హుషారు

  • December 15, 2018 / 02:57 AM IST

కొత్త కుర్రాళ్ళు, కొత్త టీం కలిస్తే వచ్చిన ప్రోడక్ట్ “హుషారు”. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు కొన్నాళ్లుగా ఇబ్బందిపడుతున్నప్పటికీ.. ఎట్టకేలకు ఇవాళ (డిసెంబర్ 14) విడుదలైంది. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ఆ టార్గెట్ ను రీచ్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..!!

కథ : ఆర్య, బంటీ, చైతన్య, ధృవ్ (తేజస్, తేజ్, దినేష్, అభినవ్) అనే నలుగురు కుర్రాళ్ళ కథ ఇది. టెన్త్ లో మొదలైన వీరి స్నేహం చెక్కుచెదరకుండా ఇంజనీరింగ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఇంజనీరింగ్ పూర్తవ్వడంతో లైఫ్ లో సెటిల్ మెంట్ కంటే ముందు లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని.. మందు, అమ్మాయిలు అంటూ తిరుగుతుంటారు. చాలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలు చైతన్యకు క్యాన్సర్ రావడంతో ఒక్కసారిగా యూ టర్న్ తీసుకొంటాయి.

అప్పటివరకూ సంపాదన గురించి ఆలోచించని స్నేహితులు ఉన్నపళంగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించడం మొదలెడతారు. ఆ క్రమంలో రాజ్ (రాహుల్ రామకృష్ణ)ను కలుస్తారు. ఈ అయిదుగురు కలిసి చేసిన అల్లరి, హడావుడి చివరికి ఎక్కడికి దారి తీసింది అనేది “హుషారు” కథాంశం.

నటీనటుల పనితీరు : ఆల్రెడీ ముడునాలుగు సినిమాల ఎక్స్ పీరియన్స్ ఉన్న తేజస్ ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేశాడు. చై మరియు ధృవ్ పాత్రధారుల నటన రెగ్యులర్ గానే ఉంది కానీ.. బంటి పాత్రధారి మాత్రం ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అవుతాడు. నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతోపాటు మంచి ఆఫర్లు కూడా అందిపుచ్చుకోగలుగుతాడు బంటి. అప్పుడెప్పుడో “హోరా హోరీ” సినిమాలో కథానాయికగా కనిపించిన “దక్ష నగ్రాకర్” మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఈ చిత్రంలో మెరిసింది. అనవసరమైన ఎక్స్ పోజింగ్ జోలికి పోకుండా మోడ్రన్ లేడీ రోల్ లో అందంగా కనిపిస్తూనే.. అభినయంతోనే మెప్పించింది. ఈ చిత్రంతో ఆమెకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.

సెకండ్ హీరోయిన్ గా ఉన్నది కాసేపే అయినప్పటికీ ప్రియా వడ్లమాని క్యారెక్టర్ కానీ రోమాంటిక్ సీన్స్ కానీ యూత్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. సెకండాఫ్ లో లేట్ గా ఎంట్రీ ఇచ్చినా ఫ్రస్ట్రేటడ్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా విశేషంగా నవ్వించాడు రాహుల్ రామకృష్ణ. ముఖ్యంగా.. “పిచ్చాక్” సాంగ్ తోపాటు రెండు సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు : రధన్ బాణీలు బాగున్నాయి. అయితే.. ఈమధ్యకాలంలో చాలా వైరల్ అయిన “ఉండిపోరాదే” సాంగ్ మాత్రం విన్నప్పుడు ఉన్నంత ఫీల్.. చిత్రీకరణలో కొరవడింది. దాంతో కాస్త డిజప్పాయింట్ అవుతాము. సన్నీ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవలేకపోయినా.. దర్శకుడి ఆలోచనలను మాత్రం తెరపై ప్రెజంట్ చేయగలిగాడు.

నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. కనీసం లొకేషన్స్ విషయంలో ఇంకాస్త ఖర్చుపెట్టినా బాగుండేది.

దర్శకుడు శ్రీహర్ష ముందుగా కొన్ని సన్నివేశాలు రాసుకొని.. దాన్ని ఒక థ్రెడ్ లా అల్లుకుంటూ వెళ్లిపోయాడు కానీ.. ఒక చక్కని కథ కానీ, ఆ కథను నడిపించే కథనాన్ని కానీ రాసుకోలేదు దర్శకుడు. అందువల్ల ఏవో సన్నివేశాలు అలా కళ్ల ముందు కదలాడుతూ వెళ్లిపోతుంటాయి తప్ప వాటన్నిటినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేసే కథనం మాత్రం కనిపించదు. అందువల్ల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వలేరు. కేవలం కామెడీని, కొన్ని సన్నివేశాలు ఎంజాయ్ చేస్తారంతే.

విశ్లేషణ : యూత్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయి కానీ.. సరైన కథనం మిస్ అయిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా హ్యాపీగా ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus