“బేబీ” (Baby) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda,) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “గం గం గణేష” (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ నేడు (మే 31) విడుదలైంది. మరి ఈ సినిమాతో ఆడియన్స్ ను ఆనంద్ మరోసారి అలరించగలిగాడా లేదా అనేది చూద్దాం..!!
కథ: జీవితంలో పెద్దగా ఆశలేమీ లేకుండా చాలా సరదాగా స్నేహితుడు ((Emanuel Jabardasth) ఇమ్మాన్యుయేల్)తో కలిసి బ్రతికేస్తుంటాడు గణేష్ (ఆనంద్ దేవరకొండ). తాను ఘాఢంగా ప్రేమించిన శ్రుతి (నయన్ సారిక) కేవలం డబ్బు లేదన్న కారణంగా తనను వదిలేసిందనే బాధతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దొంగతనానికి పూనుకుంటాడు. కట్ చేస్తే.. చాలా చిన్న దొంగతనం కాస్తా ఏకంగా ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్తోంది. అసలు ఆనంద్ చేసిన దొంగతనం ఏమిటి? ఎమ్మెల్యే ఇంటికి ఆనంద్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ గణేషుడు గండం నుండి తప్పించుకున్నాడా? అనేది “గం గం గణేష” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: కామెడీ జోనర్ లో తన సత్తాను ఇదివరకే “పుష్పక విమానం”తో (Pushpaka Vimanam) చాటుకున్నాడు ఆనంద్ దేవరకొండ. “గం గం గణేష”తో దాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కువగా ఇమ్మాన్యుయేల్ మీద డిపెండ్ అయినప్పటికీ.. సెకండాఫ్ లో మాత్రం తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇమ్మాన్యుయేల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పాలి. ప్రతి సన్నివేశంలో తన బాడీ లాంగ్వేజ్ & సింగిల్ లైన్ పంచులతో మెప్పించాడు. కామెడీ నటులు కరువవుతున్న తరుణంలో ఇమ్మాన్యుయేల్ మంచి రీప్లేస్మెంట్ అవుతాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore) చాన్నాళ్ల తర్వాత తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు. ప్రగతి (Pragati Srivasthava) & నయన్ గ్లామర్ యాడ్ చేశారు కానీ.. నటించడానికి, హావభావాలు పలికించడానికి చాలా ఇబ్బందిపడ్డారు.
సాంకేతికవర్గం పనితీరు: చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) నేపధ్య సంగీతం మెయిన్ హైలైట్ అని చెప్పాలి. చాలా చోట్ల కామెడీ పంచులు కానీ, చిన్న చిన్న ఎలివేషన్స్ కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి చైతన్ నేపధ్య సంగీతం బాగా హెల్ప్ అయ్యింది. ఆదిత్య జివ్వాది సినిమాటోగ్రఫీ వర్క్ ప్రొడక్షన్ డిజైన్ & బడ్జెట్ కు తగ్గట్లుగా ఉంది. సౌండ్ & డి.ఐ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది.
దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి.. చిన్న కథను ఎంగేజింగ్ గా రాసుకున్నాడు. అయితే.. ఫస్టాఫ్ లో ల్యాగ్ ఎక్కువయ్యింది. సెకండాఫ్ కి వచ్చేసరికి సదరు మైనస్ పాయింట్స్ అన్నిట్నీ కామెడీతో కవర్ చేశాడు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ కామెడీని రాసుకున్న విధానం బాగుంది. దర్శకుడిగా కంటే రైటర్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఉదయ్ బొమ్మిశెట్టి.
విశ్లేషణ: లాజిక్కులు, స్క్రీన్ ప్లేలో మ్యాజిక్కులు గట్రా పట్టించుకోకుండా.. ఓ రెండు గంటల పాటు థియేటర్లో హ్యాపీగా టైమ్ పాస్ చేయడానికి గ్యాంగ్ తో చూడదగ్గ సినిమా “గం గం గణేష”. ఇమ్మాన్యుయేల్ కామెడీ టైమింగ్, ఉదయ్ రైటింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్.
ఫోకస్ పాయింట్: ఫన్ ఫన్ గణేష!
రేటింగ్: 2.5/5