RRR, Baahubali: ‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!

‘బాహుబలి’… ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ సంచలనమైన విజయాన్ని నమోదు చేసింది. ఓ తెలుగు సినిమా అన్ని రికార్డులు కొడుతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ‘మన రాజమౌళి మనకే గొప్ప.. మిగతావాళ్ళకి కనీసం ఆయన పేరు కూడా ఎక్కువ తెలిసుండదు’ అని అంతా అనుకున్నారు ఆ టైంలో..! కానీ అందరి విమర్శలను తలక్రిందులు చేస్తూ.. ఆ చిత్రం చరిత్రకెక్కింది. తెలుగు సినిమాల పై ఇప్పుడు దేశం ఫోకస్ పెట్టింది అంటే అది బాహుబలి చలువే. ‘బాహుబలి 1’ కలెక్ట్ చేసిన మొత్తానికి… ‘బాహుబలి2’ హక్కులని అమ్మారు. ‘బాహుబలి2’ కలెక్ట్ చేసిన దానికి ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ హక్కులను అమ్మారు. ‘ఆర్.ఆర్.ఆర్’ బిగ్గెర్ దేన్ ‘బాహుబలి’ అని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. అయినా బయ్యర్లు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు?

ఎందుకంటే ‘బాహుబలి’ తో పోలిస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ కు చాలా మైనస్ లు ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలి అంటే ‘బాహుబలి’ కి ఆ టైములో ఉన్న అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవు. అవి ఎలా అంటే :

1) బాహుబలి1 లేదా బాహుబలి2 .. ఏది తీసుకున్నా రిలీజ్ డేట్ విషయంలో ఎక్కువ మార్పులు చోటు చేసుకోలేదు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ విషయానికి వస్తే కరోనా వల్ల చాలా సార్లు పోస్ట్ పోన్ చేశారు. కరోనా కంటే ముందు కూడా రిలీజ్ డేట్లలో మార్పు చోటు చేసుకుంది. దీని వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ మేకింగ్ బడ్జెట్ చాలా పెరిగిపోయింది. ఇంట్రెస్ట్ ల రూపంలో నిర్మాత దానయ్య చాలా డబ్బు చెల్లించారు.

2) బాహుబలి టైంలో ఓటిటి ల హడావిడి లేదు. కాబట్టి ఆ సినిమాకి వృద్ధ వయసులో ఉన్న వారు కూడా థియేటర్ కు కదిలి వచ్చారు. కానీ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ టైంకి.. చాలా ఓటిటిలు అందుబాటులో ఉన్నాయి. 50 రోజుల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసే అవకాశం ఉందని చాలా మందికి తెలుసు. కాబట్టి వాళ్ళు చరణ్- ఎన్టీఆర్ లను బట్టే థియేటర్లకు రావాలి తప్ప లేదంటే రావడం కష్టమే.

3) బాహుబలి సినిమాలో అనుష్క, తమన్నా గ్లామర్, కమర్షియల్ అంశాలు చాల ఉన్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ కు నాటు నాటు తప్ప పెద్దగా ఊపు ఇచ్చిన పాటలు లేవు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా ఉన్నట్టు కూడా జనాలు గుర్తుంచుకోవడం లేదు. వాళ్ళ గ్లామర్ కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యే అవకాశం లేదు.

4) బాహుబలి కి వచ్చేసరికి రానా దగ్గుబాటి విలన్ గా నటించాడు. అతను అప్పటికే దేశమంతా పాపులర్ అయ్యాడు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ విలన్ హాలీవుడ్ వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలీదు. అతను ఆకర్షించే నటన కనపరుస్తాడు అనే నమ్మకం కూడా జనాలకి కలగలేదు.

5) బాహుబలి అనేది ఇందాక చెప్పుకున్నట్టు ఓ కమర్షియల్ ప్యాకేజి.అందుకే రిపీట్ ఆడియెన్స్ వల్ల ఆ మూవీ వసూళ్ళు భారీగా పెరిగాయి. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది దేశభక్తి కథాంశంతో కూడుకున్న మూవీ.! ఇలాంటి సినిమాలకి రిపీట్ ఆడియెన్స్ రాకపోవచ్చు.

6) బాహుబలి టైములో బుక్ మై షో వంటి వాటిలో టికెట్లు కొంతవరకు అయినా అందుబాటులో ఉన్నాయి. పైగా దానికి ఉన్న టికెట్ రేట్లు కూడా అందరికీ అనుకూలంగానే ఉన్నాయి. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ కి వచ్చేసరికి భారీగా టికెట్ రేట్లను పెంచేశారు. పైగా వీటిని బ్లాక్ చేసి మరీ వేలకు వేలు పెట్టి అమ్ముతున్నారు అనేది బహిరంగ రహస్యమే..!

7) బాహుబలి2 రిలీజ్ టైంకి పరీక్షలు చాలా వరకు అయిపోయాయి. బాహుబలి1 కి ఆ హడావిడే లేదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఆ మూవీకి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడు ఇంకా 10 వ తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తికాలేదు. సో ఈ మూవీకి అదో మైనస్.

8) బాహుబలికి హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. 2 వారాల వరకు టికెట్ రేట్లు హైక్ కొనసాగించింది. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు హిట్ టాక్ వస్తే తప్ప ఆ పరిస్థితి కనిపించడం లేదు.

9) బాహుబలి1 హిట్ అవ్వడంతో బాహుబలి2 కి నార్త్ లో విపరీతమైన హైప్ నెలకొంది. కాబట్టి… అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరిగాయి. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆశించిన స్థాయిలో అక్కడ బుకింగ్స్ జరగడం లేదు.

10) బాహుబలి అనేది పూర్తిగా ఫిక్షన్. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు వంటి స్వాతంత్ర సమరయోధుల జీవితాలకి ఫిక్షన్ ను జోడించి తీసిన మూవీ. కాబట్టి ఈ సినిమా విడుదల తర్వాత వివాదాలు వంటివి తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. అల్లూరి- కొమరం భీమ్ లు కొట్టుకుంటున్నట్టు ఓ సన్నివేశం ఉందట. అలాంటి వాటి పై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus