హలో

పరిచయ చిత్రంతో కోలుకోలేని పరాజయం దక్కించుకొన్నప్పటికీ.. తండ్రి నాగార్జున ప్రోత్సాహంతో అఖిల్ నటించిన రెండో చిత్రం “హలో”. స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించగా.. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి కథానాయికగా పరిచయమైంది. టీజర్, ట్రైలర్ తో అమితంగా ఆకట్టుకొన్న “హలో” సినిమాగా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : శీను అలియాస్ అవినాష్ (అఖిల్) ఓ అనాధ, హైద్రాబాద్ లోని ఒక పబ్లిక్ పార్క్ లో చెట్టు నీడన బ్రతుకుతూ.. సిగ్నల్ దగ్గర వయోలిని ప్లే చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అలాంటి ఓ అనాధకు పరిచయమవుతుంది జున్ను అలియాస్ ప్రియ (కళ్యాణి). ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎనలేని అభిమానం. అయితే.. జున్ను/ప్రియ ఫాదర్ కి డిల్లీ ట్రాన్స్ ఫర్ అవ్వడంతో.. శీను-జున్ను దూరమవుతారు. యితే.. ఆఖరి నిమిషంలో తన ఫోన్ నెంబర్ ను ఒక వంద రూపాయల నోట్ పై రాసి శీనుకి అందేలా రోడ్డుపై పడేస్తుంది. అయితే.. శీను ఆ నోట్ పై నెంబర్ గమనించేలోపే అతడి స్నేహితుడు ఆ నోట్ కొట్టేయడం, దాన్ని దక్కించుకొనే ప్రయత్నంలో సరోజినీ (రమ్యకృష్ణ) కారు కింద పడతాడు శీను. పిల్లాడి పద్ధతి నచ్చిన ప్రకాష్ (జగపతిబాబు) అతడ్ని దత్తత తీసుకొని సొంత కొడుక్కంటే ఎక్కువగా చూసుకొంటాడు. కానీ.. చిన్నప్పుడు దూరమైన జున్ను కోసం రోజూ తనకు ఆఖరిసారి కనపడిన సిగ్నల్ దగ్గర ఎదురుచూస్తూనే ఉంటాడు. సరిగ్గా జున్ను దొరికింది అనుకొంటుండగా శీను ఫోన్ ఒక గ్యాంగ్ కొట్టేస్తారు. తన ఫోన్ తిరిగి సంపాదించుకొని, తన జున్నుని కలవాలని ఎలాంటి సాహసాలు చేశాడు, చివరికి తన చిన్ననాటి ప్రేయసిని కలిశాడా, లేదా? అనేది “హలో” కథాంశం.

నటీనటుల పనితీరు : అఖిల్ అద్భుతమైన డ్యాన్సర్, ఫైట్స్ బాగా చేస్తాడు అనే విషయం పరిచయ చిత్రంతోనే అందరికీ అర్ధమైంది. “హలో”లో కూడా అదే తరహాలో బాబ్ బ్రౌన్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లలో ఎక్కడా అతి కనిపించకుండా చాలా నేచురల్ గా సదరు ఫైట్స్, జంప్స్, చేజ్ లు ఎఫర్ట్ లెస్ గా చేసేస్తాడు అఖిల్. అయితే.. ఎమోషన్స్ పండించడంలో మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. “హలో”తో హీరోగా సక్సెస్ రుచి చూసిన అఖిల్.. తదుపరి చిత్రంలో నటుడిగా విజయం అందుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కళ్యాణి ప్రియదర్శిని కొత్తమ్మాయిలా ఎక్కడా కనిపించలేదు. హావభావాల ప్రదర్శన, డైలాగ్స్ కి లిప్ సింక్ వంటి అన్నీ విషయాల్లోనూ పరిణితి ప్రదర్శించింది. ఆమె కాస్ట్యూమ్స్, మేకప్ అత్యంత సహజంగా ఉండడం ప్రత్యేక ఆకర్షణ. యువత హృదయాల్ని ఆకట్టుకొంటుందో లేదో తెలియదు కానీ.. ప్రేక్షకుల్ని మాత్రం తన నటన సామర్ధ్యం, అందమైన ముఖారవిందంతో కట్టిపడేసింది.

రమ్యకృష్ణను “బాహుబలి”లో ఆల్రెడీ తల్లిపాత్రలో చూసేసినప్పటికీ.. “హలో” సినిమాలో ఆమె చూపే తల్లి ప్రేమకు అందరూ కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా అఖిల్ ఆమెను తొలిసారి “అమ్మా” అని పిలిచినప్పుడు అమ్మదనం పరిమళించిన క్షణాన్ని కేవలం కళ్ళతో పలికించి నటిగా తన సత్తాను మరోమారు వెండితెరపై చాటుకొంది. అదే విధంగా.. నిన్నటివరకూ విలన్ రోల్స్ లో జగపతిబాబును చూసి బోర్ ఫీలైన వారికి ఈ సినిమాలో తండ్రి పాత్రతో అలరించాడు. సెంటిమెంట్ సీన్స్ లో జగపతిబాబును చూస్తే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇక విక్రమ్ కుమార్ ఫేవరెట్ యాక్టర్ అజయ్ ది సినిమాలో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొన్నాడు. ఇక చిన్నప్పటి అఖిల్ పాత్రలో కనిపించిన మైఖేల్, హీరోయిన్ చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి అత్యద్భుతమైన నట ప్రదర్శనతో అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు : అనూప్ రూబెన్స్ పాటలు సోసోగా ఉన్నాయి. టైటిల్ ట్రాక్ మినహా మరో పాట గుర్తుంచుకొనే స్థాయిలో లేదు. అయితే.. నేపధ్య సంగీతంతో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. కానీ.. యాక్షన్ సీక్వెన్స్ లకు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ “హలో” చిత్రానికి ప్రాణం. యాక్షన్ సీక్వెన్స్ లను సహజంగా తెరకెక్కించిన తీరు, వైబ్రేంట్ కలర్స్ అండ్ బ్యాగ్రౌండ్ తో ప్రతి సన్నివేశం ఆడియన్స్ కళ్ళకు కాక మనసుకి నచ్చేలా తెరకెక్కించిన విధానం అన్నీ బాగున్నాయి. హీరోహీరోయిన్స్ హావభావాలతో ప్రేక్షకులకి అర్ధమయ్యేలా చెప్పాల్సిన సన్నివేశాలను కేవలం తన ఫ్రేమింగ్స్ తో తెలియజెప్పిన విధానం అభినందనీయం. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ సినిమాకి మరో ఎస్సెట్. స్క్రీన్ ప్లే లో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. స్లయిడ్ కట్స్ తో అందరికీ అర్ధమయ్యేలా సినిమాని ఎడిట్ చేశాడు.

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తూనే ఉంటాయి. “నా కొడుకు కాబట్టే ఎక్కువ ఖర్చు పెట్టాను” అని నాగార్జున అన్న మాట మనకి సినిమాలో కనిపిస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ మాటల మాంత్రికుడైతే.. విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే మాంత్రికుడు. “మనం, 24” లాంటి చాలా టిపికల్ స్టోరీస్ ని కూడా పామరుడికి సైతం అర్ధమయ్యేలా సింపుల్ గా తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయిపోయారు. “హలో” సినిమా విషయంలో కూడా విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు. చాలా సింపుల్ లవ్ స్టోరీని, తనదైన స్క్రీన్ ప్లేతో అన్నీ వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ చిత్రంగా మలిచాడు. అయితే.. ఒక ఫోన్ కోసం మరీ అంత రచ్చ చేయడం దేనికి అనిపిస్తుంది. కానీ.. హీరో ఎమోషన్ కి లాజిక్స్ ఉండవు గనుక ప్రేక్షకుడు ఎలాగూ అప్పటికే హీరో పాత్రతో ట్రావెల్ అవుతుంటాడు కాబట్టి ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోడు. పైగా.. ఒక మంచి సినిమా చూశామన్నా తృప్తితో థియేటర్ నుండి బయలుదేరతాడు.

విశ్లేషణ : అఖిల్ చేసే ఆశ్చర్యగొలిపే యాక్షన్ సీక్వెన్స్ లు, విక్రమ్ కుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే, పి.ఎస్.వినోద్ అత్యద్భుతమైన సినిమాటోగ్రఫీ, కళ్యాణి ప్రియదర్శిని అందమైన అభినయం, రమ్యకృష్ణ-జగపతిబాబులు తల్లిదండ్రులు పండించే డీసెంట్ సెంటిమెంట్ సీన్స్… ఇలా ఓ సగటు ప్రేక్షకుడు చూసి సంతోషిందగ్గ అంశాలన్నీ పుష్కలంగా ఉన్న “హలో” ఈవారం విన్నర్ గా నిలవడంతోపాటు.. అఖిల్ ని హీరోగానూ నిలబెట్టింది.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus