ఓ స్టార్ హీరో సినిమా వంద రోజులు ఆడటమే పెద్ద విషయం అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఈ సమయంలో ఓ చిన్న హీరో వంద రోజులు ఆడింది, ఆడినన్ని రోజులూ ఇంపాక్ట్ చూపించింది అంటే పెద్ద విషయమే కదా. అలాంటి ఇంపాక్ట్ చూపించిన చిత్రం ‘హను – మాన్’ (Hanu Man). ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్ సందర్భంగా చిత్రబృందం ఈవెంట్ నిర్వహించింది. ఈ క్రమంలో సినిమా రీరిలీజ్ గురించి నిర్మాత ఓ గుడ్‌న్యూస్ చెప్పారు.
‘హను – మాన్’ సినిమా చూసినప్పుడు ‘ఏవేవో సినిమాలు త్రీడీలో చేస్తున్నారు. ఈ సినిమాను ఎందుకు త్రీడీలో తీసుకురాలేదు’ అనే డౌట్ మీకు ఎప్పుడైనా కలిగిందా? ఒకవేళ మీకు ఆ డౌట్ వచ్చి ఉంటే.. మీ కోరిక నెరవేరబోతోంది. అవును ఈ సినిమాను సరికొత్త వెర్షన్‌లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ వేసవిలో త్రీడీలో సినిమాని విడుదల చేస్తున్నాం అని నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతో ఆ రోజు ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక ఇదే వేదిక మీద ప్రశాంత్ వర్మ (Prashanth Varma) మాట్లాడుతూ.. రాబోయే 20 ఏళ్లు ఈ కథలపైనే దృష్టిపెడుతున్నాం. రాబోయే సినిమాల్లోనూ విభీషణుడి పాత్రలో సముద్రఖని (Samuthirakani) , హను మాన్‌గా తేజ (Teja Sajja) కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. అయితే వీరితోపాటు ఆశ్చర్యకరమైన పాత్రలు మరికొన్ని వస్తాయి అని చెప్పారు. దీని కోసం హిందీ నుండి మలయాళం వరకూ చాలామంది కథానాయకులు వస్తారు అని చెప్పారు. దీంతో ఇన్నాళ్లు సినిమా గురించి వస్తున్న పుకార్లలో చాలావరకు నిజమే అని అర్థమవుతోంది.
‘జై హనుమాన్’లో రాముడిగా మహేష్‌బాబు (Mahesh Babu) , ఆంజనేయుడిగా చిరంజీవి (Chiranjeevi) కనిపిస్తారు అని గతంలో వార్తలొచ్చాయి. మరో పాత్ర కోసం రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కూడా వస్తాడు అని అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ పెద్ద నటులు వచ్చి తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో నటిస్తారు అని చెప్పారు. చూద్దాం సినిమా మొదలయ్యాక ఈ విషయంలో చాలా క్లారిటీలు వస్తాయి.