‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే మరో రా అండ్ రస్టిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ని పాన్ ఇండియా స్థాయిలో తీసిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది పారడైస్’ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. హాలీవుడ్ సెన్సేషన్ రయన్ రైనోల్డ్స్‌ను సమర్పకుడిగా తీసుకొచ్చేనందుకు చర్చలు జరుపుతున్నారట.
అవి దాదాపు సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కార్యరూపం దాలిస్తే తెలుగు మిడ్ రేంజ్ సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లడం అనేది ఓ రికార్డు అవుతుంది. ఆ తర్వాత మిడ్ రేంజ్ సినిమాలకు కూడా మంచి రోజులు వస్తాయి.
ఇక ‘ది పారడైజ్’ సినిమాని ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా నాని కూడా ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్ తో సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రయన్ రైనోల్డ్స్ కూడా సమర్పకుడిగా చేరితే ఈ ప్రాజెక్ట్ స్కేల్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాఘవ్ జుయాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని భాషల్లోనూ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఆడియో రైట్స్ రూ.18 కోట్ల భారీ రేటుకు అమ్ముడైన సంగతి తెలిసిందే.