రామ్-అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”. ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. “అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ.. అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు” అనే డైలాగ్ తోనే సినిమా కాన్సెప్ట్ ఏమిటో స్పష్టమవుతోంది. “సినిమా చూపిస్త మావ, నేను లోకల్” చిత్రాలకు రచయితగా వ్యవహరించిన ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కూడా డైలాగ్ రైటర్ గా వర్క్ చేయడం వల్ల ట్రైలర్ మొత్తం పంచ్, ప్రాసలతో నిండిపోయింది.
యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకొనే విధంగా ఉన్న ట్రైలర్ మొత్తానికి దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తప్ప పెద్దగా మైనస్ లేమీ కనిపించలేదు. రామ్ తనకున్న బిరుదుకు తగ్గట్లుగా ఎనర్జిటిక్ గా కనిపిస్తుండగా.. అనుపమ క్యూట్ గా కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ పాత్ర మాత్రం “లవ్లీ” సినిమాలో రాజేంద్రప్రసాద్ రోల్ ను తలపిస్తోంది. రామ్ కు ఫ్రెండ్ గా వ్యవహరిస్తూనే తన కూతురు జీవితం కోసం కష్టపడే తండ్రిగా కనిపిస్తున్నాడు.
అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ సమపాళ్లలో కలిగిన “హలో గురు ప్రేమ కోసమే” అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వరుస పరాజయాలతో బాధపడుతున్న రామ్ & అనుపమ పరమేశ్వరన్ లకు “హలో గురు ప్రేమ కోసమే” హిట్ అవ్వడం చాలా కీలకంగా మారింది. మరి ఈ సినిమా వాళ్ళు అనుకున్న ఫలితాన్నిస్తుందో లేదో ఇంకో పదిరోజుల్లో తెలిసిపోతుంది.