గృహం

  • November 17, 2017 / 07:03 AM IST

ఈ మధ్య కాలంలో సరైన విజయం లేక ఢీలా పడ్డ సిద్దార్థ్ తానే నిర్మాతగా-రచయితగా మారి నటించిన చిత్రం “గృహం”. తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్రెడీ తమిళం-హిందీ భాషల్లో విడుదలై సూపత్ హిట్ టాక్ సొంతం చేసుకోగా నేడు (నవంబర్ 17) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి “ప్యూర్ హారర్ ఎంటర్ టైనర్”గా రూపొందిన ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకులను ఏమేరకు భయపెట్టగలిగిందో చూద్దాం..!!

కథ : కృష్ణ (సిద్ధార్థ్) ఓ న్యూరో సర్జన్, బ్రెయిస్ స్టిమ్యులేషన్ లో స్పెషలిస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకొన్న లక్ష్మీ (ఆండ్రియా)తో కలిసి హిమాలయాస్ దగ్గర్లో నివసిస్తుంటారు. సంతోషంగా జీవిస్తున్న వారి ఇంటిపక్కన ఉన్న మరో బంగ్లాలోకి వస్తారు డాక్టర్ పాల్ (అతుల్ కులకర్ణి) అండ్ ఫ్యామిలీ. మొదట్లో అంతా సరదాగానే ఉంటుంది. కానీ.. ఉన్నట్లుండి పాల్ కూతురు జెన్నీ (అనీషా విక్టర్) వింతగా బిహేవ్ చేయడం మొదలెడుతుంది. మొదట్లో ఆమె కావాలనే అలా చేస్తుందనుకొంటాడు సైక్రియార్టిస్ట్ ప్రసాద్ (సురేష్). కానీ.. ఒక ఫేక్ ఎగ్జార్సిజమ్ నిర్వహిస్తుండగా.. జెన్నీ బాడీలో వేరే ఆత్మ ఉందని గ్రహించి.. ఆ ఆత్మ ఎవరు? జెన్నీ బాడీలోకి ఎందుకు ప్రవేశించింది? అనే విషయాలు కనుక్కోవడం కోసం ప్రయత్నాలు మొదలెడతారు కృష్ణ & ప్రసాద్. ఈ క్రమంలో వారికి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. వాటి ఆధారంగా కాపాడాల్సింది జెన్నీని కాదు కృష్ణని అని తెలుసుకొంటారు. అసలు జెన్నీ బాడీలో ప్రవేశించిన ఆత్మకి కృష్ణకి సంబంధం ఏమిటి? అసలు ఈ ఆత్మల వెనుక ఉన్న కథ ఏమిటి? అనేది “గృహం” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విశేషాలు.

నటీనటుల పనితీరు : బహుశా లవర్ బోయ్ సిద్దార్ధ్ నటించిన పూర్తి స్థాయి హారర్ సినిమా ఇదే. (“ఆరణ్మనై”లో నటించినప్పటికీ అది హారర్ కామెడీ). రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను చాలా అద్భుతంగా పోషించాడు సిద్ధార్థ్. భయపడడం అంటే ఏదో కిందపడి దొర్లేయడం, అరిచేయడం లాంటివి చేయకుండా చాలా రియలిస్టిక్ గా కళ్ళతో పలికించిన హావభావాలు ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయి. సిద్ధార్డ్ కెరీర్ లో ఒన్నాఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఈ చిత్రాన్ని పేర్కొనవచ్చు. ఆండ్రియా ఈ చిత్రంలో మోడ్రన్ వైఫ్ గా ఆకట్టుకుంటుంది. శృంగార సన్నివేశాలు కాస్త శ్రుతిమించినప్పటికీ.. ఎక్కడా అసభ్యత కనిపించకుండా కేవలం కథలో భాగం అని ప్రేక్షకుడు అర్ధం చేసుకోడానికి ఆండ్రియా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ కీలకం. వీరిద్దరి తర్వాత సినిమాలో కీలకపాత్ర పోషించిన అమ్మాయి అనీషా విక్టర్. “జెన్నీ” పాత్రలో దెయ్యం పట్టిన అమ్మాయిలా అద్భుతమైన నటన కనబరిచింది. అమ్మాయికి ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. ముఖ్యంగా ఎగ్జార్సిజమ్ ఎపిసోడ్స్ లో జెన్నీ నటన ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. సురేష్ ఈ చిత్రంలో సైక్రియార్టిస్ట్ గా అర్ధవంతమైన పాత్రలో కనిపించడమే కాక నవ్వించాడు కూడా.
అతుల్ కులకర్ణి బాధ్యత కలిగిన తండ్రి పాత్రలో మెప్పించాడు.

సాంకేతికవర్గం పనితీరు : హారర్ సినిమాలకు చాలా ముఖ్యమైనది “సౌండ్ ఎఫెక్ట్స్”. “గృహం” సినిమాను మంచి థియేటర్లో చూడగలిగితే గనుక ఇప్పటివరకూ హాలీవుడ్ సినిమాలు “కాంజ్యూరింగ్, ఎగ్జార్సిజమ్” లాంటి సినిమాలు చూసి తెలుగులో ఈ తరహా సినిమాలు ఎందుకు రావు అని బాధపడిన ప్రేక్షకులకు సమాధానం దొరికినట్లే. సౌండ్ డిజైనింగ్ నిజంగానే హాలీవుడ్ స్థాయిలో ఉంది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్ తో నింపేయకుండా.. అవసరమైన చోట కేవలం నిశ్శబ్ధాన్నే వాడడంతో ప్రేక్షకుడికి ఒక రియల్ హారర్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. సినిమాలో మెచ్చుకోవాల్సిన మరో అంశం ఆర్ట్ వర్క్. సినిమా మొత్తం రెండు ఇళ్ళల్లోనే జరుగుతున్నప్పటికీ.. ఆర్ట్ డిపార్ట్ మెంట్ తీసుకొన్న జాగ్రత్తల వల్ల ఆడియన్స్ కు రిపీటెడ్ లొకేషన్స్ చూస్తున్నామన్న భావన కలగదు. పైగా.. హారర్ అనగానే సినిమాని చీకటికి పరిమితం చేయకుండా డిమ్ లైట్ లో సినిమాను తెరకెక్కించిన విధానం మెయిన్ ఎస్సెట్. అందుకు సినిమాటోగ్రాఫర్ శ్రేయస్ కృష్ణను మెచ్చుకోవాల్సిందే. హారర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే “జంప్ స్కేర్” షాట్స్ ను ఎక్కువగా వాడకుండా ప్రేక్షకులు భయపడ్డారంటే అది కెమెరామెన్ పనితనమే.

సినిమాకి కలరింగ్ కీలకం, గ్రే టింట్ లో హారర్ సినిమాలను కేవలం హాలీవుడ్ లోనే చూసి ఉంటాం. కానీ మొదటిసారిగా సౌత్ లో గ్రే టింట్ ను వాడిన హారర్ సినిమా “గృహం”. (వర్మ తెరకెక్కించే హారర్ చిత్రాలకు బ్రౌన్ టింట్ అండ్ లైటింగ్ వాడేవాడు). సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు అనవసరమేమో అనిపిస్తుంది. కానీ.. సినిమాలోని ట్విస్టులను డిస్క్లోజ్ చేస్తున్నప్పుడు అర్ధవంతంగా చెప్పడానికే ఆ సన్నివేశాలు ఉన్నాయని గ్రహిస్తాడు ప్రేక్షకుడు. సిద్ధార్హ్ డైరెక్టర్ మిళింద్ రావ్ తో కూర్చొని నాలుగున్నరేళ్లపాటు కథ-స్క్రీన్ ప్లే రాసుకొన్నాడంటే మొదట్లో నవ్వుకున్నవాళ్ళకి సినిమా చూస్తే వారు పడిన కష్టం, తీసుకొన్న జాగ్రత్తలు అర్ధమవుతాయి.

దర్శకుడు మిళింద్ రావు ఎంచుకొన్న కథ కంటే.. ఆ కథను నడిపించిన కథనం ప్రేక్షకుడ్ని కుర్చీకి కట్టేస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుడు ఎక్స్ ఫెక్ట్ చేసింది కాక ఊహించనిది చూపిస్తూ చివరివరకూ వారిని ఆశ్చర్యానికి గురిచేశాడు. విపరీతంగా ఇంగ్లీష్, కొరియన్ హారర్ సినిమాలు చూసేవారికి తప్పితే సగటు ప్రేక్షకులకు సినిమాలో ట్విస్ట్ ఏమిటనేది చివరివరకూ అర్ధం కాదు. అంత బాగా టెన్షన్ ను హోళ్డ్ చేశాడు డైరెక్టర్. అలాగే.. చిక్కుముడులను విప్పుతున్నప్పుడు అవి లాజికల్ గా ఉండేలా తీసుకొన్న జాగ్రత్తలు కూడా ప్రశంసనీయం. తొలి ప్రయత్నంలోనే నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ లు రాబట్టుకోవడం మొదలుకొని సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించడం, సినిమాకు అవసరమైన టెన్షన్ ను క్రియేట్ చేయడంలో మిళింద్ వందశాతం విజయం సాధించాడు.

విశ్లేషణ : హారర్ సినిమా అనగానే “ఓ ఇల్లు, ఓ దెయ్యం, హీరోయిన్ కి దెయ్యం పట్టడం, హీరో కాపాడడం, మధ్యలో కామెడియన్లను దెయ్యం ఉతికారేయడం” అనే రెగ్యులర్ ఫార్మాట్ ను చూసి చూసి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకుడికి ఒక రియలిస్టిక్ హారర్ ఎక్స్ పీరియన్స్ ను కలిగించే చిత్రం “గృహం”. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఒక ప్యూర్ హారర్ సినిమా చూడాలని ఆశపడే ప్రతి ప్రేక్షకుడు తప్పకుండా చూడాల్సిన సినిమా “గృహం”.

రేటింగ్ : 3/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus