అక్కినేని కుటుంబానికి అపురూపంగా నిలిచిన చిత్రం “మనం”. మూడు తరాల హీరోలు ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. అక్కినేని అభిమానులకు ఈ సినిమా కనుల పండుగ అయింది. ఇదే తరహాలో సూపర్ స్టార్ కృష్ణ ఒక ఫిల్మ్ ని తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆయన కల నెరవేరే సమయం ఆసన్నమైంది.
రామ్ గోపాల్ వర్మ ‘అనగనగా ఒక రోజు,’ కృష్ణవంశీ ‘గులాబి’ సినిమాలకు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు ఘట్టమనేని హీరోల కోసం ఒక కథను సిద్ధం చేశారు. కృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే “అల్లూరి సీతారామరాజు” కు ఈ కథ ప్రీక్వెల్. పోరాట యోధుడు అల్లూరి బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనలు, అతనిపై ఎలా ప్రభావం చేసింది ? అనే కోణంలో కథ గమనం ఉంటుంది. బాల సీతారామ రాజుగా కృష్ణ మనవుడు గౌతమ్ నటించనున్నాడు. మహేష్ తనయుడు “నేనొక్కడినే” చిత్రంలో చక్కగా నటించి అభినందనలు అందుకున్నాడు. అతను ఈ పాత్రకు తగిన న్యాయం చేయగలడని భావిస్తున్నారు.
దేశభక్తిని సినిమాల్లో అద్భుతంగా చూపించిన క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. “శ్రీరామరాజు” అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ మూవీలో గౌతమ్ తో పాటు, కృష్ణ, మహేష్ బాబు కు నటించనున్నారు.