశించినట్లుగా ఉందని తేల్చారని సమాచారం. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఇక టీజర్ వీడియోలో చూస్తే.. కేరళకు చెందిన షాలినీ ఉన్నికృష్ణన్ అలియాస్ ఫాతిమా బా అని చెప్పుకునే ముసుగు ధరించిన ఒక మహిళను ఈ టీజర్‌లో చూపించారు. కేరళ నుంచి మతం మారిన 32,000 మంది మహిళల్లో నేనూ ఒకరని, ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాడటానికి సిరియా, యెమెన్‌లకు నన్ను పంపించారని ప్రధాన పాత్రధారి అదా శర్మతో చెప్పించారు. కేసు నేపథ్యంలో సినిమా ఏమవుతుందో చూడాలి.