Tollywood: బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు.. బొక్కబోర్లా పడుతున్నారు.. ఎందుకిలా?

‘మనం హిట్‌ కొట్టినం’.. ఓ సినిమా విడుదలైన వెంటనే హీరో ఫ్రెండ్‌ (అప్పుడు) చేసిన ట్వీట్‌. ‘ఇండస్ట్రీ హిట్‌’.. ఓ సినిమా విడుదలైన వెంటనే ఓ సినిమా టీమ్‌ నుండి వచ్చిన పోస్టర్‌. ‘ఈ సినిమా విషయంలో టాలీవుడ్‌ ఫెయిల్‌ అయింది’.. ఇది రీసెంట్‌గా జరుగుతున్న సోషల్‌ మీడియా ట్రెండ్‌. ‘ఇంతకుమించిన సినిమా లేదు’.. ఓ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే టీమ్‌ చేసిన ప్రచారం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొదటి రెండు సినిమాలు ఇబ్బందికర ఫలితం అందుకున్నాయి. మూడో సినిమా ఇంకా ఎటూ తేలడం లేదు. నాలుగో సినిమా రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ కౌంట్‌ ఆశించింది కాదు.

Tollywood

పైన లిస్ట్‌లో చెప్పిన సినిమాల పేర్లు మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఆ సినిమాలు వచ్చిన సమయంలో ఈ డైలాగ్‌లు బాగా ఫేమస్‌ అయ్యాయి కూడా. ఇక అసలు విషయానికొస్తే.. సినిమాలకు తొలి రోజు టాక్‌ బాగా వస్తోంది. రివ్యూలు కూడా బాగానే వస్తున్నాయి. హీరోలు, వాళ్ల ఫ్యాన్స్‌, సన్నిహితులు సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. దీంతో సినిమా బాగుందేమో అని ప్రేక్షకులు టికెట్లు కొని వీకెండ్‌ వరకు సినిమాను లాగించేస్తున్నారు. అయితే నాలుగో రోజు, కొత్త వీక్‌లో సినిమా వీక్‌ అయిపోతోంది.

సినిమాలో సత్తా లేకపోయినా ఇలా తొలి రోజు టాక్‌ బాగా వచ్చేలా చేసుకొని పెనం వేడిగా ఉన్నప్పుడే దోసెలు వేసేలా వసూళ్లు సాధిస్తున్నారు. అందుకే తొలి వారంతంలో వచ్చిన వసూళ్లే ఆ తర్వాతా కొనసాగడం లేదు. సినిమాలో సత్తా లేకుండా ఎక్కువ ఎత్తుకి ఎత్తేస్తే అమాంతం కింద పడిపోతుంది. అలా పడితే ఫలితం తారుమారై తలబొప్పి కడుతుంది. అంతో కొంత సత్తా ఉంటే రూ.వందల కోట్లు వస్తున్నాయి. అయితే తొలి రోజు వచ్చిన టాక్‌కి ఆ తర్వాత వచ్చిన రికార్డు వసూళ్లకు సంబంధం ఉండటం లేదు.

టాలీవుడ్‌లో ఈ ఇబ్బందికర పరిస్థితి తరచుగా కనిపిస్తోంది. సినిమా విజయం సాధించాలి అంటే మౌత్‌ టాక్‌ ముఖ్యం అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు సోషల్‌ మీడియా టాక్‌ ముఖ్యం అనుకునే పరిస్థితి వచ్చింది. అందుకే సినిమా ఎలా ఉంది అంటే ఎక్స్‌ ఓపెన్‌ చేసి హ్యాష్‌ట్యాగ్‌తో చూసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదే టాలీవుడ్‌ని ఇబ్బంది పెడుతోంది అంటే నిజమే అని చెప్పాలి. ఈ విషయం మేలుకోకపోతే సినిమా పరిశ్రమకే ప్రమాదం. ఫైనల్‌గా ఓ మాట.. టాక్‌ అనేది రావాలి కానీ తెప్పించకూడదు.

ఇలా హైప్‌ టాక్‌ సంపాదించుకుని థియేటర్ల నుండి సినిమాలు ఓటీటీకి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడి సినిమాలోని డొల్లతనం బయటకు వస్తోంది. ఈ మధ్య కాలంలో థియేటర్‌లో హిట్‌.. ఓటీటీలో ఫట్‌ అనే సినిమాలు మీరు చాలానే చూసి ఉంటారు కూడా.

అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus