కొత్తదనమే విజయమంత్రం

మనదేశంలో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ టాలీవుడ్. అయితే కొన్నేళ్లుగా మూసధోరణికి అలవాటుపడిపోయి.. అపజయాలను ఎక్కువగా నమోదు చేసుకుంటూ వస్తోంది. బాలీవుడ్ వారి నిర్మాణ విలువలు చూడు ఎలా ఉన్నాయో.. కోలీవుడ్ సినిమాల్లో సహజత్వం ఉంటుంది.. మల్లూవుడ్ లో కొత్త కథలను ఆహ్వానిస్తారు.. అనే మాటలతో తెలుగుచిత్ర పరిశ్రమను ఎక్కువగా విమర్శించేవారు. ఆ విమర్శలకు ఈ ఏడాది వచ్చిన సినిమాలు గట్టిగా సమాధానం చెప్పాయి. 2017 లో ఇప్పటికీ వంద సినిమాలకు పైగా రిలీజ్ అవ్వగా వీటిలో పదికి మించి బ్లక్ బస్టర్ జాబితాలో చేరాయి. ఈ సినిమాల విజయరహస్యాన్ని పరిశీలిస్తే కొత్తదనమే విజయమంత్రం అని స్పష్టం అవుతోంది.

ఖైదీ నంబర్‌ 150మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ రూపంలో సంక్రాంతికి బరిలోకి దిగారు. జనవరి 11 న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచి పోరాడిన ఓ యువకుడి కథతో అందరూ కనెక్ట్ అయ్యారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన 150 కోట్ల పైన కలక్షన్స్ సాధించి చిరు సత్తాని చాటింది.

గౌతమిపుత్ర శాతకర్ణి జనవరి 12 న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అయింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఏకతాటిపైకి తెచ్చేందుకు తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చేసే పోరాటాన్ని వెండితెరపై చూసేందుకు తెలుగువారందరూ తరలివచ్చారు. విజయ హారతి ఇచ్చారు.

శతమానంభవతి ప్రస్తుతం ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రుల మానసిక స్థితిని, కుటుంబం అంతా కలిస్తే వచ్చే సంతోషాన్ని, ప్రేమానుబంధాలను కళ్ళముందు ఆవిష్కరించిన చిత్రం శతమానంభవతి. ఆర్థిక విజయంతో పటు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

నేను లోకల్‌ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్‌’ ఫిబ్రవరి 3న విడుదలై ఘన విజయం సాధించింది. సాధారణ ప్రేమ కథను విభిన్నంగా చూపించడంలో చిత్ర బృందం సక్సస్ సాధించింది.

ఘాజి 1971లో ఇండో-పాక్‌ వార్‌ నేపథ్యంలో రూపొందించి చిత్రం ఘాజి. నూతన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి అత్యద్భుతంగా హిస్టరీని తెరపై ఆవిష్కరించారు. నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషలవారు ఆదరించారు.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త మనుషుల్ని కిడ్నాప్ చేసే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కుక్కలను కిడ్నాప్‌ చేయడమనే కొత్త కథాంశంతో గా దర్శకుడు వంశీ క్రిష్ణ రూపొందించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త మార్చి 3న విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది.

గురు క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చిన చిత్రం గురు. బాక్సింగ్‌ కోచ్‌గా వెంకటేష్ నటించిన ఈ చిత్రం మార్చి 31న విడుదలై ఈ మూవీలో వెంకీ, రితికా సింగ్ నటన క్రీడాకారులతో పాటు సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

బాహుబలి 2 ఏప్రిల్‌ 28. తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోలేని రోజు. వివిధ చిత్రాల పేరున నమోదైన అన్ని రికార్డులను బాహుబలి కంక్లూజన్ తన వసం చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి కొత్త ప్రపంచంతో సృష్టించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1700కోట్లకుపైగా వసూళ్ళను రాబట్టి చరిత్ర సృష్టించింది.

కేశవఎడమవైపు ఉండాల్సిన గుండె.. కుడివైపున ఉంటే.. అలా ఉన్న వ్యక్తి హత్యలు చేయాల్సి వస్తే.. ఆలోచనే కొత్తగా ఉంది కదూ.. అందుకే ఈ కథతో తెరకెక్కిన కేశవను యువత హిట్ చేయించారు. నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో వచ్చిన ఈ మూవీ క్లిష్ట పరిస్థితిలోను భారీ కలక్షన్స్ అందుకుంది.

అమీతుమీ కన్ఫ్యుజింగ్ కామెడీతో రాసుకున్న కథను చాలా క్లారిటీగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ వెండి తెరపై చెప్పిన మూవీ అమీతుమీ. తెలంగాణ యాస, డైలాగులు, వెన్నెల కిషోర్‌, ఈషా, అడవి శేషు, శ్రీనివాస్‌ అవసరాల పాత్రలు నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. జూన్‌ 9న విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది.

నిన్ను కోరి హీరో ప్రేమించుకున్న అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్ళిచేసుకుంటే కథ అయిపోయినట్టే. కానీ తాను ప్రేమించిన , అమ్మాయి పెళ్లి అయినా సంతోషంగా లేదని, ఆమెను తన వద్దకు తెచ్చుకునేందుకు ప్రేమికుడు చేసే ప్రయత్నమే నిన్నుకోరి. నూతన దర్శకుడు శివ నిర్వాణ సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది.

ఫిదా మంచి కాఫీ లాంటి సినిమాలను అందించిన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రం ఫిదా. ఈ చిత్రం మంచి ప్రేమ కథతో పాటు తెలంగాణ సంప్రదాయాన్ని, యాస, భాషను ప్రతిబింబింది. జులై 21న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

నేనే రాజు నేనే మంత్రి ఓ మారుమూల ప్రాంతంలో వడ్డీ వ్యాపారం చేసే జోగేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలివి తేటలతో గ్రామ సర్పంచి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే నేపథ్యంతో తెరకెక్కిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ మూవీ ఆగస్ట్‌ 11న విడుదలైన మూడు సినిమాల పోటీలో నిలబడి భారీ కలక్షన్స్ రాబట్టింది.

ఆనందో బ్రహ్మ హారర్ క్యామెడీ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయిన సమయంలో వచ్చిన ఆనందో బ్రహ్మ గొప్ప విజయం సాధించింది. మనుషులకు దెయ్యాలు భయపడటమనే వినూత్న కాన్సెప్ట్‌ అందరికీ కొత్తగా అనిపించింది. మహి వి. రాఘవ్‌ దర్శకత్వ ప్రతిభకు వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌ల కామెడీ, తాప్సీ నటన తోడై హిట్ సొంతమైంది.

అర్జున్‌రెడ్డి ప్రేమ కథను బోల్డ్ గా చెప్పి సక్సస్ అందుకున్నాడు నూతన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. హీరో విజరు దేవరకొండ అర్జున్‌రెడ్డి గా అదరగొట్టాడు. అన్ని రకాల ఎమోషన్స్ ని చక్కగా పలికించి సినిమా విజయానికి ప్రధాన కారకుడయ్యాడు. 5 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ పాతిక కోట్ల షేర్ రాబట్టి పాత్ బ్రేకింగ్ మూవీ అని పేరు దక్కించుకుంది.

ఈ విధంగా వినూత్న కథలతో జై లవకుశ, రంగస్థలం సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus