స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను రూపొందించడంతో దర్శకుడు గౌతమ్ మీనన్ కి సెపరేట్ స్టైల్ ఉంది. ఆయన సినిమాలన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా కథలు చెప్పాలనుకునే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అందులో గౌతమ్ మీనన్ ఒకరు. హీరోలు కూడా రిజల్ట్ తో సంబంధం లేకుండా గౌతమ్ మీనన్ తో సినిమాలు చేయాలనుకుంటారు. ఈ మధ్యకాలంలో గౌతమ్ మీనన్ నటనపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో, అలానే ‘పావై కథైగల్’ లాంటి వెబ్ సినిమాలో కూడా నటించారు.
ఇప్పుడు ఈ డైరెక్టర్ తెలుగులో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. అది కూడా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ స్టార్ తో అని తెలుస్తోంది. బన్నీని దృష్టిలో పెట్టుకొని గౌతమ్ మీనన్ ఓ పోలీస్ స్టోరీ రాసుకున్నారట. ప్రస్తుతం అతడిని కలిసి కథ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. బన్నీ ఇప్పటివరకు పూర్తి స్థాయి పోలీస్ క్యారెక్టర్ లో కనిపించలేదు. ఆ మధ్య ‘రేసుగుర్రం’ సినిమాలో కాసేపు పోలీస్ గెటప్ లో కనిపించారు.
నిజానికి స్టార్ హీరోలందరూ కూడా ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలను పోలీస్ ఆఫీసర్ రోల్స్ లో చూసేశాం. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. పైగా పోలీస్ పాత్రలను స్టయిలిష్ గా చూపించడం గౌతమ్ మీనన్ స్పెషాలిటీ. బన్నీకి గనుక కథ నచ్చితే గౌతమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న బన్నీ ఆ తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. అది పూర్తయితే గానీ గౌతమ్ మీనన్ కి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి.