మరువలేని స్నేహ గీతాలు

నిన్ను నిన్నుగా ఇష్టపడే వాడు .. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను అర్ధం చేసుకునేవాడు.. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీతో ఉండేవాడు.. నువ్వు ఎదగాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే వాడు.. అతడే నిజమైన స్నేహితుడు. అలంటి ఎన్నో స్నేహితులను వెండి తెరపైన మన దర్శకులు చూపించారు. వాటిలో కొన్ని స్నేహాలు మనసులో స్థిరంగా నిలిచిపోయాయి. అలాంటి సినిమాలను మీరు మిస్సయి ఉంటే ఈ స్నేహితుల దినోత్సవం సందర్బంగా మిత్రునితో కలిసి చూసెయ్యండి.

ప్రేమ దేశం

సినిమా పేరులో ప్రేమ ఉన్నా.. చిత్రంలో మాత్రం ఫ్రెండ్ షిప్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాస్, వినీత్ ల స్నేహం ప్రేమ కన్నా గొప్పదిగా డైరక్టర్ ఖదీర్ చూపించారు. 1996 లో వచ్చిన ఈ మూవీ అప్పటి యువతని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో “ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా” అని ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ ఇప్పటికీ కాలేజీ ఫంక్షన్లలో వినిపిస్తుంటుంది.

పెళ్లి పందిరి

https://www.youtube.com/watch?v=VEbHDw2wn-s

జగపతి బాబు చిత్రాల్లో పేరు తెచ్చిన వాటిలో పెళ్లిపందిరి ఒకటి. ఇందులో పృధ్విరాజ్, జగ్గు ల స్నేహం సినిమాకే హైలెట్. ప్రాణ స్నేహితుల్లా నటించి మెప్పించారు. కోడి రామ కృష్ణ దర్వకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 1998 లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచిన “దోస్త్ మేరా దోస్త్ .. తు హే మేరీ జాన్.. వాస్తవం రా దోస్త్ నువ్వే నాప్రాణం” పాట మిత్రులందరిని కదిలించింది.

స్నేహం కోసం

మెగాస్టార్ చిరంజీవి వయసుపైబడిన వాడిగా మెప్పించిన సినిమా స్నేహం కోసం. ఇందులో యజమానికి పనివాడికి మధ్య స్నేహాన్ని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. “మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ.. రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ ” అనే పాటలో స్నేహ బంధాన్ని చక్కగా చూపించారు. 1999 లో వచ్చిన ఈ చిత్రంలోని నటనకు చిరు ఫిలిం ఫెర్ అవార్డు అందుకున్నారు.

ఇద్దరు మిత్రులు

చిరంజీవి 1999 లోనే స్నేహానికి సంబంధించిన మరో చిత్రంతో పలకరించారు. ఇందులో చిరు, సాక్షి శివానంద్ స్నేహం ఇద్దరుమిత్రులు టైటిల్ ని జస్టిఫై చేసింది. అడా, మగ మధ్య పవిత్రమైన స్నేహ బంధాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వెండి తెరపై చూపించిన తీరు అద్భుతం. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ” అనే పాటలో “అడగక ముందే అన్ని చేసి సేవకుడివి అనిపిస్తావో .. అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావో ” అనే సాహిత్యం వచ్చినప్పుడు కన్నులు చెమ్మగిల్లుతాయి.

నీ స్నేహం

https://www.youtube.com/watch?v=8mPmdoGBn38

ప్రేమ కథ చిత్రాలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ “నీ స్నేహం” సినిమాతో మంచి మిత్రుడు పేరుని సంపాదించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమా 2002 లో విడుదలై మిత్రులందరికీ బెస్ట్ ఫ్రెండ్ అయింది. “కొంత కాలం కిందట.. బ్రహ్మ దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నాయి ఓ వరం” అనే సాంగ్ యువతలో బాగా పాపులర్ అయింది.

ఓ మై ఫ్రెండ్

సిద్దార్ధ్, శృతి హాసన్ ప్రాణ స్నేహితులుగా నటించిన చిత్రం ఓ మై ఫ్రెండ్. ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా ఎక్కువకాలం ఉండలేరు.. ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుందని, నిజమైన స్నేహం వాటన్నింటిని దాటుకొని నిలబడుతుందని దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమా ద్వారా చెప్పారు. ఇందులో “నేను తానని అనుకుంటారా.. నేనే తానని అనుకోరా ” అనే పాట ఆడ, మెగా స్నేహాన్ని అనుమానించే వారికి మంచి పాఠం గా ఉంటుంది. 2011 లో వచ్చిన సినిమా విజయ తీరాన్ని చేరుకోలేక పోయినా స్నేహానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది.

స్నేహితుడు

https://www.youtube.com/watch?v=2SNNvs2n-3Y

మంచి స్నేహితుడుంటే మన లైఫ్ ఎంత బాగుపడుతుందో “స్నేహితుడు” చిత్రంలో దర్శకుడు శంకర్ చాటిచెప్పారు. హిందీ చిత్రం త్రీ ఇడియట్స్ కి రీమేక్ అయి ఈ మూవీ స్నేహానికి మంచి నిర్వచనము ఇచ్చింది. మిత్రుడంటే పార్టీలకు పనికొచ్చేవాడు మాత్రమే కాదు, మనలోని భయాల్ని పోగొట్టి.. పక్కన దైర్యంగా నిలబడేవాడే ఫ్రెండంటే అని ఈ ఫిలిం సూచిసుంది. ఇందులోని “మన ఫ్రెండేళ్లే ఇంకా ఎవడుంటాడు.. జనమందరిలో తను ఒకడేమి కాడు” అనే సాంగ్ మంచి మిత్రులను మనకి గుర్తు చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus