Hi Nanna Review in Telugu: హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నాని (Hero)
  • మృణాల్ ఠాకూర్ (Heroine)
  • కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరాం (Cast)
  • శౌర్యువ్ (Director)
  • మోహన్ చెరుకూరి - విజయేందర్ రెడ్డి - తీగల మూర్తి (Producer)
  • హేషమ్ అబ్ధుల్ వహాబ్ (Music)
  • సాను వర్ఘీసీ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 07, 2023

“దసరా” లాంటి మాస్ మసాలా సినిమా తర్వాత నాని నటించిన సూపర్ క్లాస్ ఎమోషనల్ లవ్ స్టోరీ “హాయ్ నాన్న”. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలైన ప్రమోషనల్ మెటీరీయల్ సినిమా మీద అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. మరి సినిమా వారి నమ్మకానికి తగ్గట్లుగా ఉందో లేదో చూద్దాం..!!

కథ: విరాజ్ (నాని) ఒక సక్సెస్ ఫుల్ ఫోటోగ్రాగర్. ముంబైలో ఒక స్టూడియో రన్ చేస్తూ తన ఒక్కగానొక్క కూతురు మహి (కియారా ఖన్నా) మరియు తండ్రి లాంటి వ్యక్తి (జయరాం)తో కలిసి చాలా సంతోషంగా బ్రతికేస్తుంటాడు. చాలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది యశ్న (మృణాల్ ఠాకూర్).

విరాజ్ తన కూతురుతో నిర్మించుకున్న కలల ప్రపంచంలోకి వచ్చిన యశ్న ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చివరికి ఏం జరిగింది? అనేది “హాయ్ నాన్న” కథాంశం.

నటీనటుల పనితీరు: నానికి ఈ తరహా పాత్రలు, ఎమోషన్స్ కొత్త కాదు. “జెర్సీ”లో ఇంతకుమించిన బరువైన తండ్రి పాత్ర పోషించాడు. కాకపోతే.. ఈ చిత్రంలో ఒక తండ్రిగా కంటే రెండు ప్రపంచాల మధ్య నలిగిపోయే ఒక వ్యక్తిగా నాని నటన విశేషంగా అలరిస్తుంది. ముఖ్యంగా మృణాల్ కాంబినేషన్ లో సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాల్లో అతడి నటనకు మంచి అప్లాజ్ వస్తుంది. ఇక కియారా ఖన్న కాంబినేషన్ సీన్స్ లో నాని కళ్ళల్లో ఆప్యాయతకు కనెక్ట్ అవ్వని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

మృణాల్ మరోమారు తన అందం-అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటనకు ఆడియన్స్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. కాకపోతే.. ఆమెకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి సన్నివేశానికి సంబంధం లేకుండా ప్రతి డైలాగ్ లౌడ్ గా చెప్పడం వల్ల కొన్ని చోట్ల ఎమోషన్ మిస్ అయ్యింది.

బేబీ కియారా ఖన్నా తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఆమె నాని ఒడిలో ఒదిగిపోయే సన్నివేశాల్లో ప్రతి తండ్రి తనను తాను చూసుకుంటాడు.

ప్రియదర్శి తన రెగ్యులర్ ఫ్రెండ్ రోల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. మలయాళ నటుడు జయరాం స్క్రీన్ ప్రెజన్స్ & క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు: సాను వర్ఘీసీ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ఎస్సెట్. సినిమాకు భారీతనంతోపాటు.. సరైన ఎమోషన్ ను యాడ్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్టిస్టుల అందాన్ని మాత్రమే కాక వారిలోని నటుల్ని ఒక సరికొత్త యాంగిల్ లో పరిచయం చేశాడు. సినిమాలోని ఎమోషన్ కు తగ్గ లైటింగ్ తో మూడ్ కి తగ్గట్లు ఆడియన్స్ మైండ్ ట్యూన్ చేసి.. దర్శకుడు ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కథలోకి ఇన్వాల్వ్ చేయగలిగాడు సాను వర్ఘీసీ.

హేషమ్ అబ్ధుల్ వహాబ్ సంగీతం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. సినిమాలో బిట్ సాంగ్స్ ఓ కలిపి పది పైనే ఉంటాయేమో. కానీ.. ఒక్కటంటే ఒక్క పాట కూడా బోర్ కొట్టలేదు. పాటలు & నేపధ్య సంగీతం ద్వారా సినిమాను అతడు ఎమోషనల్ గా ఎలివేట్ చేసిన తీరు బాగుంది.

దర్శకుడు శౌర్యువ్ కి ఇది దర్శకుడిగా మొదటి సినిమా అంటే నమ్మడం కాస్త కష్టమే. అతడు డ్రామాను రన్ చేసిన విధానం తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. ఫస్టాఫ్ మొత్తం తండ్రీకూతుళ్ల ఎమోషన్ & లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే చక్కబెట్టిన శౌర్యువ్.. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం అతడికి మంచి భవిష్యత్ ఉందని చెప్పకనే చెబుతాయి. క్లైమాక్స్ లో సినిమాటిక్ లిబర్టీస్ కాస్త ఎక్కువ తీసుకున్నప్పటికీ.. దర్శకుడిగా మాత్రం తన మార్క్ ను బలంగా ముద్రించాడు. కథకుడిగా మాత్రం కాస్త జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ: “జెర్సీ” తర్వాత నాని అందించిన మరో ఎమోషనల్ ఎంటర్ టైనర్ “హాయ్ నాన్న”. నాని, మృణాల్, కియారా ఖన్నాల అద్భుతమైన కెమిస్ట్రీ, హేషమ్ పాటలు, సాను వర్ఘీసీ ఫ్రేమ్స్, శౌర్యువ్ అత్యద్భుతంగా పండించిన డ్రామా కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus