ఓ పక్క కమెడియన్ గా రాణిస్తూనే మరోపక్క హీరోగా కూడా మారి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ వంటి చిత్రాలు చేసాడు సప్తగిరి. ఈ రెండు కూడా కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి హీరోగా మారి ‘గూడుపుఠాణి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సప్తగిరి. ఈ చిత్రం టీజర్ , ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం అలాగే ‘పలాస’ తర్వాత మరోసారి ప్రముఖ సింగర్,మ్యూజిక్ డైరెక్టర్ అయిన రఘు కుంచె ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండడం తో ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడింది.మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంతవరకు అందుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: గుడిలో నగల్ని దొంగతనాలు చేసే ఓ ముఠా. అక్కడ రహస్యంగా కలుసుకోవడానికి వచ్చే ప్రేమ జంటల పై దాడి చేసి అమ్మాయిల పై అత్యాచారాలు చేస్తూ వారిని హతమారుస్తుంటారు. అసలు ఈ ఘోరాలకు పాల్పడే కిరాతకులు ఎవరో తెలీక పోలీసు వ్యవస్థ ముప్పుతిప్పలు పడుతుంది. ఇంతలో ఓ ప్రేమ జంట గిరి(సప్తగిరి) సిరి(నేహా సోలంకి) పెళ్ళి చేసుకోవడానికి ఆ గుడికి వెళ్తారు. కానీ ఆరోజు మంచి ముహూర్తం కాదు అని చెప్పి పూజారి వాళ్ళ పెళ్ళి చేయడు. అటు తర్వాత గిరి,సిరి అక్కడే ఉన్నారన్న విషయాన్ని గమనించకుండా గుడి తలుపులకి తాళం వేసి వెళ్ళిపోతాడు.ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న గిరి,సిరి బయటపడాలని నానా ప్రయత్నాలు చేస్తారు.
కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. ఇంతలో ఆ దొంగతనాలు చేసే ముఠా.. గుడిలోకి ప్రవేశిస్తారు. అందులో పూజారి కూడా ఉండడంతో వీళ్ళు షాక్ కు గురవుతారు. అదే సమయంలో సిరి ఆత్రం ఎక్కువయ్యి వాళ్ళు అమ్మవారి నగలు దొంగతనం చేస్తుండగా వీడియో తీస్తుంది. ఇది వాళ్ళ కంట పడడంతో ఇద్దరూ చిక్కుల్లో పడతారు. చివరికి వాళ్ళు ఎలా బయటపడతారు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: సప్తగిరి ఎప్పటిలానే హుషారుగా నటించాడు. పిరికివాడైన గిరి పాత్రలో అప్పుడప్పుడు నవ్విస్తూ.. తన ప్రియురాలిని విలన్ గ్యాంగ్ నుండీ కాపాడుకోవడానికి అతను పడే తపనని(ఎమోషనల్ యాంగిల్) ను బాగా ప్రెజెంట్ చేసాడు. ఇక ’90 ఎం.ఎల్’ ఫేమ్ నేహా సోలంకి లుక్స్ బాగానే ఉన్నాయి. కానీ నటన పరంగా ఆమె ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. అయితే హీరో కంటే ఎక్కువగా ఈమెతో విలనే ఎక్కువ రొమాన్స్ చేసాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక విలన్ గా రఘు కుంచె మరోసారి అదరకొట్టాడు. మిగిలిన క్యాస్టింగ్ లో రాజబాబు కొడుకు అనంత్ బాబు, ప్రభు లకి తప్ప మిగిలిన వాళ్లకి పెద్దగా స్కోప్ లేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు కుమార్.కె.ఎం మంచి పాయింట్ ను అనుకున్నాడు.అందుకు తగ్గట్టే మంచి క్యాస్టింగ్ ను కూడా ఎంపిక చేసుకున్నాడు.నిర్మాతతో అతను అనవసరపు ఖర్చు చేయించలేదు.ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు.అలాగే హీరో,విలన్ పాత్రలను అతను తీర్చిదిద్దిన తీరు కూడా బాగుంది.కాకపోతే క్లైమాక్స్ పై అతను ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. ప్రతాప్ విద్య సంగీతం జస్ట్ ఓకే.. నేపధ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ లోపాలు చాలానే ఉన్నాయి.నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. మొత్తం సినిమా అంతా ఒక్క గుడిలోనే కానిచ్చేశారు కాబట్టి అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేవు.
విశ్లేషణ: సప్తగిరి నటన, కామెడీ… విలన్ రఘు కుంచె విలనిజం కోసం ఈ ‘గూడుపుఠాణి’ ని ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.75/5