యాంగ్రీ యంగ్ మేన్ గా రెండు దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన రాజశేఖర్ ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక డీలా పడ్డారు. చేసిన సినిమాలు డిజాస్టర్లవ్వడం, కొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఆగిపోవడంతో ఇక హీరోగా రాజశేఖర్ పని అయిపోయిందని భావించి ఆయనకు విలన్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ ఇచ్చేందుకు కొందరు దర్శకనిర్మాతలు వెంటపడ్డారు. అలాంటి తరుణంలో రాజశేఖర్ హీరోగా దాదాపు 25 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “గరుడ వేగ”. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 3) విడుదలైంది. మరి రాజశేఖర్ కి “గరుడ వేగ” నిజంగానే “కమ్ బ్యాక్ ఫిలిమా?” అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) లో అసిస్టెంట్ కమిషనర్ గా వర్క్ చేస్తుంటాడు శేఖర్ (రాజశేఖర్). పైకి నార్మల్ పోలీస్ గా వ్యవహరించే శేఖర్ తన భార్య స్వాతి (పూజా కుమార్)కి కూడా తెలియకుండా కొన్ని ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ మిషన్స్ ను లీడ్ చేస్తుంటాడు. అందువల్ల ఫ్యామిలీ లైఫ్ లో సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలను చక్కదిద్దుకొనే పనిలో ఉండగా.. శేఖర్ కి అనుకొని విధంగా తారసపడతాడు నిరంజన్ (ఆదిత్). కట్ చేస్తే.. నిరంజన్ చుట్టూ పెద్ద ఉచ్చు బిగించి ఉందని, ఆ ఉచ్చులో తాను కూడా ఇరుక్కున్నానని తెలుసుకొంటాడు శేఖర్. పెద్దస్థాయిలో రాజకీయనాయకులు మాత్రమే కాక సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా ఇందులో భాగస్వాములు అని తొందరగానే తెలుసుకొంటాడు. ఇక రాజకీయనాయకులు, క్యాపిటలిస్ట్స్ అండ్ కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కు ఎదురు నిలబడి శేఖర్ వారు చేస్తున్న దోపిడీని బయటపెట్టగలిగాడా? అందుకోసం అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : రాజశేఖర్ కి “గరుడవేగ” సినిమాలోని శేఖర్ పాత్ర టైలర్ మేడ్. మధ్యవయస్కుడైన ఎన్.ఐ.ఏ అధికారిగా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అద్భుతంగా పండించాడు. ఎక్కడా అతి కనిపించకుండా చాలా రియలిస్టిక్ గా పెర్ఫార్మ్ చేయడంతోపాటు తనదైన శైలి హావభావాలతో ఆడియన్స్ ను అలరించాడు. గృహిణిగా పూజాకుమార్, జర్నలిస్ట్ గా శ్రద్ధదాస్ లు పర్వాలేదనిపించుకోగా.. రాజశేఖర్ సపోర్టింగ్ టీమ్ గా చరణ్ దీప్, రవివర్మలు ప్రశంసార్హమైన పాత్రలు పోషించారు. హ్యాకర్ నిరంజన్ గా ఆదిత్ సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకొన్నాడు. కిషోర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కనిపించినంతలో క్రూరత్వాన్ని బాగా పండించాడు. ఇంకా పోసాని, షాయాజీ షిండే, పృధ్వీరాజ్, అవసరాల శ్రీనివాస్ లు కూడా ఉన్నప్పటికీ.. వారి గురించి చెప్పుకోడానికి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు పోషించారు.
సాంకేతికవర్గం పనితీరు : శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. సన్నివేశంలోని ఇంటెన్సిటీని బాగా ఎలివేట్ చేయడమే కాక కొన్ని సన్నివేశాల్లోని భావాలను కూడా అద్భుతంగా పండించాడు. అంజి సినిమాటోగ్రఫీ వేల్యూస్ బాగున్నాయి. అయితే.. ఛేజింగ్ సీన్స్ కి అత్యంత కీలకమైన టాప్ యాంగిల్ షాట్స్ లేకపోవడం మైనస్. ఔట్ పుట్ పరంగా బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ వర్క్ బాగుంది, ఫస్టాఫ్ కనెక్టివిటీ గృప్పింగ్ గా ఉంది కానీ.. సెకండాఫ్ లో క్లారిటీ మిస్ అయ్యింది. సెకండాఫ్ లో ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపించింది. ప్రొడక్షన్ వేల్యుస్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి. 10 కోట్ల మార్కెట్ కూడా లేని రాజశేఖర్ ను నమ్ముకొని 25 కోట్లు కేవలం కథను నమ్ముకొని ఖర్చు చేసిన వారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే.. వారి కష్టానికి తగ్గ ఫలితం లభించిందనుకోండి.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మీడియా ముఖంగా చెప్పినట్లే.. సినిమా కథను కొన్ని హాలీవుడ్ చిత్రాల నుంచి స్పూర్తి తీసుకొన్నాడు. అలాగే హీరో రాజశేఖర్ క్యారెక్టరైజేషన్ ను హాలీవుడ్ నటులు బ్రూస్ విల్స్, లియామ్ నేసన్ లను పోలి ఉంటుంది. ఫస్టాఫ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా రాసుకొన్న ప్రవీణ్ సత్తారు.. సెకండాఫ్ విషయంలో మాత్రం తడబడ్డాడు. అలాగే.. క్లైమాక్స్ అంత కన్విన్సింగ్ గా లేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చాలా లాజికల్ గా స్క్రీన్ ప్లే రాసుకొన్న ప్రవీణ్ సత్తారు క్లైమాక్స్ ను అంత సిల్లీగా ఎలా రాసుకొన్నాడు అనేది అర్ధం కానీ ప్రశ్న. అలాగే.. ప్లూటోనియమ్ స్కామ్ అనే చాలా సెన్సిటివ్ అండ్ ఇంటెలిజెంట్ అంశాన్ని కథాంశంగా తీసుకొన్న ప్రవీణ్ సత్తారు.. ఆ విషయాలను ప్రేక్షకులకు కనీస స్థాయిలో అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు. ఆ స్కామ్ ఏంటి అనేది ఆడియన్స్ కు ఇంకాస్త నీట్ గా అర్ధమై ఉంటే.. సినిమాలో ఇంకాస్త బాగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్లు. అలాగే.. యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేసిన ప్రవీణ్ సత్తారు ఎక్కడా అతి కనిపించకుండా బానే ప్లాన్ చేసుకొన్నాడు కానీ.. వాటి కొరియోగ్రఫీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
విశ్లేషణ : మన రెగ్యులర్ రొట్ట కమర్షియల్ సినిమాలతో కంపేర్ చేసుకొంటే “డీసెంట్ సినిమా” అనిపించే “గరుడ వేగ”. రాజశేఖర్ కి నిజంగానే “కమ్ బ్యాక్ సినిమా”గా ఈ చిత్రాన్ని పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. ఫస్టాఫ్ లో వేసిన చిక్కుముడులను సెకండాఫ్ లో వివరించేప్పుడు కాస్త క్లారిటీ మెయింటైన్ చేసుంటే.. పెద్ద హిట్ అయ్యేది. మాస్ తోపాటు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకొనే అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్న “గరుడ వేగ” ఈ వారం విన్నర్ అని డిక్లేర్ చేసేయొచ్చు.
రేటింగ్ : 3/5