గ్యాంగ్

  • January 12, 2018 / 11:40 AM IST

అసలే సంక్రాంతి, అందునా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజావుతున్నప్పటికీ ఏమాత్రం బెరక్కుండా తమిళనాట “తానా సేంధ్ర కొట్టం”గా రూపొందిన చిత్రాన్ని తెలుగులో “గ్యాంగ్” అనే పేరుతో అనువదించడమే కాక తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని మరీ రిలీజ్ చేశాడు. మరి సినిమా మీద అమితమైన నమ్మకమో లేక సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు రిలీజైనా హిట్ అవుతాయన్న సెంటిమెంటో తెలియదు కానీ సూర్య ధైర్యం చేశాడనే చెప్పాలి. మరి సూర్య నమ్మకం ఎంతవరకూ ఫలించిందో చూద్దాం..!!

కథ : పరిస్థితులు సహకరించక, సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొన్న ఒక గ్యాంగ్ (సూర్య, రమ్యకృష్ణ, సెంథిల్ తదితరులు) నకిలీ సి.బి.ఐ ఆఫీసర్లుగా మారి పలు రాష్ట్రాల్లో నకిలీ రైడ్ లు నిర్వహించి భారీ మొత్తంలో డబ్బులను కొల్లగొడుతుంటారు. వారిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసరి (కార్తీక్)ను నియమిస్తుంది. సూర్య అండ్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ వేరే ఎత్తులకు, సూర్య అండ్ గ్యాంగ్ వేసే పైఎత్తులు వేస్తుంటారు. ఈ మైండ్ గేమ్ లో చివరికి ఎవరు గెలిచారు? అనేది “గ్యాంగ్” కథాంశం.

నటీనటుల పనితీరు : సూర్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ ను తనదైన శైలిలో పండించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే.. నటుడిగా సూర్య తన పాత్రకి న్యాయం చేసినా.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ హీరో క్యారెక్టరైజేషన్ ను సరిగా డిజైన్ చేయకపోవడంతో అతడి క్యారెక్టర్ సరిగా ఎలివేట్ అవ్వలేదు. ఇక కీర్తి సురేష్ అండంతోపాటు అభినయంతోనూ అలరించింది. కానీ.. ఆమె పాత్రను సరిగా డిజైన్ చేకపోవడమే కాక క్లైమాక్స్ లో ఏమయ్యింది అనే విషయం కూడా చూపకపోవడం మైనస్. ఇక “సోగ్గాడే చిన్ని నాయన, బాహుబలి” తర్వాత రమ్యకృష్ణ తన నట చాతుర్యంతో, అందంతో, స్క్రీన్ ప్రెజన్స్ తో ఈ చిత్రంలో పూర్తిస్థాయిలో అలరించింది. కొన్ని ఫ్రేమ్స్ లో అయితే కీర్తి సురేష్ కంటే రమ్యకృష్ణ అందంగా కనిపించడం గమనార్హం.

ఇక సీనియర్ కమెడియన్ సెంథిల్ చాలాకాలం తర్వాత మళ్ళీ “గ్యాంగ్” సినిమాలో కనిపించడం విశేషం. సీనియర్ హీరో టర్నడ్ ఆర్టిస్ట్ కార్తీక్ ఈ చిత్రంలో ఒక టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా హావభావాలతో ఆకట్టుకొన్నారు కానీ.. ఆయన క్యారెక్టర్ కి ఉన్న వెయిట్ కి సరైన డెప్త్ లేకపోవడంతో ఆయన పాత్ర ఆడియన్స్ కి సరిగా ఎక్కదు.

సాంకేతికవర్గం పనితీరు : “అజ్ణాతవాసి” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనిరుధ్ “గ్యాంగ్” చిత్రానికి సమకూర్చిన బాణీల్లో “చిటికే, పిల్లా పిల్లా” మినహా ఆకట్టుకొనే స్థాయి పాటలు వేరే ఏమీ లేవు. అయితే.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఇరగదీశాడు. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎలివేషన్ సీన్స్ బాగా తీశారు. ఎడిటింగ్ మాత్రం ఇంకా షార్ప్ గా ఉండాలి. చాలా ల్యాగ్ ఉంది సెకండాఫ్ లో.

దర్శకుడు విగ్నేష్ శివన్ హిందీలో సూపర్ హిట్ అయిన “స్పెషల్ 26″ను తమిళ నేటివిటీకి తగ్గట్లుగా మార్చిన విధానం బానే ఉన్నప్పటికీ.. తన మార్క్ వేయడం కోసం ఇరికించిన కొన్ని అంశాలు సినిమాకి మైనస్ గా మారాయి. లాజిక్ అనేది పక్కన పెట్టినా కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా క్లైమాక్స్ ఎపిసోడ్ ను తెరకెక్కించడం అతడి ప్రతిభపై పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎలాగూ రీమేక్ రైట్స్ కొన్నారు కాబట్టి కొద్దిపాటి మార్పులతో “స్పెషల్ 26” చిత్రాన్ని సేమ్ టు సేమ్ తీసినా సినిమా “గ్యాంగ్” గండం తప్పించుకొని హిట్ అయ్యేదేమో. కానీ.. దర్శకుడి అతి పుణ్యమా అని తమిళంలో రిజల్ట్ తెలియదు కానీ తెలుగులో మాత్రం కష్టమే.

విశ్లేషణ : హిందీలో “స్పెషల్ 26” చిత్రాన్ని చూడనివారు, కాస్తంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చూసి ఆనందించేవారు ఒక్కసారి చూడదగ్గ చిత్రం “గ్యాంగ్”. అయితే.. పవన్ కళ్యాణ్, బాలకృష్ణల సినిమాలు కూడా ఇదే సమయంలో రిలీజై ఉండడంతో “గ్యాంగ్” గట్టునపడడం అనేది అంత సులభతరం కాదు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus