గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ & రేటింగ్!

“ఎఫ్ 2” సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన వరుణ్ తేజ్ తన కెరీర్లో మొదటిసారి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం “వాల్మీకి” అలియాస్ “గద్దలకొండ గణేష్”. తమిళ సూపర్ హిట్ చిత్రం “జిగర్తాండ”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తనదైన మార్క్ మార్పులు-చేర్పులతో తెరకెక్కించాడు హరీష్ శంకర్. నిన్న రాత్రి జరిగిన రచ్చ కారణంగా ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చుకున్న ఈ చిత్రం రిజల్ట్ ఏమైందో చూద్దాం..!!

కథ: సమాజంలోని అందరు యువకుల్లానే తాను కూడా ఇష్టపడిన అమ్మాయిని పెళ్ళాడి సెటిల్ అవ్వాలనుకుంటాడు గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్). కానీ.. అతడు ప్రేమించిన శ్రీదేవి (పూజా హెగ్డే)ను దూరం చేయడమే కాక.. అతడి ఒక రౌడీలా మారుస్తారు కొందరు ప్రముఖులు.

కట్ చేస్తే.. అప్పటికీ ఆర్జీవీ అందరి బయోపిక్ లు తీసేయడం వల్ల ఎవరి బయోపిక్ తీయాలో క్లారిటీ లేక.. ఎవరైనా నిజమైన విలన్ జీవితాన్ని సినిమాగా తీయాలని భావిస్తాడు అభిలాష్ (అథర్వ మురళి). ఆ క్రమంలో గద్దలకొండ గణేష్ గురించి తెలుసుకొని.. అతడి జీవితం ఆధారంగా సినిమా తీయాలి అనుకొంటాడు.

గణేష్ లాంటి ఒక క్రూరుడితో.. అభిలాష్ సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు? చివరికి ఆ సినిమా ఎలా వచ్చింది? ఆ సినిమా కారణంగా వరుణ్ తేజ్ లో వచ్చిన మార్పులేమిటి? అనేది “గద్దలకొండ గణేష్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అతడి వాచకం, వ్యవహారశైలి ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తాయి. సినిమా కాస్త డల్ గా ఉంది అనిపించినప్పుడల్లా.. వరుణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసాడు. సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవడమే కాక నటుడిగా తన స్థాయిని కూడా పెంచుకున్నాడు వరుణ్. రౌద్రాన్ని ఎంత అద్భుతంగా ఈజ్ తో పలికించాడో.. అదే తరహాలో ఎమోషన్స్ & కామెడీని కూడా పండించాడు వరుణ్.

అథర్వ మురళికి హేమచంద్ర చెప్పిన డబ్బింగ్ సింక్ అవ్వలేదు కానీ.. నటుడిగా తన పాత్రకు న్యాయం చేసాడు అథర్వ. క్యారెక్టరైజేషన్ లో ఇంకాస్త డెప్త్ ఉండుంటే బాగుండేది. బ్రహ్మానందం, తణికెళ్లభరణిల పాత్రలు చిన్నవే అయినా ఆ పాత్రల ద్వారా క్రియేట్ అయిన ఇంపాక్ట్ ఎక్కువ. ముఖ్యంగా తనికెళ్ళ మాటలు, నటన మనసుకు హత్తుకుంటాయి.

మృణాళిని పాత్ర ట్రైలర్ లోనే కాస్త ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. సినిమాలో అమ్మడు అక్కడక్కడా కనిపిస్తుంది అంతే. పల్లెటూరి అమ్మాయిలా ఇమడలేకపోయింది. పూజా హెగ్డేది గెస్ట్ రోల్ అని పేర్కొనవచ్చు. “ఎల్లువొచ్చి గోదారమ్మ” రీక్రియేషన్ లో శ్రీదేవి అంత కాకపోయినా పర్వాలేదు అనిపించింది. పూజా హెగ్డేను కూడా ఇలా పూర్తిస్థాయి సాంప్రదాయబద్ధంగా చూడడం మొదటిసారి కాబట్టి ఎందుకో కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది.

రచ్చ రవికి చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర లభించింది. దొరికిన పాత్రకు న్యాయం చేసాడు రవి. అలాగే సత్య పాత్ర ద్వారా మంచి కామెడీ వర్కవుట్ ఐయింది.

సాంకేతికవర్గం పనితీరు: “గబ్బర్ సింగ్”ను “దబాంగ్” రీమేక్ అయినప్పటికీ.. హరీష్ శంకర్ మార్క్ మార్పుల వల్ల మరింత వేల్యూ యాడ్ అయ్యింది. అయితే.. “గద్దలకొండ గణేష్” విషయంలో మాత్రం ఇది కాస్త రివర్స్ అయ్యింది. ఒరిజినల్ “జిగర్తాండ”లో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ.. క్లైమాక్స్ సర్ప్రైజ్ కానీ ఈ గణేష్ లో లేవు. ఒరిజినల్ చుసిన ప్రేక్షకుడు కంపేర్ చేసుకొని కాస్త బాధపడతాడు. అలాగే.. ఒరిజినల్ చూడని ప్రేక్షకుడు కూడా కథ మరీ ఎక్కువగా సాగడం వల్ల కాస్త బోర్ ఫీలవుతాడు. పటాసులు లాంటి హరీష్ మార్క్ డైలాగ్స్ ఎక్కడికక్కడ పేలుతున్నా.. హీరో ఎలివేషన్స్ సీన్స్ పీక్స్ లో ఉన్నా కూడా.. నెమ్మదించిన కథనం మాత్రం ఎక్కడో ఎదో మిస్ అయ్యిందే అనిపించేలా చేస్తోంది. దాంతో రైటర్ గా సక్సెస్ అయిన హరీష్ శంకర్.. దర్శకుడిగా మాత్రం బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి జిగర్తాండ సస్పెన్స్ ను రిపీట్ చేయకూడదు అనుకున్నాడో లేక… తన మార్క్ చూపిద్దాం అనుకున్నాడో కానీ.. క్లైమాక్స్ అంత ఆసక్తికరంగా మాత్రం లేదు.

అయనాంక బోస్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుంది. మిక్కీ మాస్ ట్యూన్స్ & బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ ను, ప్రొడక్షన్ హౌస్ ఎఫర్ట్స్ ను మెచ్చుకొని తీరాలి.

మిథున్ చైతన్య స్క్రీన్ ప్లే బాగుంది కానీ.. రన్ టైం ఇంకాస్త తక్కువగా ఉంటే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండేది.

విశ్లేషణ: ఒరిజినల్ వెర్షన్ చూసినా చూడకపోయినా.. “గద్దలకొండ గణేష్”గా వరుణ్ తేజ్ రాకింగ్ పెర్ఫార్మెన్స్ & హరీష్ శంకర్ మార్క్ ఎలివేషన్స్ కోసం సినిమాను తప్పకుండా ఒకసారి చూడాల్సిందే. మాస్ ఆడియన్స్ ను ఖుష్ చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి ఈ గణేష్ కి.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus