బాలీవుడ్లో ఈ మధ్య వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. స్టార్ హీరోయిన్లు ఒకరు తర్వాత ఒకరు వివాహ బంధంతో ఒకటైపోతున్నారు. అయితే వాళ్లు చేసుకుంటున్నది హీరోలనే అనుకోండి. అయితే ఇప్పడు హిందీ నాట స్టార్ హీరో పెళ్లి కాబోతోంది. అందులోనూ కొత్త హీరో కాదు. అందరికీ బాగా తెలిసిన స్టార్ హీరోనే. ఎవరబ్బా బాగా తెలిసి ఇంకా పెళ్లి కాని హీరో అనుకుంటున్నారా? పెళ్లి కాని హీరో కాదు.. పెళ్లయిన హీరోనే. అంటే ఇప్పుడు జరగబోయేది రెండో పెళ్లి అన్నమాట.
ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చేసుంటంఉది. ఒకవేళ లేదంటే పేరు చెప్పేస్తున్నాం. అతనే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. అలియా భట్, అతియా శెట్టి, కియరా అద్వానీ, స్వర భాస్కర్.. ఇలా వరుసగా బాలీవుడ్ నాయికలు పెళ్లి చేసుకున్నారు. త్వరలో హృతిక్ కూడా చేసుకుంటాడట. తన స్నేహితురాలు నటి కమ్ గాయని అయిన సబా ఆజాద్‌తో హృతిక్ పెళ్లి జరగబోతోందట. కొన్నేళ్లుగా సబా ఆజాద్‌తో డేటింగ్లో ఉన్నాడు హృతిక్ రోషన్.
కొన్నాళ్లు గుంభనంగా సాగిన వీరి వ్యవహారం తర్వాత పబ్లిక్ అయింది. ప్రస్తుతం హృతిక్ ఎక్కడుంటే సబా అక్కడ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని హృతిక్ – సబా నిర్ణయించుకున్నారట. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి సమ్మతి కూడా తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హృతిక్ అవి పూర్తి చేసి పెళ్లి చేసుకుంటాడట. ఎందుకంటే పెళ్లి తర్వాత సినిమాలకు కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నాడట.
హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటున్నారు బాలీవుడ్ జనాలు. మొదటి భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చినప్పుడు కూడా సుమారు రెండు నెలల పాటు ఇలాగే లీకులిచ్చాడు హృతిక్. ఆ తర్వాత విడాకుల తంతు పూర్తి చేశాడు. ఇప్పుడు రెండో పెళ్లి విషయంలోనూ అంతే అంటున్నారు. అయితే ఈ విషయంలో హృతిక్ మాజీ ప్రేయసి అయిన కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.