“యువత” సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన పరశురామ్.. “సోలో” సినిమాతో ఫ్యామిలీ చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరని నిరూపించుకున్నారు. ఆంజనేయులు, సారొచ్చారు అనే చిత్రాలతో తడబడినా అల్లు శిరీష్ “శ్రీరస్తు శుభమస్తు” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేశారు. విజయ్ దేవరకొండ, రష్మీక లతో “గీత గోవిందం” సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ వందకోట్ల క్లబ్ లో చేరడంతో పరశురామ్ నెక్స్ట్ ప్రాజక్ట్ పై ఆసక్తి నెలకొంది. ఏ హీరోతో సినిమా చేస్తారు? ఎటువంటి కథని ఎంచుకుంటారు? అనే సంగతులు తెలుసుకోవాలనే ఆత్రుత పెరిగింది. కానీ నిర్మాతల్లో, హీరోల్లో పరశురామ్ కి క్రేజ్ పెరగలేదంట. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.
ఈ సినిమా ఘనవిజయం సాధించడానికి కారణం హీరో విజయ్ దేవరకొండ కానీ, పరశురామ్ కాదని అందరూ నమ్ముతున్నారు. విజయ్ తన స్టామినాతో సినిమాను ఆ స్థాయికి తీసుకువెళ్ళారనీ, ఈ సినిమా మిగతా ఏ హీరోతో చేసినా, ఇంత గొప్ప విజయం లభించేది కాదని భావిస్తున్నారు. అందుకే టాలీవుడ్‌లో స్టార్ హీరోలు, నిర్మాతలు పరశురాంతో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. పరుశురామ్ కథ చెబుతానని హీరోలని అడిగితే డేట్లు ఖాళీ లేవని తప్పించుకుంటున్నారని టాక్. ఇప్పుడు తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకోవాల్సిన అవసరం మళ్ళీ ఏర్పడింది.