ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) , అతడి భార్య సింగర్ సైంధవి విడిపోనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే సగటు పుకారు తరహాలోనే ఇవి కూడా నిజం కావు అనుకుంటూ ప్రేక్షకులు, అభిమానులు లైట్ తీసుకున్నారు. కానీ ఆ పుకార్లను నిజం చేస్తూ, ఇద్దరూ విడిపోయారనే విషయాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ సోమవారం రాత్రి స్పష్టం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
11 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు జీవీ ప్రకాష్ కుమార్ సోషల్ మీడియా పోస్టులో ప్రకటించాడు. సైంధవితో చర్చించి, పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపాడు. ఈ మేరకు జీవీతో పాటు, సైంధవి కూడా తమ బంధం విడిపోయిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు ద్వారా తెలిపారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు.
జీవీ ప్రకాష్, సైంధవి చిన్నతనం నుండి పరిచయస్థులే. కలిసే పెరిగారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకున్నారు కూడా. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు కూడా. కానీ ఇప్పుడు దూరం అవుతున్నట్లు చెప్పారు. రెండేళ్లు ఆలోచించి, చర్చించి మరీ 2013లో పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాశ్, సైంధవి ఇప్పుడు విడిపోయారు. ఇంత అవగాహనతో పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల క్రితం ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన తర్వాత ఇదేంటి అనేది ఆసక్తికరంగా మారింది.
మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అని జీవీ ప్రకాశ్, సైంధవి తమ పోస్టులో చెప్పారు.
జీవీ సినిమాల విషయానికొస్తే.. ‘యుగానికి ఒక్కడు’, ‘రాజా రాణి’, ‘అసురన్’, ‘సూరరై పోట్రు’ / ‘అకాశమే నీ హద్దు’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా2, ‘డార్లింగ్’ (Darling) , ‘ఎందుకంటే ప్రేమంట’ (Endukante… Premanta!) , ‘ఒంగోలు గిత్త’ (Ongole Githa) , ‘రాజాధిరాజా’ (Rajadhi Raja) , ‘జెండాపై కపిరాజు’ (Janda Pai Kapiraju) లాంటి సినిమాలకు సంగీతం అందించారు. హీరోగా మారి 15 చిత్రాలకు పైనే నటించాడు.