FIR Movie Review: ఎఫ్.ఐ.ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 12, 2022 / 04:53 PM IST

తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “ఎఫ్.ఐ.ఆర్”. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రవితేజ సమర్పించడం విశేషం. టెర్రరిజం నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉండి. ఆడియన్స్ ను ఎంగేజ్ చేసింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

కథ: ఐ.ఐ.టిలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న తెలివైన యువకుడు ఇర్ఫాన్ అహ్మద్ (విష్ణు విశాల్), పోలీస్ కానిస్టేబుల్ అయిన తల్లితో కలిసి సంతోషంగా జీవితం సాగిస్తుంటాడు. వాళ్ళ సంతోషానికి తీవ్రవాదం అడ్డంకిగా నిలుస్తుంది. ఓ కరడుగట్టిన ఉగ్రవాదిని పట్టుకొనే నేపధ్యంలో ఇర్ఫాన్ ఇరుక్కుంటాడు. ఎన్.ఐ.ఏ చీఫ్ అజయ్ దీవాన్ (గౌతమ్ మీనన్) & టీం ఇర్ఫాన్ ను చిత్రహింసలు పెట్టి, సొసైటీలో అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసినప్పటికీ.. తాను తీవ్రవాది కాదు అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఇర్ఫాన్ పడిన కష్టాలేమిటి? అనేది “ఎఫ్.ఐ.ఆర్” కథాంశం.

నటీనటుల పనితీరు: “రాక్షసుడు” ఒరిజినల్ అయిన “రాట్శాసన్” ద్వారానే తెలుగు ప్రేక్షకులకు ఓ మోస్తరుగా పరిచయమయ్యాడు విశాల్. ఇటీవల “అరణ్య”లోనూ సపోర్టింగ్ రోల్లో అలరించాడు. అయితే.. తాను ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో ముస్లిం యువకుడిగా నటించాడు విష్ణు విశాల్. ముఖ్యంగా సెకండాఫ్ లో అతడు పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. నటుడిగా ఈ చిత్రంతో ఒక మెట్టు ఎక్కాడు విష్ణు విశాల్.

తల్లి పాత్రలో మాలా పార్వతి నటన హృదయానికి హత్తుకుంటుంది. హీరోయిన్ రెబా మోనిక పాత్ర ఆకట్టుకోలేకపోయింది. సహాయ పాత్రలో రైజా విల్సన్ అలరించింది. వీళ్ళందరికంటే కేవలం తన స్క్రీన్ ప్రెజన్స్ తో అదరగొట్టేశాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు అశ్వట్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. సినిమాలోని ఎమోషన్ ను అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు. నేపధ్య సంగీతం కావచ్చు, చిన్న బిట్ సాంగ్స్ కావచ్చు.. అశ్వత్ పనితనం అభినందనీయం. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. అయితే.. లైటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ కూడా బాగున్నాయి.

అయితే.. దర్శకుడు మను నందన్.. సినిమా ప్రారంభాన్ని రాసుకున్నంత చక్కగా ముగింపును రాసుకోలేదు. సెకండాఫ్ కి వచ్చేసరికి చాలా ఉత్కంఠభరితమైన ఎమోషన్స్ ను పేలవంగా లాగించేశాడు. అందువల్ల.. అప్పటివరకూ సినిమాను ఎంతో ఆసక్తికరంగా చూసిన ప్రేక్షకుడు చివరికి నీరసించిపోతాడు. అలాగే.. సినిమా జస్టిఫికేషన్ చాలా రెగ్యులర్ గా ముగించాడు.

విశ్లేషణ: ఒక చక్కని కాన్సెప్ట్ డీలింగ్ కారణంగా గాడి తప్పి పెడదోవబట్టింది. లేకపోతే.. “ఎఫ్.ఐ.ఆర్” మరో రట్శసన్ రేంజ్ లో ఆడేది. అయినప్పటికీ.. ఒకసారి తప్పకుండా చూడదగ్గ చిత్రమిది. విష్ణు విశాల్ పడిన శ్రమ, అశ్వత్ నేపధ్య సంగీతం కోసం మాత్రం కచ్చితంగా ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus