Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విక్రమ్ ప్రభు (Hero)
  • అనుష్క శెట్టి (Heroine)
  • చైతన్య రావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ (Cast)
  • క్రిష్ జాగర్లమూడి (Director)
  • జె.సాయిబాబు, వి.వంశీకృష్ణ రెడ్డి - వై.రాజీవ్ రెడ్డి - ప్రమోద్ ఉప్పలపాటి (Producer)
  • నాగవెల్లి విద్యాసాగర్ (Music)
  • మనోజ్ రెడ్డి కాటసాని (Cinematography)
  • వెంకట స్వామి నక్క - చాణక్య రెడ్డి తూరుపు (Editor)
  • Release Date : సెప్టెంబర్ 5, 2025
  • ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ - యువి క్రియేషన్స్ (Banner)

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు కమర్షియల్ ఫార్మాట్ ను పూర్తిగా ఆకళింపు చేసుకుని తెరకెక్కించిన చిత్రం “ఘాటి” (Ghaati). తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను రేకెత్తించింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Ghaati Movie Review

కథ: ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ లో మాత్రమే పండే శీలావతి అనే గంజాయికి ప్రపంచవ్యాప్తంగా భీభత్సమైన మార్కెట్ ఉంటుంది. ఆ శీలావతి గంజాయిని కంట్రోల్ చేస్తుంటారు నాయుడు బ్రదర్స్.

కట్ చేస్తే.. నాయుడు బ్రదర్స్ కి కూడా తెలియకుండా శీలావతి గంజాయిని లిక్విడ్ ఫార్మ్ లో స్మగుల్ చేస్తుంటారు శీలావతి (అనుష్క) & దేశిరాజు (విక్రమ్ ప్రభు).

అసలు శీలావతి & దేశిరాజులు గంజాయిని లిక్విడ్ ఫార్మ్ లో ఎందుకు స్మగుల్ చేస్తుంటారు? వారి ధ్యేయం ఏమిటి? ఈ విషయం తెలుసుకున్న నాయుడు బ్రదర్స్ ఎలాంటి దాష్టీకం సృష్టించారు? దాన్ని శీలావతి ఎలా ఎదుర్కొంది? అనేది “ఘాటి” కథాంశం.

నటీనటుల పనితీరు: తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చాడు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని తన సిన్సియారిటీ ప్రూవ్ చేసుకున్నాడు. దేశిరాజు పాత్రలో చాలా సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.

ఈ తరహా ఓవర్ ది టాప్ యాక్షన్ ను హీరోయిన్స్ లో విజయశాంతి తర్వాత అనుష్క మాత్రమే కన్విన్సింగ్ గా పండించగలుగుతుంది. హీరోలా పదుల సంఖ్యలో జనాల్ని ఒంటిచేత్తో కొట్టి చంపినా, లెక్కకు మిక్కిలి విలన్లను ఎదిరించి నిలబడిన ఆమె పర్సనాలిటీకి సింక్ అవుతుంది. సీజీ వర్క్ వల్ల చాలా హావభావాలు సరిగా కనిపించలేదు కానీ.. కుదిరినంతలో మంచి నటన కనబరిచింది.

చైతన్యరావు మాత్రం కుందుల నాయుడు పాత్రలో పేట్రేగిపోయాడు. అసలు అతడి ఆహార్యం, బాడీ లాంగ్వేజ్, కళ్లతో బలుపు ప్రదర్శించే తీరు అతడ్ని నటుడిగా మరో లీగ్ కి తీసుకువెళ్లడం ఖాయం. చెప్పాలంటే.. తాను తెరపై కనిపించినంతసేపు మిగతా ఆర్టిస్టులందర్నీ డామినేట్ చేసేసాడు చైతన్య రావు.

జగపతిబాబు చాన్నాళ్ల తర్వాత కాస్త విషయం ఉన్న పాత్రలో కనిపించాడు. అతని శైలి నటనతో పాత్రను పండించాడు. మంచి ఎనర్జీ యాడ్ చేశాడు కూడా.

రవీంద్ర విజయ్, “తిక్క” ఫేమ్ లారిస్సా, జిష్ణు సేన్ గుప్తా, రాజు సుందరం తదితరులు తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీతం వినడానికి కొత్తగా ఉంది కానీ.. వినసొంపుగా లేదు. థియేటర్ నుంచి బయటికి వచ్చే సమయానికి ఒక్క ట్యూన్ కూడా గుర్తులేకుండాపోయింది.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉన్నా.. వీక్ ప్రొడక్షన్ డిజైన్ కారణంగా చాలా చోట్ల తేలిపోయింది.

దర్శకుడు క్రిష్ ఎంచుకున్న కథలో బలం ఉంది. ఘాటీల జీవితాలను ఇంకాస్త ఎక్స్ ప్లోర్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ.. ఎప్పుడూ మానవీయ కోణానికి పెద్దపీట వేసే క్రిష్ మొదటిసారి కమర్షియాలలిటీకి తలొగ్గడం అనేది ఆయన శైలి మార్క్ ను అభిమానించే ప్రేక్షకులకు మింగుడుపడదు. సెకండాఫ్ లో ఆ లోటు తీర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. దానికి సరైన జస్టిఫికేషన్ సెట్ అవ్వలేదు. అందువల్ల.. చివర్లో వచ్చే చైతన్యం పెద్దగా ప్రకాశించలేదు. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకోవడంలో మాత్రం మంచి విజయం సాధించాడు క్రిష్. ఓవరాల్ గా చెప్పాలంటే.. క్రిష్ దర్శకుడిగా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశ్లేషణ: ప్రతి దర్శకుడికి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ దాటి సినిమాలు తీసినప్పుడు కాస్త వ్యతిరేకత రావడం కామన్. అయితే.. క్రిష్ “ఘాటి” (Ghaati) చిత్రంతో తన మార్క్ ను పక్కన పెట్టడమే కాక కమర్షియాలిటీ విషయంలో కత్తి మీద సాము చేశాడు. సన్నివేశంలో ఎమోషన్ ఉన్నప్పటికీ.. దాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందే స్థాయిలో ఎలివేట్ చేయడంలో తడబడ్డాడు. సీన్ కంపోజిషన్ లో విషయం ఉన్నప్పటికీ.. దానికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. “ఘాటి”లో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లోపించింది. అందువల్ల అనుష్క విశ్వరూపం, క్రిష్ మార్క్ మానవీయ కోణం ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే.. షూటింగ్ లొకేషన్స్, అనుష్క స్క్రీన్ ప్రెజన్స్, కొన్ని యాక్షన్ బ్లాక్స్ మాత్రం ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా మెప్పిస్తాయి.

ఫోకస్ పాయింట్: ఘాటు సరిపోలేదు క్రిష్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus