హీరోగా రాజశేఖర్ ఒకప్పుడు అనుభవించిన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ స్థాయి సక్సెస్ రేట్ ను రుచి చూసిన రాజశేఖర్ అనంతరం సరైన స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకోక దెబ్బతిన్నారు. మరీ ముఖ్యంగా నవతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో దారుణంగా విఫలమయ్యారు. అందుకే రాజశేఖర్ ప్రెజంట్ జనరేషన్ కి ఒక సగటు హీరోగా మాత్రమే తెలుసు తప్ప ఆయన గత విజయాల గురించి, ఆయన నట ప్రతిభ గురించి పెద్దగా అవగాహన లేదు.
అందుకు ముఖ్య కారణం ఇన్నేళ్లు తెలుగు సినిమాల్లో వర్క్ చేస్తున్నప్పటికీ తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకొనే స్థాయి తెలుగు వాచకాన్ని ఆయన నేర్చుకోకపోవడమే. అందుకే చాలామందిని ఆయన ఒక కామెడీ పీస్ అయిపోయాడు. కాస్త బాధపడాల్సిన విషయం అయినప్పటికీ.. ఆయనలోని పెద్ద లోపమది. అయితే.. మొన్నామధ్య “గరుడవేగ”తో మంచి హిట్ అందుకున్నా అది దర్శకుడి ఖాతాలోకే వెళ్ళిపోయింది కానీ.. రాజశేఖర్ ఎకౌంట్ లో జమవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన కల్కి కూడా నామమాత్రపు సినిమాగా మిగిలిపోయింది.
ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొన్న రాజశేఖర్ ప్రస్తుతం “పలాస” ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశారు. దాంతోపాటు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నీలకంఠ దర్శకుడిగా అద్భుతమైన దర్శకుడే అయినప్పటికీ.. ఆయన కూడా ఒక కమర్షియల్ హిట్ కొట్టి దాదాపు పదేళ్ల పైనే అవుతోంది. ఇలాంటి తరుణంలో రాజశేఖర్ ఆయన సినిమా సైన్ చేసి రిస్క్ చేసాడేమో అనిపిస్తుంది.