సందీప్ కిషన్ కథానాయకుడిగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “గల్లీ రౌడీ”. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ అనుకున్నప్పటికీ.. థియేటర్లో విడుదల చేశారు. మరి దర్శకనిర్మాతలు తీసుకున్న ఈ రిస్క్ వాళ్లకి ఎలాంటి ఫలితాన్నిచ్చింది అనేది చూద్దాం..!!
కథ: అదో పెద్ద రౌడీల వంశం. అయితే.. అప్పట్లో అలరారిన రౌడీయిజం ఇప్పుడు లేకపోవడంతో తన మనవడు వాసు (సందీప్ కిషన్)ను మంచి రౌడీని చేయాలనే తపనతో రౌడీగా పెంచుతాడు తాతయ్య (నాగినీడు).. పెద్ద రౌడీ అవుతాడు అనుకుంటే గల్లీ రౌడీగా సెటిల్ అవుతాడు వాసు. ఆ గల్లీ రౌడీని ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ కోసం అప్రోచ్ అవుతుంది మన హీరోయిన్ & ఫ్యామిలీ (రాజేంద్రప్రసాద్ & కో). అప్పుడు సీన్ లోకి ఎంట్రీ అవుతాడు క్రిమినల్ పోలీస్ రఘు నాయక్ (బాబీ సింహా). పవర్ ఫుల్ పోలీస్ రఘు నాయక్ ను గల్లీ రౌడీ వాసు ఎలా ఎదుర్కొన్నాడు? ఎలాంటి తిప్పలు పడ్డాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: సందీప్ కిషన్ ఎక్స్ ప్రెషన్స్ లో అర్జెంట్ గా చాలా మార్పులు రావాలి. నాని తరహాలోనే సందీప్ కూడా అన్నీ సినిమాల్లో ఒకే తరహా నటన, హావభావాలతో నెట్టుకొచ్చేస్తున్నాడు. సందీప్ లుక్ కాస్త డిఫరెంట్ గా ఉన్నా.. అతడు పాత్రను తెరపై ప్రెజంట్ చేసిన తీరులో ఏమాత్రం కొత్తదనం లేదు. అలాగే.. డైలాగ్ డెలివరీ కూడా రొటీన్ గా ఉంది. ఈ విషయాన్ని సందీప్ కాస్త సీరియస్ గా తీసుకోవాలి.
నేహా శెట్టి మేకప్ వల్ల అలా కనబడిందో లేక నిజంగానే అలా ఉంటుందో తెలియదు కానీ.. చాలా సన్నివేశాల్లో సందీప్ కిషన్ కంటే పెద్దమ్మాయిలా కనిపించింది. అలాగే.. నటన పరంగానూ చాలా డెవలప్ అవ్వాలి, చాలా సన్నివేశాల్లో బ్లాంక్ గా ఉండిపోయింది.
నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ బాబీ సింహాతో ఇలాంటి పాత్ర పోషింపజేయడం వరకు ఒకే. ఎందుకంటే.. ప్రతి నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. అయితే.. మరీ తలా తోకా లేని పాత్రలు చేయడం అనేది నటుడి కెరీర్ కు ప్రాబ్లమ్ అవుతుంది. ఈ విషయాన్ని బాబీ సింహా అయినా గ్రహించాలి.
రాజేంద్రప్రసాద్ & వెన్నెల కిషోర్ మాత్రం తాము తీసుకున్న రెమ్యునరేషన్ కి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. వాళ్ళు తెరపై కనిపించినప్పుడు మాత్రమే ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. అది కూడా వాళ్ళ స్క్రీన్ ప్రెజన్స్ వల్ల మాత్రమే. హర్ష, పోసాని, షకలక శంకర్ తదితరులు పర్వాలేదు అనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: రామ్ మిరియాల సంగీత దర్శకుడిగా పరిచయమైన సినిమా ఇది. తనదైన వెర్షన్ ట్యూన్స్ తో అలరించాడనే చెప్పాలి. అలాగే.. సాయికార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. చోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ ఇంకా చాలా క్రిస్పీగా ఉండొచ్చు. ప్రొడక్షన్ డిజైన్. ఆర్ట్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇక దర్శకులు జి.నాగేశ్వర రెడ్డి ఫిలిం మేకర్ గా తన ప్రతి చిత్రంతో ఓ రెండడుగులు వెనక్కి వేస్తున్నారే కానీ.. నవతరం సినిమా స్థాయిని అందుకొనే కనీస ప్రయత్నం చేయడం లేదు. ఇంకా డబుల్ మీనింగ్ డైలాగులు, కన్ఫ్యూజన్ కామెడీతో సినిమాని నడిపించేద్దామంటే ఎలా? ఆ ఆలోచనా ధోరణి ఆయన అర్జెంట్ గా మార్చుకోవాలి. సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది పక్కన పెడితే.. నవతరం ప్రేక్షకుల మైండ్ సెట్ ను అర్ధం చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అవుతున్నారని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమా రిజల్ట్ చూసైనా ఆయన అప్డేట్ అయితే బెటర్.
విశ్లేషణ: అటు ఎంటర్ టైన్ చేయలేక, ఇటు ఎంగేజ్ చేయలేక నానా ఇబ్బందులు పడే సినిమా “గల్లీ రౌడీ”. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కోసం మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. ఈ పాండెమిక్ టైంలో థియేటర్లకు జనాల్ని తీసుకురావాలన్నా, తీసుకొచ్చినవాళ్లను కూర్చోబెట్టాలన్నా సినిమాలో దమ్ము ఉండాలి. ఆ విషయం దర్శకనిర్మాతలు అర్ధం చేసుకోవాలి.
రేటింగ్: 2/5