కథానాయకుడి స్థాయిని పెంచే బలమైన ప్రతినాయకుడు

  • October 16, 2018 / 10:26 AM IST

మనం చిన్నప్పటి నుంచి చదివిన కథల్లో, నవలల్లో చూసిన సినిమాల్లో హీరో ఎంత పెద్ద కష్టాన్ని ఎదిరించి నిలబడితే అతడి హీరోయిజం అంత అద్భుతంగా పండుతుంది. తర్వాతికాలంలో సమస్యలు కాస్తా ప్రతినాయకులుగా రూపాంతరం చెందాయి. “పాతాళభైరవి” చిత్రంలో తోటరాముడు ఎన్టీఆర్ ఎంతమందికి గుర్తున్నాడో.. మాంత్రికుడు పాత్ర పోషించిన ఎస్వీ రంగరావు కూడా అంతేమంది జనాలకి గుర్తున్నాడు. సొ, అప్పట్లో ఎంత పెద్ద సమస్య దాటితే అంత పెద్ద హీరో అనుకొనే జనాలు.. ఇప్పుడు ఎంత పెద్ద లేదా భయంకరమైన విలన్ ను చంపితేనో లేక ఢీకొంటేనో ఆ హీరో అంత పవర్ ఫుల్ అనుకోవడం మొదలెట్టారు.

అందుకు నిదర్శనమే.. “సమరసింహారెడ్డి”లో వీర రాఘవరెడ్డిగా జయప్రకాష్ రెడ్డి తారా స్థాయిలో రౌద్రాన్ని, మొండితనాన్ని పండించాడు కాబట్టే.. సమరసింహా రెడ్డి హీరోయిజం ఎలివేట్ అయ్యింది.

ఆ తర్వాత “ఆది” సినిమాలో నాగిరెడ్డిగా రజన్ పి.దేవ్ పతాకస్థాయిలో ప్రదర్శించిన క్రూరత్వం వల్లే ఆదికేశవరెడ్డి హీరోయిజానికి జనాలు చప్పట్లు కొట్టారు.

ఇప్పుడు ‘అరవింద సమేత” చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన వీర రాఘవరెడ్డి పాత్రకు జనాలు కరతాళ ధ్వనులతో హృదయాలకి హత్తుకొన్నారు. అందుకు కారణం ముమ్మాటికీ ఎన్టీఆర్ నట విశ్వరూపమే. అయితే.. హైద్రాబాదీ బిర్యానీ ఎంత బాగున్నా.. అందులో మసాలా లేకపోతే బాగుంటుందా చెప్పండి. అలాగే.. “అరవింద సమేత” చిత్రాన్ని జగపతిబాబు పోషించిన “బసిరెడ్డి” పాత్ర లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే.

“సమరసింహారెడ్డి”లోని వీరరాఘవరెడ్డి క్రూరత్వాన్ని, “ఆది”లో నాగిరెడ్డి మూర్ఖత్వాన్ని కలగలిసిన పాత్ర “బసిరెడ్డి”. ఆ పాత్రకు జగపతిబాబు కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు పొరపాటున ఏమైనా ఆలోచింది ఉండొచ్చేమో కానీ.. సినిమా చూసిన ప్రేక్షకుడికి మాత్రం జగ్గూ భాయ్ తప్ప ఎవరూ ఈ పాత్రను ఆ స్థాయిలో పండించరు అని క్లారిటీ ఉంటుంది.

“లెజండ్” సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబు ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
అప్పటివరకూ తెలుగు సినిమాలకు విలన్లు కావాలంటే హిందీ, తమిళం, మలయాళం, గుజరాతీ.. ఆఖరికి భోజ్ పూరీ ఇండస్ట్రీలవైపు చూసేవారు మన దర్శకనిర్మాతలు. కానీ.. “లెజండ్” సినిమాలో సాల్ట్ & పెప్పర్ లుక్ తో జగపతిబాబు ఒక్కసారి విలన్ గా విశ్వరూపం ప్రదర్శించాక సదరు దర్స్కనిర్మాతలందరూ కూకట్ పల్లిలో జగ్గూ భాయ్ అపార్ట్ మెంట్ ముందు క్యూ కట్టారు. వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిళో అద్భుతంగా వినియోగించుకొన్నారు జగపతిబాబు.

తెలుగులో మాత్రమే కాక తమిళ, మాయలాయంలోనూ విలన్ గా రాణించాడు జగ్గూ భాయ్. ఎంత పెద్ద నటుడైనా చేసినా పాత్రనే మరోసారి చేస్తే జనాలకి చూడాలన్న ఆసక్తి పోతుంది. కానీ.. జగపతిబాబు మాత్రం వరుసబెట్టి విలన్ రోల్సే చేస్తున్నప్పటికీ.. ప్రతి సినిమాలోనూ నటుడిగా ఇంకో మెట్టు ఎక్కుతూనే.. మరింత క్రూరంగా కనిపిస్తూ “విలన్ అంటే ఇలా ఉండాలి” అనిపించుకొంటున్నాడు.

“నాన్నకు ప్రేమతో”లో పోషించిన కృష్ణమూర్తి కౌటిల్య పాత్ర కావొచ్చు.. రంగస్థలంలో ఆయన పోషించిన ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి పాత్ర కానివ్వండి, “గూఢచారి” చిత్రంలోనీ రాణా క్యారెక్టర్ కానివ్వండి.. నటుడిగా జగపతిబాబు తనదైన మార్క్ ను మాత్రం మిస్ అవ్వనివ్వడం లేదు. అలాగని కేవలం విలన్ పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వడం లేదు.

“హలో, రారండోయ్ వేడుక చూద్దాం, పటేల్ సార్” లాంటి సినిమాలతో తనలోని మరో యాంగిల్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే.. ఏంటీ ఈయన ఆ సినిమాలో విపరీతమైన విలనిజం పోషించిన జగపతిబాబేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు జగ్గూభాయ్.

అయితే.. ఇప్పటివరకు పోషించిన పాత్రలనీ ఒక లెక్క.. “అరవింద సమేత” చిత్రంలో పోషించిన బసిరెడ్డి క్యారెక్టర్ మాత్రం ఒక లెక్క. విలన్ అంటే వీడే, ఇలాగే ఉంటాడు అని ప్రేక్షకుల్లో మెదళ్ళలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయేలా బసిరెడ్డిగా జీవించాడు జగ్గూభాయ్. ఎన్టీఆర్ తన గొంతులో అరకత్తి దింపే సన్నివేశంలో మొండితనంతో కూడిన నిస్సహాయాతను ఎంత విశేషంగా అయితే ప్రదర్శిస్తాడో.. “మొండి కత్తి” కథ చదివిన వెంటనే కోపం, కసి, పగతో రగిలిపోయే మొండోడిగానూ అద్భుతంగా హావభావాలు ప్రకటిస్తాడు. ఆ సన్నివేశంలో జగపతిబాబు నోటి నుండి పడే తుప్పరను ప్రేక్షకులు గమనించారంటే అతడి పాత్రను వాళ్ళందరూ తదేకంగా చూసేలా జగపతిబాబు ఏ రేంజ్ మ్యాజిక్ చేశాడు అనేది ఊహించవచ్చు.

ఇక ప్రీక్లైమాక్స్ & క్లైమాక్స్ లో జగపతిబాబు నటవిశ్వరూపాన్ని చూసి ప్రేక్షకులు “ఈ బసిరెడ్డిగాడు పోతే కానీ సీమ బాగుపడదు” అని థియేటర్ లో గట్టిగా అరవడం అనేది ఒక నటుడిగా బసిరెడ్డి పాత్రపై జగపతిబాబు వేసిన మార్క్.

ఆయన ఇంకా మరెన్నో అద్భుతమైన విలన్ పాత్రలు పోషించవచ్చు కానీ.. “బసిరెడ్డి” అనే పాత్ర మాత్రం ఆయన సినిమా డైరీలో మాత్రమే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ చాలా ప్రయ్టేకమైనది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus