God Review in Telugu: గాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 13, 2023 / 12:58 PM IST

Cast & Crew

  • జయం రవి (Hero)
  • నయనతార (Heroine)
  • రాహుల్ బోస్, నారియన్, వినోద్ కిషన్ తదితరులు.. (Cast)
  • ఐ.అహ్మద్ (Director)
  • జెరిష్ రా (Producer)
  • యువన్ శంకర్ రాజా (Music)
  • హరి కె.వేదాంతం (Cinematography)
  • Release Date : అక్టోబర్ 13, 2023

జయం రవి-నయనతార-రాహుల్ బోస్-వినోద్ కిషన్ ముఖ్యపాత్రధారులుగా తమిళంలో తెరకెక్కి, గతవారం తమిళాట విడుదలైన చిత్రం “ఇరైవన్”. సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ పెద్దగా వర్కవుటవ్వలేదు. ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో “గాడ్” అనే పేరుతో అనువాదరూపంలో విడుదల చేశారు నిర్మాతలు. మరి తమిళనాటన ఆడలేకపోయిన ఈ చిత్రం తెలుగునాట ఏమైనా వర్కవుటయ్యిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: తప్పు చేసిన వాడు చట్టం అడ్డం పెట్టుకొని బ్రతకడాన్ని సహించని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ (జయం రవి)కి నగరంలో వరుసగా జరుగుతున్న ఆడపిల్లల హత్య కేసు తలనొప్పిగా మారుతుంది. స్మైలీ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) దొరికాడు అని సంబరపడేలోపు అతడు తప్పించుకొని మొత్తం డిపార్ట్మెంట్ ను హడలెత్తిస్తాడు.

అర్జున్ ఎంతో చాకచక్యంగా మళ్ళీ బ్రహ్మను పట్టుకొన్న తర్వాత కూడా ఆడపిల్లల దారుణ హత్యలు జరుగుతూనే ఉంటాయి.. ఈసారి బ్రహ్మను ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ అవుతుంటారు. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? బ్రహ్మ కాకుండా మరో కిల్లర్ కూడా ఉన్నాడా? అనేది “గాడ్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ జయం రవికి కొత్తేమీ కాదు. అందువల్ల అర్జున్ పాత్రను అవలీలగా పోషించేశాడు. అయితే.. ప్రత్యేకంగా ప్రశంసించే స్థాయిలో అతడి క్యారెక్టరైజేషన్ లేకపోవడం గమనార్హం. నయనతారది ఈ సినిమా గెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తానికి కలిపి ఒక 15 నిమిషాలు కూడా కనిపించదామె. నారియన్ పాత్ర చిన్నదే అయినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక స్మైలీ కిల్లర్ బ్రహ్మగా రాహుల్ బోస్ ఒదిగిపోయి నటించినప్పటికీ..

అతడికి సరైన స్క్రీన్ ప్రెజన్స్ లేకపోవడం వల్ల.. ట్రైలర్ లో కనిపించిన స్థాయిలో సినిమాలో అతడి పాత్ర పండలేదు. అప్పుడెప్పుడో వచ్చిన “నా పేరు శివ” నుంచి ఇదే తరహా పాత్రలు చేస్తున్న వినోద్ కిషన్ ఈ చిత్రంలోనూ సైకో కిల్లర్ గా అలరించాడు. విజయలక్షి, ఆశిష్ విద్యార్ధి, చార్లీ, అశ్విన్ కుమార్, రాఘవేంద్ర గోపి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: యువన్ శంకర్ రాజా ఒక్కడే టెక్నీషియన్ గా సినిమాకి న్యాయం చేశాడు. తనదైన శైలి నేపధ్య సంగీతంతో సినిమాకి కావాల్సిన టెన్షన్ & ఎమోషన్ ను క్రియేట్ చేశాడు యువన్. పాటలు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో మాత్రం బాలేవు. సినిమాటోరఫీ వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా బ్లడ్ ను బ్రైట్ గా కాకుండా డార్క్ గా ప్రొజెక్ట్ చేసిన తీరు ఆ తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎడిటింగ్ విషయంలో మేకర్స్ ఇంకాస్త స్ట్రిక్ట్ గా ఉంటే బాగుండేది.

దర్శకుడు అహ్మద్ ఒక సాధారణ సైకో కిల్లర్ కథకు చిన్న ట్విస్ట్ ఇచ్చి లాగించేయాలనుకున్నాడు. ట్విస్ట్ బాగున్నా.. దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఫెయిల్ అయ్యింది. అలాగే.. మొదటి నుంచి ఆడపిల్లల్ని రకరకాలుగా హత్య చేయడం చూపించీ, చూపించీ.. ఒకానొక సందర్భంలో తెరపై హత్య జరుగుతున్నా ఆడియన్స్ కి బోర్ కొట్టి, ఆ ఎమోషన్ కు ఏమాత్రం కనెక్ట్ అవ్వలేకపోయారు.

ఎమోషన్ అయినా రక్తపాతమైనా.. ఒక లిమిట్ వరకే బాగుంటుంది, అది దాటితే బోర్ కొడుతుంది అని ప్రూవ్ అయ్యింది. ఇక సెకండాఫ్ లో వచ్చే సెక్స్ అడిక్ట్ క్యారెక్టర్ సినిమాకి కాస్త మసాలా యాడ్ చేసినా.. మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక వినోద్ కిషన్ & జయం రవి మధ్య జరిగే యుద్ధాన్ని అహ్మద్ సరిగా కపోజ్ చేసుకోలేదు. అందువల్ల ఆసక్తికరంగా సాగాల్సిన ఆ పోరాటం.. ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది.

విశ్లేషణ: గోర్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకోగలిగే చిత్రం (God) “గాడ్”. సరైన డ్రామా & ఎమోషన్ లేకపోవడం వలన సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus