గౌతమిపుత్ర శాతకర్ణి

  • April 28, 2017 / 06:26 AM IST

ఈ సంక్రాంతి విడుదలైన ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాల్లో “గౌతమిపుత్ర శాతకర్ణి” ఒకటి. బాలకృష్ణ నటించిన 100వ సినిమాగానే కాక తెలుగువారి ఘన చరిత్ర చాటే చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటీమణి హేమమాలిని ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి 100వ సినిమా బాలయ్యకు ఎటువంటి ఫలితాన్నిచ్చింది, నందమూరి అభిమానులకు ఎటువంటి అనుభూతిని మిగిల్చిందో సమీక్ష చదివి తెలుసుకోండి!

కథ : వక్రీకరించడానికి ఏమాత్రం ఆస్కారం లేని అద్భుతమైన కథ. తెలుగు జాతిని ఏకం చేసిన మహావీరుడి ఘన చరిత్ర. అతడే గౌతమిపుత్ర శాతకర్ణి. భరతఖండంలోని 33 రాజ్యాలను జయించి.. తెలుగువారందర్నీ ఏకం చేసిన శాతకర్ణి మహారాజు సాగించిన జైత్రయాత్రే ఈ చిత్రం. పేరుకి రాజైనా.. బుద్ధిలో నికృష్టుడైన నేహాపాలుడ్ని కన్న బిడ్డతో సహా యుద్ధానికి వెళ్ళిన శాతకర్ణి ఎలా జయించాడు, తెలుగువారిపై పోటీకి దిగిన పరదేశీయులను ఏ విధంగా మట్టుబెట్టి.. తెలుగు జాతి పేరు ప్రతిష్టలను ప్రపంచానికి ఎంత ఘనంగా చాటి చెప్పాడు లాంటి ప్రశ్నలకు దర్శకుడు క్రిష్ చెప్పిన సమాధానాల సమాహారమే “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రం!

నటీనటుల పనితీరు : ఆవిక్రపరాక్రముడు శాతకర్ణిగా బాలకృష్ణ అద్భుతమైన నటనతో అలరించాడు. యాక్షన్ సీన్స్ లో బాలకృష్ణ నటన, ఆయన సంభాషణలు పలికిన విధానం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. శాతకర్ణి భార్య వాశిష్టిగా శ్రియ అందాల కనువిందు చేస్తూ.. అద్భుతమైన నటన కనబరిచింది. రాజమాత పాత్రలో హేమమాలిని లిప్ సింక్ లేకపోయినా.. హావభావాలతో ఆకట్టుకొంది. ఆ పాత్రకు రాజసం తీసుకువచ్చింది. మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేసినప్పటికీ.. మెయిన్ లీడ్ యాక్టర్స్ వాళ్ళని డామినేట్ చేసేయడంతో మిగతావారి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకుండా పోయింది.

సాంకేతికవర్గం పనితీరు : చిరంతన్ భట్ సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టు. ఇక నేపధ్య సంగీతంతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకొనేలా చేశాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలకు చిరంతన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. జ్ణానశేఖర్ సినిమాటోగ్రఫీ మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. టైట్ ఫ్రేమ్స్, బాలకృష్ణకు పెట్టిన టైట్ క్లోజ్ లు అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తాయి. లైటింగ్ విషయంలో జ్ణానశేఖర్ తీసుకొన్న జాగ్రత్తలకి సలాం చెప్పాల్సిందే. సాయిమాధవ్ బుర్రా సంభాషణలను ఇప్పటివరకూ బాలకృష్ణ సినిమాల్లో ది బెస్ట్ గా పేర్కొనవచ్చు.

“ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల”

“అదుపులో పెట్టడానికి అసువుపోసే స్త్రీ పశువు కాదు”

“యవనుడైనా.. వాడి జనకుడైనా.. అడుగు పెట్టినచోటే ఆరడుగులు దానమిస్తా ఆయువు తీస్తా”

“తండ్రిని మించిన తనయుడు ఉంటాడు.. తల్లిని మించిన తనయుడు ఉంటాడా..?”

“తెలుగువాడు అధముడు కాదు ప్రధాముడు”

“సింహం, చీమ యుద్ధంలో వెనుతిరగవు, సింహం చచ్చే వరకూ పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చేవరకూ కుట్టి కుట్టి చంపుతుంది”

చెప్పుకుంటూ పోతే ఇలాంటి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసే సంభాషణలు ఎన్నో. ఈ సినిమాతో సాయిమాధవ్ బుర్ర పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోవడం ఖాయం. ఇక చివరిగా క్రిష్ గురించి చెప్పుకోవాలి. మన తెలుగువారు మర్చిపోయిన తెలుగోడి చరిత్రను తవ్వి తీయడమే కాక.. అద్భుతమైన దృశ్యకావ్యంగా “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రాన్ని మలిచిన తీరు అభినందనీయం. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 76 రోజుల్లో ఇంతటి భారీ ప్రొజెక్ట్ ను పూర్తి చేయడంతోపాటు ఆశ్చర్యం కలిగించే ఔట్ పుట్ ని సాధించి.. “ది పర్ఫెక్ట్ ఫిలిమ్ మేకర్” అనిపించుకొన్నాడు. దర్శకుడిగా క్రిష్ ను వంద మెట్లు ఎక్కించే సినిమా ఇది.

నేహాపాలుడి దగ్గరకి శాతకర్ణి కన్నబిడ్డ తో సహా యుద్ధానికి వెళ్ళడం, ఎదురుగా శత్రువులు నిలబడి ఉన్నా.. బిడ్డ చెవుతున్న పిట్ట కథని వింటూ.. “కథలు మనం చెప్పుకోకూడదు నాన్నా.. మన కథను ప్రజలు చెప్పుకోవాలి” అని కొడుక్కి చెబుతూ.. శత్రువులకు శరణు కోరుకొమ్మని బెదిరించే సన్నివేశం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ సన్నివేశంలో హీరోయిజాన్ని క్రిష్ ఎలివేట్ చేసిన తీరుకి ఎవరైనా నివ్వెరపోవాల్సిందే!

విశ్లేషణ : ఎప్పుడూ పరాయి భాషలో తెరకెక్కిన చిత్రాలు చూసి “ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు” అని బాధపడే ప్రతి తెలుగువాడికి దొరికిన సమాధానం “గౌతమిపుత్ర శాతకర్ణి”. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడమే కాక.. తెలుగుజారి పౌరుషాన్ని, పరాక్రమాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చీటిన చెప్పిన ఈ చిత్రాన్ని ప్రతి తెలుగువాడు తప్పక చూడాలి!

రేటింగ్ : 3/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus