ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరో అవుతారని ప్రేక్షకులు భావించారు. అయితే కథ, దర్శకుల ఎంపికలో లోపాల వల్ల కుమారి 21ఎఫ్ తరువాత రాజ్ తరుణ్ కు ఆ స్థాయి సక్సెస్ దక్కడం లేదు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన పవర్ ప్లే సినిమా మార్చి నెలలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
అయితే రాజ్ తరుణ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు డిమాండ్ ఉండటంతో హీరోగా రాజ్ తరుణ్ కు ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ హీరో వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఇప్పటికే అతని పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని చెప్పుకొచ్చారు. అయితే రాజ్ తరుణ్ సన్నిహితులు మాత్రం త్వరలోనే రాజ్ తరుణ్ పెళ్లి జరగనుందని చెబుతుండటం గమనార్హం. పెళ్లి తర్వాత తన కుటుంబంతో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో స్థిరపడాలని రాజ్ తరుణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయినే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.