తన తల్లిని కోల్పోయిన డిప్రెషన్ నుండి ఇంకా యాక్టర్ రాజశేఖర్ బయటపడలేదో ఏమో కానీ.. 2017లో ఆయనకు జరిగిన భారీ యాక్సిడెంట్ ను ఇంకా మరువకముందే.. ఇప్పుడు మరో యాక్సిడెంట్ చేశారు. రెండు యాక్సిడెంట్స్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జరిగినవే కావడం గమనార్హం. ఇవాళ ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కార్ మూడు పల్టీలు కొట్టి రోడ్డు అవతల పడింది. అయితే. రాజశేఖర్ వాడేది బెంజ్ కారు (BENZ ML 350) కావడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి.. ప్రాణహాని జరగకుండా కాపాడాయి.
ఈ సమయంలో రాజశేఖర్ తోపాటు మరో వ్యక్తి కూడా కారులో ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో తప్పించుకొన్నారు. విజయవాడ నుండి హైద్రాబాద్ కి తిరిగి వస్తున్న తరుణంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకొంది. యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఇంకా తెలిసిరాలేదు.
ఈ సందర్భంగా తాను బాగానే ఉన్నానని మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ లో రాజశేఖర్ మాట్లాడుతూ.. “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని అన్నారు. ఇకపోతే.. రాజశేఖర్ కారు మీద ఇప్పటికే మూడు ఓవర్ స్పీడింగ్ చలాన్స్ ఉండడం గమనార్హం.