తమిళంలో “కాదల్ కసకుతయా” అనే పేరుతో రూపొంది 2017లో విడుదలైన చిత్రాన్ని “హార్ట్ బీట్” పేరుతో తెలుగులోకి అనువదించారు. ధృవ, వెంబ జంటగా నటించిన ఈ చిత్రానికి ద్వారక్ రాజా దర్శకుడు. పాతికేళ్ళ కుర్రాడిని ఓ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ప్రేమిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది సినిమా కాన్సెప్ట్. వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్న ఈ కాన్సెప్ట్ సినిమాగా ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!
కథ : దియా (వెంబ) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువే అమ్మాయి. తల్లిదండ్రులు కావాల్సినంత ఫ్రీడం ఇవ్వడం, మంచి ఆలోచనా విధానం ఉండడంతో దియా ఇండిపెండెంట్ గా పెరుగుతుంది. చదువులో అంతంతమాత్రమే అయినా అమ్మాయి మాత్రం బంగారం. అయితే.. తన బెస్ట్ ఫ్రెండ్ తోపాటు తన క్లాస్ మేట్స్ అందరికీ బోయ్ ఫ్రెండ్ ఉండడం చూసి తనకు కూడా ఒక బోయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనే ఆలోచన ఆమెలో మొదలవుతుంది. ఆ సమయంలో ఆమెకు కనబడతాడు అర్జున్ (ధృవ), మంచి ఉద్యోగంతోపాటు తల్లిపట్ల అపారమైన ప్రేమ కలిగిన అర్జున్ తనకు పర్ఫెక్ట్ జోడీ అని భావించి అతడికి ప్రపోజ్ చేస్తుంది దియా.
మొదట్లో మరీ ఇంత చిన్నపిల్లని ప్రేమించడమేంటి అని ఆలోచించినా.. దియా చూపే స్వచ్చమైన ప్రేమకు దాసోహమైపోతాడు అర్జున్. ఆ తర్వాత వారి జీవితం ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది? చివరికి ఇద్దరూ కలిశారా లేక వయోబేధం కారణంగా విడిపోయారా? అనేది “హార్ట్ బీట్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : దియా పాత్రలో నటించిన వెంబ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ మరియు మెయిన్ హైలైట్. చిన్న పిల్లగా కనిపిస్తూనే.. పెద్దతరహాగా వ్యవహరించే వెంబ నటన చూసి ముచ్చటపడనివారుండరు. తాను ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవాలనే తపన ఆమె కళ్ళలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె చూపిన పరిణితికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అర్జున్ పాత్రలో ధృవ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్స్, అమ్మాయిని ప్రేమించాలా లేదా అని కన్ఫ్యూజ్ అయ్యే సన్నివేశాల్లో అతడి నటన సందర్భానుసారంగా ఉండడంతోపాటు సన్నివేశానికి కావాల్సిన ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.
దివంగత నటీమణి కల్పన కనిపించేది కేవలం రెండు సన్నివేశాల్లోనే అయినప్పటికీ.. నటనతో కన్నీళ్లు పెట్టించింది. మనకి చాలా తమిళ చిత్రాల్లో కమెడియన్ గా కనిపించిన చార్లీ ఈ చిత్రంలో కూతురు పట్ల అమితమైన ప్రేమ కలిగిన సగటు తండ్రిగా అద్భుతమైన నటనతో అలరించాడు. పోలీస్ స్టేషన్ సీన్ మరియు ఆటో డ్రైవర్ తో తన బాధను పంచుకొనే సన్నివేశాల్లో చార్లీ నటనకి కళ్లే కాదు మనసు కూడా చెమర్చుతుంది. ధృవ ఫ్రెండ్స్ గా నటించిన పాత్రధారుల కామెడీ టైమింగ్ బాగుంది. అలాగే ఆటో డ్రైవర్ రోల్ కూడా ఎమోషనల్ గానే కాక ఎంటర్ టైనింగ్ గానూ ఉంది.
సాంకేతికవర్గం పనితీరు : ధరణ్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశంలోని ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ అర్ధవంతంగా ఉండడం గమనార్హం. తెలుగు వెర్షన్ సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. ఒక భారీ బడ్జెట్ సినిమాకి డబ్బింగ్ విషయంలో తీసుకొనే జాగ్రత్తలను “హార్ట్ బీట్” సినిమా విషయంలోనూ తీసుకోవడం ప్రశంసనీయం. డబ్బింగ్ వాయిస్ ల విషయంలోనూ జాగ్రత్త వహించిన తెలుగు వెర్షన్ ప్రొడ్యూసర్ ను మెచ్చుకోవాలి. ఎడిటింగ్, డి.ఐ, సౌండ్ డిజైనింగ్ వంటి సాంకేతికపరమైన అంశాలన్నీ బాగున్నాయి.
దర్శకుడు ఎంచుకొన్న కథ మనకు “సుందరకాండ” చిత్రాన్ని గుర్తుకుతెస్తుంది. కాకపోతే డీలింగ్ మాత్రం ప్రెజంట్ జనరేషన్ కి తగ్గట్లుగా ట్రెండీగా ఉండడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే.. సినిమాలో లవ్ తోపాటు సెంటిమెంట్ ను కూడా సమానమైన రీతిలో పండించాడు దర్శకుడు ద్వారక్ రాజా. యవ్వన ప్రారంభంలో ఉన్న ఒక అమ్మాయి మానసిక స్థితిని జడ్జ్ చేసిన విధానం, మదర్, ఫాదర్ సెంటిమెంట్ ను కథలోకి జొప్పించినట్లుగా కాక సమాంతరంగా నడిపించిన విధానం, నటీనటుల నుంచి సన్నివేశానికి తగ్గ నటన రాబట్టుకొన్న తీరు అభినందనీయం.
కేవలం సరైన పబ్లిసిటీ లేని కారణంగా “హార్ట్ బీట్” సినిమా ఎక్కువమంది జనాలకి చేరువవ్వలేకపోవచ్చు కానీ.. సినిమా చూసినవారికి మాత్రం “ఒక మంచి సినిమా చూశాం” అనే భావన కలిగిస్తుంది. ఎలాంటి అసభ్యత లేకుండా, ఆరోగ్యకరమైన హాస్యం, సహజమైన కథ-కథనం, ఆహ్లాదభరితమైన సంగీతం కలగలిసి “హార్ట్ బీట్” సినిమాని అందరు చూడదగ్గ చిత్రంగా నిలిపాయి.
విశ్లేషణ : టైటిల్ చూసి ఇది కేవలం యువతరం మాత్రమే చూడదగ్గ చిత్రమని అనుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వయోబేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ చిత్రం “హార్ట్ బీట్”. సరిగ్గా పబ్లిసిటీ చేస్తే “ప్రేమిస్తే” స్థాయి హిట్ అయ్యే సినిమా ఇది.
రేటింగ్ : 2.5/5