నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ దశలోనే సంచలనానికి బాటలు వేసింది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో సినిమాలో శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ రాయల్ లుక్ అదరగొట్టింది. ఆయన డైలాగులు చెప్పిన తీరు చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. మరికొన్ని డైలాగులు ఆడియో రిలీజ్ వేడుకలో విన్నాం. అవి ఇప్పుడు ప్రతి బాలయ్య ఫ్యాన్స్ నోటా పలుకుతున్నాయి. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా రచించిన డైలాగుల్లో కొన్ని..
1 . మీరు కడుపున మోసింది మనిషిని కాదు.. మారణహోమాన్ని.. మహా యుద్ధాన్ని..
2 . మా జైత్రయాత్రని గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి.. మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..
3 . నా బిడ్డ కోసమో.. నీ గడ్డ కోసమో కాదు నేను పోరాడుతున్నది, ఈ దేశం అంతటిని ఏక ఖండంగా కలపడానికి ..
4 . ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం.. ఇక ఉనికి చాటుకుందాం.. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తురితో ప్రక్షాలన చేద్దాం.. దొరికిన వాన్ని తురుముదాం.. దొరకని వాన్ని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం..
5 . అవును నాకు ఆ గర్వం కావాలి.. ఆ సేతు శీతాచలం ఈ మహాభారత దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా చూస్తుండే గర్వం కావాలి నాకు.. అలా చూడటానికి వాళ్ళందరిని కాపు కాసేందుకు జీవించే గర్వం కావాలి నాకు.
6 . వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. భారతదేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్యన గోడలుంటాయి.. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం.. కానీ పరాయి దేశస్థుడు ఎవడో వచ్చి ఆక్రమించాలి అని ప్రయత్నిస్తే.. ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు స్మశానాలు నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండాలెగరెస్తాం.
7. ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల.
8. అదుపులో పెట్టడానికి అసువుపోసే స్త్రీ పశువు కాదు.
9. యవనుడైనా.. వాడి జనకుడైనా.. అడుగు పెట్టినచోటే ఆరడుగులు దానమిస్తా ఆయువు తీస్తా.
10. తండ్రిని మించిన తనయుడు ఉంటాడు.. తల్లిని మించిన తనయుడు ఉంటాడా..?
11. తెలుగువాడు అధముడు కాదు ప్రధాముడు.
12. సింహం, చీమ యుద్ధంలో వెనుతిరగవు, సింహం చచ్చే వరకూ పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చేవరకూ కుట్టి కుట్టి చంపుతుంది.
13.ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగుచూసిన రక్తపు ముద్దవి.. నీకున్న అర్హత, నీ తల్లికి లేదా? . నేను అగ్ర తాంబూలం ఇస్తోంది మా అమ్మకే కాదు.. అమ్మకి.
నటసింహ తనదైన రాచరికపు శైలిలో, గంభీరంగా ఈ డైలాగులు చెబుతుంటే ప్రతి భారతీయుడికి ఒంట్లో రక్తం వేగంగా ఉరకలెత్తుతోంది. బాలీవుడ్ నటి హేమ మాలిని కీలక పాత్ర పోషించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రానుంది.