అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల అయ్యాయి. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
యువ హీరో నిఖిల్ మాట్లాడుతూ ”ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. జూలై 1న తెలుగు ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. శ్రీరామ్, శివ బాలాజీ, అంజి గారు, నిర్మాతలు రామారావు, రవితేజ మన్యం, రవి, అజయ్ మైసూర్… అందరికీ ఆల్ ది బెస్ట్. అవికా గోర్ బెంగళూరులో ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయింది. ఫంక్షన్ మిస్ అవుతున్నట్టు చెప్పమంది” అని అన్నారు.
సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకులు, నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ”టెన్త్ క్లాస్ డైరీస్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా బావుంది” అని అన్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకులు కె.కె. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ”అంజి గారు సినిమాటోగ్రాఫర్‌గా 50 సినిమాలు చేశారు. ఆయన కెమెరా ద్వారా ఎంతో మంది దర్శకుల కథలు చెప్పారు. ఇప్పుడు ఆయన కథ చెబుతున్నారు. ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్‌కు వెళ్ళడానికి భయం ఉంటుంది. దాన్ని దాటుకుని అంజి గారు డైరెక్షన్ చేశారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. శ్రీరామ్‌తో ‘ఒకరికి ఒకరు’ సినిమాకు కొన్ని రోజులు పని చేశా. అప్పుడు ఎలా ఉన్నారో… ఇప్పుడూ అలాగే ఉన్నారు. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ చూశాక… ప్రేక్షకులకు వాళ్ళ మెమరీస్ గుర్తు వస్తాయని ఆశిస్తున్నా. ట్రైలర్ చూశాక నిర్మాతలు డబ్బులకు వెనుకాడకుండా తీసినట్టు అనిపించింది. వాళ్ళు పెట్టిన డబ్బులకు వడ్డీతో రావాలని కోరుకుంటున్నాను. జూలై 1న థియేటర్లలో సినిమా చూడండి” అని అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ ”ఈ సినిమాకు నిర్మాతను నేను ఒక్కడినే కాదు. నాతో పాటు రవితేజ మన్యం గారు, రవి కొల్లిపర గారు, అజయ్ మైసూర్ గారు ప్రొడ్యూస్ చేశారు. బడ్జెట్ పెరిగినప్పుడు వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. అంజి గారిలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి. అందుకని ఈ కథతో ఆయన దగ్గరకు వెళ్లాం. ట్రైలర్‌లో ఎంత ఎమోషన్ ఉందో… సినిమాలో అంతే కామెడీ ఉంటుంది” అని అన్నారు.
సీనియర్ దర్శకులు బి. గోపాల్ మాట్లాడుతూ ”నేను కెమెరా డిపార్ట్‌మెంట్ నుంచి దర్శకత్వం వైపు వచ్చాను. సహాయ దర్శకుడు కావాలని వెళ్లి… మొదట కెమెరాతో వర్క్ స్టార్ట్ చేశా. మిచెల్ కెమెరాకు అప్రెంటిస్ చేశా. శివాజీ గణేశన్, జయలలిత గారు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాకు రిపోర్ట్ చేశా. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. ఆయనకు ఆల్ ది బెస్ట్. ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలి. శ్రీరామ్, శివ బాలాజీ మంచి నటులు. సినిమా బాగా ఆడి నిర్మాతకు డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
చిత్ర దర్శకులు, ఛాయాగ్రాహకులు అంజి మాట్లాడుతూ ”నిర్మాత రామారావు గారు ఈ సినిమా కథ తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు… ‘రెండు రోజులు టైమ్ ఇవ్వండి. చిన్న చిన్న మార్పులు చేసుకుని మీ దగ్గరకు వస్తా’ అని చెప్పాను. మార్పులు చేసుకుని వెళ్ళాక ముందు అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ అయ్యింది. ఎక్కడా వెనుకాడకుండా చేద్దామన్నారు. మాకు సపోర్ట్ చేసిన రవితేజ మన్యం, రవి, అజయ్ మైసూర్ గార్లకు థాంక్స్. టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు” అని అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన రవితేజ మన్యం మాట్లాడుతూ ”నిర్మాతగా నాకు ఇది తొలి సినిమా. రామారావు గారు చెప్పినప్పుడు… ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులందరూ సినిమాలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్ అవుతారు. టెన్త్ క్లాస్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు” అని అన్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ”నా జీవితంలో ‘ఒకరికి ఒకరు’ చాలా ఇంపార్టెంట్ మూమెంట్. నాకు యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులు బెడ్ మీద ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అడ్వాన్సులు తీసుకుని వెనక్కి వెళుతున్నారు. నేను హాస్పిటల్‌లో ఉన్నాను. అప్పుడు రసూల్ ఎల్లోర్ వచ్చారు. ‘నేను సినిమా తీస్తే నీతోనే తీస్తా. లేదంటే లేదు’ అని చెప్పి, చాలా రోజులు వెయిట్ చేసి ‘ఒకరికి ఒకరు’ తీశారు. తమిళంలో సినిమాటోగ్రాఫర్ కెవి ఆనంద్ దర్శకుడిగా పరిచయమైన సినిమాలో నటించా. ఆ తర్వాత ఇంకో సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారి తీసిన ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో నటించాను. హ్యాపీగా ఉంది. అంజి గారిలో నేను ప్రోపర్ దర్శకుడిని చూశా. చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ విజువల్స్ మీద దృష్టి పెడతారు. స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓ నిర్మాత చక్కగా కథ చెప్పడం నేను ఇంతకు ముందు చూడలేదు. మా నిర్మాత రామారావు గారు ఈ సినిమా కథ రాశారు. నాకు ఆయనే చక్కగా నేరేట్ చేశారు. నిర్మాణంలో రాజీ పడలేదు. బడ్జెట్ ఎక్కువైనా ఖర్చు పెట్టారు. ఇటువంటి నిర్మాత దొరకడం గాడ్ గిఫ్ట్. చాలా మంది ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే… ’96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ ఫీల్ ఉన్నట్టు ఉందని చెబుతున్నారు. అవి మంచి సినిమాలు. వాటితో మమ్మల్ని పోల్చడం సంతోషంగా ఉంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మూమెంట్స్‌ను గుర్తు చేస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి. నేను ‘స్వామి రా రా’ రైట్స్ తీసుకున్నా. ఈ రోజు ఇక్కడికి నిఖిల్ రావడం సంతోషంగా ఉంది. ‘ఒకరికి ఒకరు’ తర్వాత మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఫీల్ గుడ్ మూవీతో వస్తున్నా. ఇది నాకు పునర్జన్మ అనుకోవచ్చు” అని అన్నారు.
హీరో శివ బాలాజీ మాట్లాడుతూ ”ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ అనేది మంచి మెమరీ. కొంత మందికి నాటీ మెమరీస్ కూడా ఉంటాయి. నా టెన్త్ క్లాస్ బ్యాచ్‌లో ఇప్పటికీ కొంత మంది అలాగే ఉన్నారు. ప్రతి గ్యాంగ్‌లో ఒకరు దెబ్బలు తినడానికి ఉంటారు. వాడిని మనం కొడతాం. ఇప్పటికీ ఒకరు అలా ఉన్నారు. టెన్త్ క్లాస్‌మేట్స్‌ను ఎప్పుడు కలిసినా ఒకటే టాపిక్ మాట్లాడుతుంటాం. బోర్ కొట్టదు. వండర్‌ఫుల్ మెమరీ. అంజి, రామారావు గారు అటువంటి కథను సెలెక్ట్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి రాక ముందే రామారావు గారు నాకు తెలుసు. ఆయన మా పొరుగింట్లో ఉండేవారు. అప్పుడు ఆయన ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే, సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు కలిసినా సినిమాల గురించి మాట్లాడేవారు. సుమారు 20 ఏళ్లుగా అంజి తెలుసు. క్వాలిటీగా తీశారు. నా ఫ్రెండ్‌కి శ్రీరామ్ సీనియర్. ఆయన ఫస్ట్ మూవీ టైమ్‌లో వాళ్ళ కాలేజీకి వెళ్లాను. తర్వాత చెన్నైలో కలిశాను. మళ్ళీ కలిసి ఈ సినిమా చేశాం. మేమిద్దరం కలిసి ‘రెక్కీ’ వెబ్ సిరీస్ చేశాం. అది మంచి హిట్. అలాగే, ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇందులో నేను, నా వైఫ్ మధు కలిసి నటించాం” అని అన్నారు.
హాస్య నటులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ”అంజి గారితో ‘ముగ్గురు మొనగాళ్లు’ చేశా. అంతకు ముందు శివాజీ గారు హీరోగా నటించిన చాలా సినిమాలు చేశాం. ‘ముగ్గురు మొనగాళ్లు’కు సినిమాటోగ్రఫీ చేశారు. వెంటనే ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో డైరెక్టర్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు. క్లైమాక్స్‌లో శ్రీరామ్ గారు అద్భుతంగా నటించారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఒకవైపు నిర్మాణం చూసుకుంటూ మరోవైపు నటిస్తూ… రామారావు రెండు పనులు చేశారు. ఆయన గ్రేట్” అని అన్నారు.
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ”ఈ సినిమాకు పాటలు అందించా. అంజి గారు మంచి టెక్నీషియన్. ఆయనకు అర్థం చేసుకునే గుణం ఉంది. ‘విరాట పర్వం’ సినిమాకు పని ఉండి అటు వెళ్తానంటే నాకు స్పేస్ ఇచ్చారు. రామారావు గారు నాకు బ్రదర్ లాంటివారు. ఆయన ప్రతి సినిమాకూ నన్ను తీసుకుంటున్నారు. ఆయనకు కూడా అర్థం చేసుకుని పంపించారు. వాళ్ళిద్దరికీ థాంక్యూ. నేపథ్య సంగీతం అందించిన చిన్నా గారు ఎంతో హెల్ప్ చేశారు. ఈ సినిమాలో కాసర్ల శ్యామ్ అద్భుతమైన పాటలు రాశారు. అలాగే, చైతన్య ప్రసాద్ గారు, సురేష్ ఉపాధ్యాయ. వీళ్ళ లిరిక్స్ వల్ల పాటకు వేల్యూ పెరిగింది” అని అన్నారు.
ఇంకా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఎంపీ లింగయ్య యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సినిమాటోగ్రాఫర్లు సి. రామ్ ప్రసాద్, పీజీ విందా, గేయ రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ శ్రీరామచంద్ర, ‘టెన్త్ క్లాస్ డైరీస్’కు నేపథ్య సంగీతం అందించిన చిన్నా, సౌండ్ డిజైనర్ చేసిన గీతా తదితరులు పాల్గొన్నారు.