Harikatha Review in Telugu: హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీరామ్ (Hero)
  • దివి (Heroine)
  • రాజేంద్రప్రసాద్,అర్జున్ అంబటి, పూజిత పొన్నాడ తదితరులు.. (Cast)
  • మ్యాగీ (Director)
  • టి.జి.విశ్వప్రసాద్ (Producer)
  • సురేష్ బొబ్బిలి (Music)
  • విజయ్ ఉలగనాథ్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 13, 2024

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ “హరికథ” (Harikatha). శ్రీరామ్, దివి కీలకపాత్రలు పోషించిన ఈ సిరీస్ కి మ్యాగీ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. 6 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎలా ఉంది? వీకెండ్ కి బింజ్ వాచ్ చేయొచ్చా? అనేది చూద్దాం..!!

Harikatha Review in Telugu

కథ: విజయనగరం జిల్లాల చుట్టుపక్కల తన నాటక మండలి సభ్యులతో కలిసి చిన్నపాటి నాటకాలు వేస్తూ గౌరవంగా బ్రతుకుతుంటాడు రంగాచారి (రాజేంద్రప్రసాద్). అయితే.. రంగాచారి & కో విష్ణు అవతారాల గురించి నాటకం వేయడం మొదలుపెట్టినప్పటినుండి.. ఊర్లో ఒక్కొక్కరు దారుణంగా చంపబడుతుంటారు. ఆఖరికి ఈ కేసులను డీల్ చేస్తున్న ఎస్సై కూడా. ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాటి వెనుక కారణం ఏమిటి? అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు విరాట్ (శ్రీరామ్). అరకులో జరుగుతున్న ఈ హత్యలకు కారణం ఏమిటి? వాటిని విరాట్ ఎలా ఛేదించాడు? ఈ హత్యలతో రంగాచారికి సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “హరికథ” వెబ్ సిరీస్.

నటీనటుల పనితీరు: రాజేంద్రప్రసాద్ లాంటి అద్భుతమైన నటుడి పూర్తిస్థాయి పొటెన్షియల్ ను మన దర్శకులు సరిగా వినియోగించుకోలేదనే విషయాన్ని ఆయన అప్పుడప్పుడు ఇలాంటి వెబ్ సిరీస్ ల ద్వారా వెల్లడిస్తుంటాడు. ఈ సిరీస్ లో ఆయన పోషించే దశావతారాలు, సదరు పాత్రల్లో ఆయన నటన, హావభావాలు ఆయన ఎంతటి అద్భుతమైన నటుడు అనే విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. శ్రీరామ్ కూడా సిన్సియర్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అతడి పాత్ర తీరుతెన్నులను డీల్ చేసిన విధానం బాగున్నా.. ఓవరాల్ గా మాత్రం సరైన క్యారెక్టరైజేషన్ ను బిల్డ్ చేయలేదు.

దివికి మంచి పాత్ర లభించింది. ఆమె అడవి పడుచుగా పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది. పూజిత పొన్నాడ కాస్త గ్లామర్ యాడ్ చేయడానికి ప్రయత్నించింది కానీ.. ఎందుకో సెట్ అవ్వలేదు. ఇక మిగతా పాత్రధారులు కథాగమనానికి తమ వంతు సాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సిరీస్ మొత్తానికి చెప్పుకోదగ్గ ఏకైక అంశం. మంచి ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల ఎమోషన్ బాగా ఎలివేట్ అయ్యింది. అలాగే ఈ సిరీస్ విషయంలో మెచ్చుకోవాల్సిన ఇంకో వ్యక్తి మేకప్ మ్యాన్. సురభి నాటక మండలికి చెందిన ఆయన ఈ సిరీస్ లో దేవుడు గెటప్స్ కి చేసిన మేకప్ చాలా సహజంగా ఉంది.

సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నప్పటికీ.. సరైన డి.ఐ & వి.ఎఫ్.ఎక్స్ లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఎలివేట్ అవ్వలేకపోయింది. చాలా సన్నివేశాల్లో సీజీ వర్క్ మరీ పేలవంగా ఉంది. ముఖ్యంగా ఎస్సై మరణించే సన్నివేశంలో సీజీ వర్క్ చూసి జనాలు నవ్వుకునే స్థాయిలో ఉంది. ఈమధ్యకాలంలో సీరియల్స్ కి కూడా బెటర్ సీజీ వర్క్ చేస్తున్నారు. అలాంటిది ఓ పెద్ద సంస్థ నుండి వచ్చిన వెబ్ సిరీస్ విషయంలో ఇంత కేర్ లెస్ గా ఉండడం అనేది మాత్రం శోచనీయం.

దర్శకుడు మ్యాగీ 80ల నాటి కథను పీరియాడిక్ డ్రామాగా 2024 ప్రేక్షకులకు చూపించాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. కథనం విషయంలో కనీస స్థాయి పట్టు లేకుండా 6 ఎపిసోడ్లను సాగదీసుకుంటూ వెళ్లడం వల్ల మొదటి రెండు ఎపిసోడ్స్ తో క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ మొత్తం 6వ ఎపిసోడ్ కి వచ్చేసరికి నీరుగారిపోయింది. సో, దర్శకుడిగా, కథకుడిగా మ్యాగీ మెప్పించలేకపోయాడు.

విశ్లేషణ: ఒక థ్రిల్లర్ ను నడిపించే విధానంలో బేసిక్ రూల్ ఏంటంటే.. కిల్లర్ ఎవరు అనేది చివరివరకు చూపించకుండా ఉండడం. ఆ బేసిక్ రూల్ ని పట్టించుకోకుండా తీసిన సిరీస్ “హరికథ” (Harikatha). రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి వంటి ఆర్టిస్టులు తమ వందశాతం ఇచ్చినా.. సరైన కథనం లోపించడం, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సిరీస్ బోర్ కొట్టించింది.

ఫోకస్ పాయింట్: పస లేని నాటకం!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus