Tollywood: ఓటు ఎటు పడుతుందో… టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!

దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ మాటకొస్తే తెలంగాణలోనూ అవుతున్నాయి. అయితే ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల విషయంలో టాలీవుడ్‌ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్‌ చేస్తోంది. దీనికి చాలా పెద్ద కారణమే ఉంది. అక్కడ ఈ సారి ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు సీఎం అవుతారు అనే విషయం టాలీవుడ్‌కి చాలా అవసరం కాబట్టి. గతంలో పరిశ్రమ ఎదుర్కొన్న పరిస్థితులే దీనికి కారణం అని చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనూ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి ఏంటి తేడా అనుకుంటున్నారా? గతంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారినా.. పరిశ్రమను ప్రభుత్వం చూసే విధానం దాదాపు ఒకేలా ఉండేది. అయితే గత ఐదేళ్లలో పరిశ్రమ, పరిశ్రమ పెద్దలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో అందరూ చూశారు. చిరంజీవి (Chiranjeevi) లాంటి అగ్ర హీరో అక్కడకు వెళ్లి చేతులు జోడించి మరీ రిక్వెస్ట్‌ చేయాల్సి వచ్చింది.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలోని టికెట్‌ రేట్ల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని చాలా రోజుల పాటు విన్నపాలు చేసీ చేసీ ఇక తేలేలా లేదు అని ఏకంగా అగ్ర హీరోలు, దర్శకులు హైదరాబాద్‌ నుండి విజయవాడ వెళ్లి రిక్వెస్ట్‌లు చేసి మరీ వచ్చారు. ఇక పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు వచ్చినన్ని సమస్యలు, కష్టాలు ఇంకెవరికీ రాలేదు. ప్రభుత్వ అధికారులను పెట్టి మరీ ఇక్కట్ల పాల్జేశారు. తర్వాత పరిస్థితి కాస్త సర్దుకున్నా ఇబ్బందులు అయితే పోలేదు.

ఈ నేపథ్యంలో ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారు అనే చర్చ టాలీవుడ్‌లో కూడా జరుగుతోందట. పరిశ్రమకు ఫ్రెండ్లీగా ఉండే ప్రభుత్వం అయితే బాగుంటుంది అంటూ చర్చించుకుంటున్నారట. దీనికి సమాధానం జూన్‌ 4న తెలుస్తుంది. అయితే ట్రెండ్‌ ఏంటి అనేది రేపు ఓటింగ్‌ బట్టి తెలిసిపోతుంది అని చెబుతున్నారు. చూద్దాం ఎవరు వచ్చినా టాలీవుడ్‌కు మంచి జరగాలి అదే సగటు ప్రేక్షకుడి కోరిక కూడా. ఇదంతా జరగాలంటే ప్రతి ఓటరు మే 13ని హాలీడే అనుకోకుండా ఓటింగ్‌ డే అనుకోవాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus