విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “హైవే”. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆహా యాప్ లో నేటి నుండి స్ట్రీమ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఓ ఈవెంట్ ఫోటోగ్రాఫర్. తన స్నేహితుడు (సత్య)తో కలిసి బెంగళూరులో ఒక ఈవెంట్ కవర్ చేయడానికి బయలుదేరతాడు. సొంత ఊరు నుండి తప్పించుకొని వెళ్తున్న అమాయకురాలు తులసి (మానస రాధాకృష్ణన్) దారిలో పరిచయమవుతుంది.
అదే సమయంలో హైద్రాబాద్ లో అయిదుగురు అమ్మాయిలను అత్యంత దారుణంగా హత్య చేసిన ఓ సైకో కిల్లర్ అదే హైవే మీదుగా పారిపోతుంటాడు. ఆ సైకో కిల్లర్ ను వెంబడిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఆశా భట్ (సయామీ ఖేర్). ఈ నలుగురు ఒకానొక సందర్భంలో తారసపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది “హైవే” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ అయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ వైజ్ చూసుకుంటే.. అతని కంటే సైకో కిల్లర్ గా నటించిన అభిషేక్ బెనర్జీ, పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన సయామీ ఖేర్ ఎక్కువగా కనిపిస్తారు. అయితే.. నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు ఆనంద్. హావభావాల ప్రకటనలో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ.. పాత్రను బానే క్యారీ చేశాడు.
హిందీ నటుడు అభిషేక్ బెనర్జీ సైకో కిల్లర్ గా జీవించేశాడు. అయితే.. అతడి పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ & జస్టిఫికేషన్ లేకపోవడం మైనస్ గా నిలిచింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సయామీ ఖేర్ పర్వాలేదనిపించుకుంది. కమెడియన్ సత్యను సరిగా వినియోగించుకోలేకపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ & సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ కథకుడిగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ వర్క్ కంటెంట్ కి యాప్ట్ గా ఉన్నప్పటికీ.. సరైన విధంగా ఎమోషన్స్ ను ఎలివేట్ చేయలేకపోయింది. ఇక దర్శకుడిగానూ చాలా లాజిక్స్ & సెన్సిబిలిటీస్ మిస్ అయ్యాడు గుహన్. సైకో కిల్లర్ క్యారెక్టర్ ను బేస్ చేసుకుని సినిమా రాసుకున్నప్పుడు/తీసినప్పుడు.. కథ-కథనంలో ఒక గ్రిప్ అనేది చాలా ముఖ్యం. అలాగే.. కిల్లర్ మోటివ్ ఏంటి? అసలు ఎందుకు అలా హత్యలు చేస్తున్నాడు అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు విషయాలను గుహన్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.
అందువల్ల.. సినిమా చూస్తున్నంతసేపూ అటు క్యారెక్టర్ కి కానీ, కథనానికి కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. సైమన్ కె.కింగ్ నేపధ్య సంగీతం బాగుంది. తనకు వీలైనంతలో సినిమాను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే.. స్క్రీన్ ప్లే & ఎస్.ఎఫ్.ఎక్స్ వర్క్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ ను కంగారుగా ముగించేశారని అర్ధమవుతుంది.
విశ్లేషణ: ఒటీటీలో విడుదలైంది కాబట్టి.. హ్యాపీగా ల్యాగ్ ఉన్న సన్నివేశాలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకుంటూ చూసే అవకాశం ఉంది కాబట్టి.. ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న “హైవే”ను ఒకసారి చూడొచ్చు. అయితే.. హీరోగా విజయాన్ని అందుకోవడం కోసం ఆనంద్ దేవరకొండ ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
రేటింగ్: 2/5