ఫస్ట్ ర్యాంక్ రాజు

2015లో కన్నడలో రూపొంది మంచి విజయం సాధించిన చిత్రం “ఫస్ట్ ర్యాంక్ రాజు”. ఆ చిత్రానికి రీమేక్ గా అదే టైటిల్ తో తెలుగులో చేతన్ మద్దినేని-కశిష్ వోరా జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి నరేష్ కుమార్ దర్శకుడు. కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సెటైరికల్ ఫిలిమ్ గా తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుంచి తండ్రి ఎక్కడ కొడతాడో లేక కొట్టిస్తాడో అనే భయంతో రోజుకి 17 గంటలు పుస్తకాలు మాత్రమే చదువుతూ.. సెకండ్ ర్యాంక్ వస్తే ఫెయిల్ అనే స్థాయి మైండ్ సెట్ తో పెరిగిన కుర్రాడు “ఫస్ట్ ర్యాంక్ రాజు” (చేతన్ మద్దినేని). స్కూల్లో, కాలేజ్ లో అన్నిట్లో ఫస్ట్ వచ్చే రాజుకి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ మాత్రం రాదు. దాంతో హర్ట్ అయిన అతడి తండ్రి రాజుని ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా కాక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లా తయారు చేస్తాడు.

మరి అప్పుడైనా రాజుని క్యాంపస్ జాబ్ వచ్చిందా? ఈ క్రమంలో రాజు & పేరెంట్స్ తెలుసుకొన్న జీవిత సత్యం ఏమిటి? అనేది “ఫస్ట్ ర్యాంక్ రాజు” కథాంశం.

నటీనటుల పనితీరు: చేతన్ మద్దినేని ఈ క్యారెక్టర్ కి ఆహార్యం పరంగా సరిపోయాడు కానీ.. వ్యవహార శైలి మాత్రం ఆకట్టుకొనే విధంగా లేదు. మ్యానరిజమ్స్, పెర్ఫార్మెన్స్ కూడా ఏదో బలవంతంగా చేసినట్లుగా ఉంటుంది. టైటిల్ పాత్రధారి ఇలా చేయడంతో సినిమాలోకి జనాలు ఇన్వాల్వ్ అవ్వడం కష్టమే.

హీరోయిన్ కశిష్ వోరా నటించమంటే.. అతి చేసింది. అమ్మడి నటన, హావభావాలు, అందాల ప్రదర్శన అన్నీ శ్రుతి మించిన రీతిలో ఉన్నాయి. సినిమాకి గ్లామర్ యాడ్ చేయాల్సిన అమ్మాయి.. మైనస్ గా మారింది. తండ్రి పాత్రలో నరేష్, బాస్ పాత్రలో ప్రకాష్ రాజ్ సీజన్డ్ రోల్స్ కి సరిగ్గా సరిపోయారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రలు కాస్త నవ్వించడానికి విఫలయత్నం చేశాయి.

సాంకేతికవర్గం పనితీరు: సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్ వంటివన్నీ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. దర్శకనిర్మాతలకు ఒక క్వాలిటీ సినిమా అందివ్వాలన్న తపన లేనట్లుంది అనే విషయం మొదటి పది నిమిషాల సినిమా చూసేసరికే అర్ధమైపోతుంది. ఇక ఆ సాంకేతిక వర్గాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

దర్శకుడు నరేష్ కుమార్.. తనకు ఇచ్చిన బడ్జెట్ కు కన్నడ వెర్షన్ సినిమాకి న్యాయం చేశాడనిపిస్తుంది తప్పితే.. తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసినట్లుగా ఎక్కడా కనిపించదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సెటైర్స్ వేయాలనుకోవడం కరెక్టే కానీ అది ఒక సమాధానంతో ఉండాలి కానీ సిల్లీగా ఉండకూడదు. ఎంత కామెడీ సినిమా అయినా కూడా కాస్తో కూస్తో సెన్సిబిలిటీస్ ఉండాలి. ఈ రెండు మిస్ అయ్యాయి ఈ “ఫస్ట్ ర్యాంక్ రాజు”లో. దాంతో కామెడీ సినిమా కాస్త బోరింగ్ మూవీ అయిపోయింది.

విశ్లేషణ: లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కూడా జీర్ణించుకోవడానికి కష్టపడే కామెడీ (అని వాళ్ళు అనుకొన్నారు) సినిమా “ఫస్ట్ ర్యాంక్ రాజు”.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus