జిప్సి సినిమా రివ్యూ & రేటింగ్!

“రంగం”తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన జీవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “జిప్సి”. తమిళ చిత్రం “జోకర్”తో నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన ఈ చిత్రం పలు సెన్సార్, పోలిటికల్ ఇష్యూస్ కారణంగా థియేటర్లలో రిలీజ్ అవ్వలేక ఇవాళ ఆహా యాప్ లో విడుదలైంది. మరి ఈ కాంట్రవర్సియల్ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

కథ: మత కలహాల్లో తల్లిదండ్రులను కోల్పోయి ఓ బాటసారికి దొరికి అతడితో దేశాటన చేస్తూ పెరుగుతాడు జిప్సి (జీవా). జిప్సీకి మత, కుల, ప్రాంత, భాషా బేధాలు ఉండవు. ప్రపంచమే ఇల్లు, మానవత్వమే మతం, మనిషికి సహాయపడడమే కులంగా పెరుగుతాడు. అటువంటి జిప్సి వహీదా (నటాషా సింగ్) అనే ముస్లిం యువతితో ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబ పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనుకొని జిప్సితో వచ్చేస్తుంది. ఆమెతోనే తన దేశాటనను కొనసాగిస్తాడు జిప్సి. వహీదా గర్భవతి కావడంతో కొన్నాళ్లు వారణాసిలో ఉండి.. బిడ్డ పుట్టాక తన జర్నీ కంటిన్యూ చేయాలనుకొంటాడు.

అంతా బాగుందనుకున్న తరుణంలో రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన మత కలహాల్లో తన భార్యకు దూరమవుతాడు జిప్సి. మళ్ళీ తన భార్యకు, పుట్టిన బిడ్డకు జిప్సి దగ్గరయ్యాడా? అందుకోసం అతడు చేసిన ప్రయత్నాలేమిటి? అనేది “జిప్సి” కథాంశం.

నటీనటుల పనితీరు: ఇదివరకే “రంగం, రౌద్రం” వంటి చిత్రాలతో నటుడిగా తన స్టామినా చాటుకున్న జీవ ఈ చిత్రంలోనూ జిప్సి పాత్రలో తన నట ప్రతిభను కనబరిచాడు. జీవా క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటాయి. దర్శకుడి అతడి పాత్ర ద్వారా సమాజానికి ఇవ్వాలనుకున్న సందేశం కూడా బాగుంది కానీ.. క్లారిటీ లేకుండాపోయింది. నటాషా సింగ్ తన పాత్రకు న్యాయం చేసింది. అయితే.. ఆమె పాత్రకు ఒక ఆర్క్ లేకుండాపోయింది. ఆమె ఎందుకని జిప్సీకి అట్రాక్ట్ అయ్యింది? ఎందుకని అతడితో పారిపోవడానికి ఇష్టపడింది అనేందుకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. మిగతా క్యాస్ట్ అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎవరూ రాంగ్ క్యాస్టింగ్ అని అనిపించలేదు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సమాజంలోని పలు సమస్యలను, రాజకీయ నాయకులు మత విద్వేషాలను తమ స్వప్రయోజనాలకు ఎలా వినియోగించుకొంటారు వంటి విషయాలను చూపించిన విధానం బాగుంది కానీ.. మణిరత్నం “బొంబాయి” తరహాలో సమాజంలోని సమస్యలను ప్రేమ కథ ద్వారా ఎలివేట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆ కారణంగా సినిమా మొదట్లో పాత్రలకి కనెక్ట్ అయినట్లుగా చివరివరకూ ఉండలేం. “జోకర్” సినిమాతో రాజకీయంగా సంచలనమైన సన్నివేశాలు, విషయాలతో పెద్ద స్థాయి చర్చలకు తెరలేపిన రాజు మురుగన్ “జిప్సి”తోనూ అదే స్థాయిలో హల్ చల్ చేయడానికి ప్రయత్నించాడు.

నిజానికి ఈ చిత్రంలో యూపీ ముఖ్యమంత్రి యోగిని ధృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ కూడా క్రియేట్ చేశాడు కానీ.. సెన్సార్ ఇష్యూస్ కారణంగా ఆ సన్నివేశాలు మరియు పాత్రను ఎడిట్ చేయాల్సి వచ్చింది. అసలు యాంటీ బీజేపీ ఫిలింగా రూపొందినందునే ఈ చిత్రం ఏడాది కాలంగా విడుదలకు నోచుకోలేకపోయింది. రెండు రాష్ట్రాల మధ్య, రెండు మతాల మధ్య ఘర్షణలు, సమాజం ఒక సగటు మనిషిని కులం, మతం అనే పేరుతో ఎలా విడదీస్తోంది అనేది రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు. అయితే.. ముందు చెప్పినట్లుగా కథలో ఉన్న దమ్ము కథనంలో లోపించింది. సెకండాఫ్ కూడా సరిగా ప్లాన్ చేసుకొని ఉంటే మరో మంచి సినిమాగా మిగిలిపోయేదీ చిత్రం.

సంతోష్ నారాయణన్-సుశీల రామన్ ల సంగీతం అలరించలేకపోయింది. ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అనుకున్నప్పుడు సంగీతం, నేపధ్య సంగీతం చాలా కీలకమైనవి.. ఈ రెండు విషయాల్లో ది బెస్ట్ రాబట్టుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు. అలాగే.. కెమెరా వర్క్ కూడా అంత అట్రాక్టివ్ గా లేదు. కథగా చెప్పలేని చూపించలేని చాలా ఎమోషన్స్ ను కెమెరా యాంగిల్స్ లో ఎలివేట్ చేయొచ్చు. కానీ.. దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఎక్కడా ఆ ప్రయత్నం చేయలేదు.

విశ్లేషణ: ఒక మంచి నేపధ్యంతో మొదలై.. అనవసరమైన ప్రేమకథను సందర్భాలను ఇరికించిన కారణంగా బోరింగ్ గా ముగిసిన చిత్రం “జిప్సి”.

రేటింగ్: 1.5/5

Click Here To Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus