రెండు సినిమాలతో తెరమీదికి రానున్న కుమారి

‘అలా ఎలా’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించినా ‘కుమారి’ గానే అందరికీ చేరువయ్యింది హేబ పటేల్. సుకుమార్ సృష్టించిన ఆ పాత్రలో ఒదిగి నటిగా మంచి మార్కులు వేయించుకున్న ఈ ముంబయి భామ మూడో సినిమాగా ‘ఈడోరకం ఆడోరకం’ చేసి తొలి పరాజయాన్ని చవి చూసింది. అయితే అది ఈ అమ్మడి అవకాశాలకు అడ్డుకట్ట కాలేదు. తర్వాత మూడు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కుమారి త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల కనువిందు చేయనుంది.’సినిమా చూపిస్తా మావా’తో గతేడాది సూపర్ డూపర్ హిట్ అందుకున్న బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ‘నేను నా బాయ్ ఫ్రెండ్స్’ అనే సినిమా రూపొందుతోంది.

వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో చేసిన భాస్కర్ ఈ సినిమాతో మెగాఫోన్ పడుతున్నారు. హేబ పటేల్, పార్వతీశం (కేరింత ఫేమ్), నోయల్ (కుమారి 21f ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దీంతోపాటు నిఖిల్ హీరోగా టైగర్ ఫేమ్ వి.ఐ.ఆనంద్ తెరకెక్కిస్తోన్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లోనూ హేబ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా నిర్మాణాంతర పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ రెండు సినిమాలతో ఈ ఏడాదిలోనే తెరపైకి రానుంది హేబ. దీంతోపాటు వరుణ్ సరసన నటిస్తోన్న మిస్టర్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus