How is that for a Monday? సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కౌశిక్ ఘంటసాల (Hero)
  • ఎలెస్టర్ లతమ్ (Heroine)
  • కీగన్ గయ్ (Cast)
  • శ్రీపాల్ సామా (Director)
  • సంధ్యా సామా (Producer)
  • డాన్ విన్సెంట్ (Music)
  • రాహుల్ బిరూలి (Cinematography)
  • Release Date : అక్టోబర్ 27, 2023

కొంతమంది తెలుగోళ్ళు, సినిమా మీద ప్యాషన్ తో అమెరికాలో రూపొందించిన సినిమా “How is that for a Monday?”. కౌశిక్ ఘంటసాల కీలకపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీపాల్ సామా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈవారం వెల్లువలా విడుదలైన చిన్న సినిమాల్లో ఇదీ ఒకటి. మరి ప్యాషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: ఇంటర్లో స్టేట్ సెవెంత్ ర్యాంక్ హోల్డర్, కష్టపడి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకొని.. మరీ హ్యాపీగా కాకపోయినా, ఉన్నంతలో ఒద్దికగా బ్రతికేస్తుంటాడు శ్యామ్ (కౌషిక్ ఘంటశాల). అర్జెంట్ గా క్రెడిట్ కార్డ్ మినిమం బిల్ కట్టాల్సి వచ్చి.. అక్షయ తృతీయ రోజున తన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన గోల్డ్ చెయిన్ & లాకెట్ ను తనఖా పెట్టి 1000 డాలర్లు అప్పు తీసుకొంటాడు.

ఆ వెయ్యి డాలర్లు.. శ్యామ్ జీవితాన్ని మార్చేస్తాయి. తనకు తెలియకుండానే పెద్ద సమస్యలో ఇరుక్కోంటాడు. ఆ సమస్యల సుడి గుండం నుండి శ్యామ్ ను కాపాడింది ఏమిటి? ఈ సోమవారం జరిగిన రచ్చ నుంచి శ్యామ్ ఏం నేర్చుకున్నాడు? అనేది “How is that for a Monday?” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తంలో మనకి పరిచయమున్న ఏకైక వ్యక్తి కౌశిక్ ఘంటశాల. “బ్రోచేవారెవరురా, మెన్ టూ” వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కౌశిక్ ఈ చిత్రంలో శ్యామ్ అనే పాత్రలో నవతరం యువకుడిగా ఒదిగిపోయిన తీరు అలరిస్తుంది. ముఖ్యంగా ఒకర్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించకుండా.. తన మ్యానరిజమ్స్ & బాడీ లాంగ్వేజ్ తో తన సత్తాను చాటుకున్నాడు.

మిగతా హాలీవుడ్ నటుల్లో ఎక్కువగా ఆకట్టుకున్నది ఎలెస్టర్ లతమ్. సినిమాలో ఇతనిది కీలకపాత్ర. చూడ్డానికి బక్కచిక్కిన మైక్ టైసన్ లా ఉంటాడు. తనకు లభించిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. మిగతా నటీనటులందరూ క్యారెక్టర్స్ కు యాప్ట్ గా సెట్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు: రాహుల్ బిరూలి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. లైటింగ్, ఫ్రేమ్స్ మంచి హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ ను ఇస్తాయి. ఒక ఇండిపెండెంట్ సినిమాకు ఈస్థాయి క్వాలిటీ ఎవరూ ఊహించరు. అలాగే.. డాన్ విన్సెంట్ నేపధ్య సంగీతం మరో మంచి టెక్నికల్ ఎస్సెట్ గా నిలిచింది. ముఖ్యంగా సౌండ్ డిజైన్ ను చాలా క్రిస్టల్ క్లియర్ గా వర్కవుట్ చేశారు.

ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, డి.ఐ వంటి టెక్నికల్ అంశాలన్నీ సినిమా స్థాయిని పెంచడానికి, ప్రేక్షకులకి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి తోడ్పడ్డాయి.

ఇక చిత్ర దర్శకుడు శ్రీపాల్ సామ విషయానికి వస్తే.. ఒక రచయితగా, దర్శకుడిగా తన పనితనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఒక సింపుల్ కథను, ఎలాంటి అనవసరమైన సబ్ ప్లాట్స్ లేకుండా, సూటిగా చెప్పాడు. అందువల్ల 88 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఎక్కడా బోర్ కొట్టదు, ముఖ్యంగా సినిమా మొదట్లో చూపించే బిలియనీర్ క్యారెక్టర్ ను లీడ్ గా వాడుకుంటూ నడిపిన సెకండాఫ్ అతడి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. అలాగే.. ఈ సినిమా మాధ్యమంగా అతడు ఇచ్చిన సందేశం ప్రశంసనీయం.

విశ్లేషణ: అమెరికాలో తీసిన తెలుగు సినిమా అంటే.. తెల్ల విలన్లు కూడా తెలుగు డబ్బింగ్ భాషలో మాట్లాడుతూ కాస్త చిరాకు తెప్పిస్తారు. కానీ.. అలాంటి 90ల నాటి సెన్స్ లెస్ థాట్స్ తో కాకుండా.. రియలిస్టిక్ అప్రోచ్ తో, టెక్నికల్ బ్రిలియన్స్ & చక్కని స్టోరీ టెల్లింగ్ తో తెరకెక్కిన చిత్రం “How is that for a Monday?”. 88 నిమిషాల సుత్తిలేని ఎంగేజింగ్ ఫిలిమ్ ఇది. సిన్సియర్ ఫిలిమ్ మేకర్స్ ను ఎంకరేజ్ చేయడం కోసమైన ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి.

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus